కేసీఆర్‌ జైళ్లకు భయపడడు..

 KCR to Jails Not afraid..– తెలంగాణ బతుకే నీళ్ల పోరాటం
– రెండు లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలి
– హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ ఓట్లు ఎలా అడుగుతది..?
– బీఆర్‌ఎస్‌ 14 సీట్లు గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం
– జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులూ దద్దమ్మలు..
– చక్కగా ఉన్న రాష్ట్రంలో ఉడుముల్లా వచ్చి అవస్థలు : మిర్యాలగూడ బస్సు యాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌
– దారి పొడవునా రైతులతో ముఖాముఖి
నవతెలంగాణ-మిర్యాలగూడ
జైళ్లకు, తాటిమట్టలకు కేసీఆర్‌ భయపడడని, అలా భయపడితే ఈనాడు తెలంగాణ వచ్చేదా అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సు యాత్ర (పోరుబాట) బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రారంభమైంది. పట్టణంలోని వై జంక్షన్‌ వద్ద కేసీఆర్‌ బస్సు యాత్రకు గులాబీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రాజీవ్‌ చౌక్‌ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. 15 ఏండ్లపాటు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, నీళ్లు.. నిధులు.. నియామకాలపైనే ప్రధానంగా పోరాటం చేశామని అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీళ్ల కోసమే పోరాటం చేస్తున్నామని చెప్పారు. 1956 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్‌ పార్టీనే అని విమర్శించారు. 58 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏపీలో కలిపి గోస పెట్టిందన్నారు. దారి పొడవునా అక్కడక్కడా రైతులతో ముచ్చటించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు కేసీఆర్‌కు తమ బాధలు చెప్పుకున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాక 18 సార్లు పంటలు పండించుకున్నామని, ఏనాడూ నీళ్ల కోసం గోస పడలేదని, సాగర్‌ ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా కాళేశ్వరం ద్వారా నీళ్ళు తెచ్చుకుని పంటలు పండించుకున్నామని కేసీఆర్‌ చెప్పారు. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లా వచ్చి మనకు అవస్థలు తెచ్చిపెడుతున్నారని అన్నారు. అధికారం నుంచి కేసీఆర్‌ పక్కకు పోగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం నాగార్జున్‌ సాగర్‌ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించి తెలంగాణ రైతులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు దద్దమ్మలుగా ఉన్నారని ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగిస్తున్నా కనీసం మాట్లాడ లేదని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక మొదటిసారి పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా 420 హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. రైతుబంధు ఉంటదో.. ఊడుతదో తెలియదని, గతంలో రెప్పపాటు పోని కరెంటు ఇప్పుడు ఉండటం లేదని అన్నారు. మిషన్‌ భగీరథను ఎందుకు నడిపించలేకపోతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ డిసెంబర్‌ 9న చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో ప్రకటించిందని, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదో చెప్పాలని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మాట మారుస్తున్నారన్నారు. హామీలు అమలు చేయని, నీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్‌ ఓట్లు ఎలా అడుగుతదని ప్రశ్నించారు. ప్రజలకు, కాంగ్రెస్‌కు మధ్య పంచాయితీ జరుగుతోందని, అది కేసీఆర్‌ ద్వారానే పరిష్కారం అవుతుందని చెప్పారు. మళ్లీ మన రాజ్యమే వస్తుందని బంగారు తెలంగాణ సాధించుకున్నంత వరకు నిద్రపోనని చెప్పారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 14 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరావు, కంచర్ల భూపాల్‌ రెడ్డి, నల్లగొండ పార్లమెంటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love