– ఐదున కరీంనగర్ జిల్లాలో పంటల పరిశీలన
– లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అస్త్రాలివే…
– కరెంటు కష్టాలు కలిసొస్తాయనే విశ్వాసం
– జిల్లాల వారీగా పర్యటించనున్న కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వర్షాభావ పరిస్థితులు, మండుతున్న ఎండలు, ఫలితంగా తలెత్తిన తాగు, సాగునీటి ఎద్దడులు… ఇవన్నీ అధికార కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితులుగా మారితే, వాటినే తన అస్త్రాలుగా మలుచుకోవాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంచినీటి ఇక్కట్లు మొదలయ్యాయనీ, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అంచనా వేశారు. ఆ మేరకు ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఆ సందర్భంగా ప్రజలు, ముఖ్యంగా రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందని గులాబీ పార్టీ చెబుతోంది. ఈ స్పందనను మరింత సానుకూలంగా మార్చుకోవటం ద్వారా త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ఒక బలమైన ఆయుధంగా మార్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. వీటితోపాటు కరెంటు కష్టాలను తనకు అనుకూలంగా మలచుకోవాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీలు, వాటి అమలు, వాటికి నిధులు తదితరాంశాలపై ఇప్పటికిప్పుడే ప్రజల్లో వ్యతిరేకత రాదని కేసీఆర్ అంచనా వేశారు. అందువల్ల వాటి జోలికెళ్లకుండా ప్రత్యక్షంగా జనం అనుభవించే, వారు నేరుగా ఇబ్బందిపడే తాగు, సాగు నీరు, కరెంటు సమస్యలను అజెండాగా ఎంచుకుని ముందుకు పోవాలని ఆయన నిర్ణయించారు. వీటిపైన్నే ప్రధానంగా దృష్టి సారించి, సర్కారు వైపల్యాలను ఎండగట్టాలంటూ పార్టీ నేతలను ఆదేశించారు. ప్రధానంగా పదేండ్ల తమ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల ద్వారా ఇంటిటికీ మంచినీరు అందించిన వైనాన్ని, సాగునీరు పుష్కలంగా వదిలిన తీరును, ఫలితంగా భూగర్భ జలాలు పెరిగిన వైనాన్ని లెక్కలు, గణాంకాలతో సహా ప్రతీ మీటింగులోనూ వివరించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. దీంతోపాటు రైతు బంధు నిధులు ఆలస్యంగా పడటం, రైతు భరోసా పథకంపై రేవంత్ సర్కార్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవటం అనే అంశాలను ప్రధాన ఇతివృత్తాలుగా ఎంచుకోవాలనీ, ఈ విషయాలపై క్యాడర్‌కు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వీటిని ఎంపీ ఎలక్షన్లలో సాధ్యమైనంత ఎక్కువగా వాడుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం పర్యటన ద్వారా ఈ అంశాలన్నింటిపై ఒక స్పష్టతకు వచ్చినట్టు ఆయన వారికి వివరించినట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్… తన తదుపరి పర్యటనకు బీఆర్‌ఎస్‌కు మంచి పట్టున్న కరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని ఎంచుకున్నారు. ఆ ఎంపీ స్థానం పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల అసెంబ్లీ స్థానాలను కారు పార్టీ గెలుచుకుంది. అందువల్ల కొద్దిగా కష్టపడితే ఆ లోక్‌సభ స్థానాన్ని సులభంగా కైవసం చేసుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఈనెల ఐదున తన తర్వాతి పర్యటనను ఆ జిల్లాలో కొనసాగించనున్నారు. ఒకవైపు బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండగా, ఆ నైరాశ్యం నుంచి కార్యకర్తలు, నాయకులను బయటపడేసేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు గులాబీ బాస్ ఇలాంటి వ్యూహాలను ఎంచుకున్నారని కొందరు కీలక నేతలు వ్యాఖ్యానించారు.