సెమీ ఫైనల్‌లో కేసీఆర్‌ను ఓడించాం…

We beat KCR in the semi-final...– ఫైనల్‌లో మోడీని ఓడించాలి
– మీరే నాయకులకు, ప్రజలకు అనుసంధాన కర్తలు : సోషల్‌ మీడియా వారియర్స్‌ సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సెమీ ఫైనల్‌గా భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించామనీ, ప్రస్తుతం ఫైనల్‌ మ్యాచ్‌ అయిన లోక్‌సభ ఎన్నికల యుద్ధంలో మోడీని ఓడించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌కు సూచించారు. నాయకులకు, ప్రజలకు అనుసంధాన కర్తగా నిలవాలని వారిని కోరారు.నాయకులు ఎన్ని ఉపన్యాసాలిచ్చినా, ఆ విషయాలు ప్రజలకు చేరవేయడమే ముఖ్యమన్నారు. భగవంతుడికి, భక్తుడికి అనుసంధానంగా ఊదిబత్తీ ఉన్నట్టు నాయకులకు, ప్రజలకు సోషల్‌ మీడియా వారియర్స్‌ అనుసంధాన కర్తలుగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యంపైన, రిజర్వేషన్లపై బీజేపీ దాడులు చేస్తోందన్నారు. ఎన్నికల కోసం మతాన్ని, ఏజన్సీలను ఉపయోగించుకుంటుందని తెలిపారు. దాన్ని సోషల్‌ మీడియా ఎదుర్కోవాలని కోరారు. ఇలాంటి విషయాలను సమయస్పూర్తితో తిప్పి కొట్టాలని చెప్పారు. ‘భగవంతుడు గుడిలో ఉండాలి.భక్తి గుండెల్లో ఉండాలి. కానీ మతాన్ని బహిరంగంగా రెచ్చగొట్టి బీజేపీ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన సోషల్‌ మీడియా వారియర్స్‌ సమ్మేళనంలో సీఎం మాట్లాడారు.
ప్రజలకు చేర్చేదే సోషల్‌ మీడియా
ఎంత పెద్ద విషయమైనా ప్రజలకు చేర్చేదే సోషల్‌ మీడియా అన్నారు. క్రికెట్‌ ఫార్మెట్‌ గతంలో మాదిరిగా లేదనీ, ఎంతో మారిపోయిందన్నారు. ఇప్పుడున్న ఫార్మెట్‌లో సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఆడలేరన్నారు.అదే మాదిరిగా సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత వార్తల్లో వేగం పెరిగిందన్నారు. ‘వార్తలను మరుసటి రోజు న్యూస్‌ పేపర్‌లో చదువుకునే వాళ్లం. న్యూస్‌ ఛానల్స్‌ వచ్చినా…ఉదయం నుంచి రెండు మూడు సార్లు మాత్రమే వార్తలు ప్రసారం అయ్యేవి. ఇప్పుడు అవి ప్రతి గంటకు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమం వచ్చాక ప్రతి సెకన్‌కు వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి…సమాచారం అందరికీ చేరవేయాలి. దీన్ని వారియర్లు గుర్తించాలి’ అని సూచించారు. దాని వల్లనే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. బీజేపీ భావజాలమంతా ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చినదేనన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే వారి విధానాన్ని ఈస్టిండియా కంపెనీ మొదట ప్రవేశ పెట్టి, ఆ తర్వాత క్రమంగా దేశం మొత్తాన్ని ఆక్రమించిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కూడా బ్రిటీష్‌ విధానాన్ని పాటించి దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ అంటే…బ్రిటిష్‌ జనతా పార్టీ. బ్రిటిష్‌ వారి నుంచి స్పూర్తిగా తీసుకున్నారు.పైసల కోసం పని చేసే వాళ్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌లో ఉంటారు. ప్రాణానికి ప్రాణంగా పార్టీ కోసం పని చేసే వాడు కాంగ్రెస్‌లో ఉన్నారు. నాయకుడికి వెన్నంటి నిలబడేవాడే సామాజిక వారియర్‌ అని కొనియాడారు.
కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు
కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌ ఉంటే తమ ఆటలు సాగబోవనీ, ఆయన లేకపోతే చాలు.. ఎవరైనా ఫర్వాలేదు అనే పరిస్థితికి బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లలో గెలిపిస్తే ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ అంటున్నారనీ, అదెలా సాధ్యం? అని ప్రశ్నించారు. ఇక్కడ అల్లాటప్పాగా కూర్చున్నామా? తండ్రి పేరు చెప్పుకొని కుర్చీలోకి వచ్చామా? ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే 400 సీట్ల నినాదాన్ని బీజేపీ చేస్తోందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోందని తెలిపారు.
హరీశ్‌రావ్‌.. నీ రాజీనామా స్పీకర్‌ ఫార్మెట్‌లో లేకుంటే చెల్లుతుందా?
– రుణమాఫీ చేసి తీరుతాం
– ఆగస్టు 15న సిద్దిపేటకు శని వదిలిపోతుంది
స్పీకర్‌ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? అంటూ హరీశ్‌రావును సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారని ఎద్దేవా చేశారు. మళ్లీ చెప్తున్నా… ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామన్నారు. స్పీకర్‌ ఫార్మెట్‌లో హరీశ్‌రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని సవాల్‌ విసిరారు. ఆ రోజు సిద్దిపేటకు ఆయన శని వదిలిపోతుందని చెప్పారు. రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు? అని ప్రశ్నించారు. దానికి రూ.30-40వేల కోట్లు అవుతుందన్నారు. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్‌ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా? అని ప్రశ్నించారు. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు అమరవీరుల స్థూపం గుర్తుకొస్తుందన్నారు.

Spread the love