సుర్రుమంటున్న సూరీడు

Surrummanta the sun– గడప దాటాలన్నా భయం..భయం..
– సాయంత్రం వరకూ వేడి గాలులు
– మండిపోతున్న తెలంగాణం
– జమ్మికుంటలో 45.6 డిగ్రీలు
– ఈ ఏడాది ఇదే అత్యధికొం చాలా జిల్లాల్లో 44 డిగ్రీలకుపైనే నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణం మండిపోతున్నది. ఎన్నికల వేడి కంటే భానుడి ఎండ తీవ్రతే ఎక్కువగా కలవరపెడుతున్నది. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. చాలా జిల్లాల్లో పగటిపూట 44 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 24 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు నమోదవుతుండటం గమనార్హం. ఏప్రిల్‌ చివరి వారంలోనే ఈ తరహాల్లో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరై పోతున్నారు. ఉక్కపోత తీవ్రంగా ఉంది. దీనికి తోడు సాయంత్రం ఆరేడు గంటల దాకా వేడిగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు సాయంత్రం వరకు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఉష్ణతాపానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందనివాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఐదు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశమున్నదనీ, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హన్మకొండ, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల్లో పలుచోట్ల వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్రంలో ఒకటెండ్రు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.
తగ్గుతున్న తేమ..జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
గాలిలో తేమశాతం వేగంగా పడిపోతున్నది. ఓవైపు ఎండలు, మరోవైపు వేడిగాలులు, ఇంకోపక్క తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు నడుస్తున్నా వశం కాని పరిస్థితి. ఎండ, వడగాల్పులతో డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బకు గురయ్యే అవకాశమున్న నేపథ్యంలో వీలైనంత మేర అరగంటకోసారి దాహం వేయకున్నా నీళ్లు తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఐదు లీటర్ల నీటినైనా తాగాల్సిందే. దీనికి తోడు ఎండదెబ్బ నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండలో తిరిగేవారైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ విధిగా తమ వెంట వాటర్‌ బాటిల్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచుకోవాలి.
జమ్మికుంట(కరీంనగర్‌) 45.6 డిగ్రీలు
నిడమనూరు(నల్లగొండ) 45.2 డిగ్రీలు
మంథని(పెద్దపల్లి) 45.2 డిగ్రీలు
మర్యాల (యాదాద్రి భువనగిరి) 45.1 డిగ్రీలు
మాడ్గులపల్లి(నల్లగొండ) 45.1 డిగ్రీలు
వీణవంక(కరీంనగర్‌) 45.1 డిగ్రీలు
వెల్గటూరు(జగిత్యాల) 45.1 డిగ్రీలు
కొల్వాయి(జగిత్యాల) 45.1 డిగ్రీలు
మాటూరు(నల్లగొండ) 45.0 డిగ్రీలు
కన్నాయిపల్లి(వనపర్తి) 45.0 డిగ్రీలు

Spread the love