తొలి రోజు నామినేషన్ల పర్వం

first day Festival of nominations– పత్రాలు సమర్పించిన కీలక నేతలు
– కాంగ్రెస్‌, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు
నవతెలంగాణ-విలేకరులు
తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం ప్రారంభమైంది. గురువారం ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలకనేతలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు సైతం తమ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి గురువారం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ తెలిపారు. మల్కాజిగిరి జిల్లా పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, అలాగే బీజేపీ అభ్యర్థిగానే ఆయన భార్య ఈటల జమున నామినేషన్‌ దాఖలు చేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పాలది పవన్‌ కుమార్‌, బేగరి లోకేష్‌, చిలకా చంద్రశేఖర్‌, మలోటు శంకర్‌, అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ అభ్యర్థిగా మేడే సత్యం నామినేషన్‌ దాఖలు చేశారు. పెసరికాయల పరీక్షిత్తు రెడ్డి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయగా మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రవికుమార్‌కు తన నామినేషన్‌ పత్రాలు అందజేశారు. నాగర్‌కర్నూల్‌ ఎస్సీ రిజర్వుడ్‌ పార్లమెంట్‌కు బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ తన మొదటి సెట్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించగా, ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లు రవి తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ పి. ఉదరు కుమార్‌కు సమర్పించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తొలి రోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి నాలుగు నామినేషన్లు, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఒక నామినేషన్‌ సమర్పించారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నీలం మధు తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ రాజ్‌కు అందజేశారు. తెలంగాణ ప్రజాశక్తి పార్టీ తరపున దొడ్ల వెంకటేశం, స్వతంత్ర అభ్యర్థిగా చిక్కుపల్లి నవీన్‌కుమార్‌ నామినేషన్‌ వేశారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సురేష్‌ కుమార్‌ షేట్కర్‌ నామినేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, సంగారెడ్డి కలెక్టర్‌ క్రాంతి వల్లూరుకు అందచేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గానికి మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలయినట్టు రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శశాంక్‌ తెలిపారు. సోషలిస్టు పార్టీ ఇండియా పార్టీ అభ్యర్థిగా బి. వెంకట్‌ రమేష్‌ బాబు, స్వతంత్ర అభ్యర్థిగా మహమ్మద్‌ ముస్తాఫా రిజ్వాన్‌, ఇండియా ప్రజా బంధు పార్టీ అభ్యర్థిగా పాలమాకుల మధు ఒక్కో సెట్‌ చొప్పున రాజేందర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. ఖమ్మం పార్లమెంట్‌ స్థానానికి ఆధార్‌ పార్టీ నుంచి కుక్కుల నాగయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. నల్లగొండ పార్లమెంట్‌ ఎన్నికలకు తొలిరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చోల్లేటి ప్రభాకర్‌.. తొలి నామినేషన్‌ పత్రాన్ని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి హరిచందన దాసరికి అందజేశారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున ఆపార్టీ రాష్ట్ర నాయకులు మాధగోని శ్రీనివాస్‌ గౌడ్‌, బండారు ప్రసాద్‌ తదితరులు నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. సోషలిస్ట్‌ పార్టీ అభ్యర్థిగా ఆర్‌. సుభద్ర రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్ధులుగా బేతి నరేందర్‌ ఒక సెట్‌, మర్రి స్వామి ఒక సెట్‌ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ కే. హనుమంతుకు తమ నామినేషన్లను అందజేశారు. వరంగల్‌ లోక్‌సభ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసినట్టు వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి ప్రావీణ్య తెలిపారు. ఆలయెన్స్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ అభ్యర్థిగా అంబోజు బుద్దయ్య, ఇండిపెండెంట్‌గా బరిగెల శివ, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (రిజిష్టర్డ్‌ అన్‌ రికాగజైస్డ్‌) అభ్యర్థిగా తౌటపల్లి నర్మద ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్లను దాఖలు చేశారు. అలాగే మహబూబాబాద్‌ జిల్లా ఎస్టీ పార్లమెంటు స్థానానికి.. స్వతంత్ర అభ్యర్థిగా భానోత్‌ లింగ్యా నాయక్‌.. రిటర్నింగ్‌ అధికారి అద్వైత్‌ కుమార్‌ సింగ్‌కు తన నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆధార్‌ పార్టీ అభ్యర్థిగా మాలోత్‌ శ్యామ్‌లాల్‌ నాయక్‌, స్వతంత్ర అభ్యర్థిగా రాథోడ్‌ సుభాష్‌ నామినేషన్‌ పత్రాలను కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజర్షి షాకు అందించారు. కరీంనగర్‌ ఎంపీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్ధులుగా కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కోట శ్యాం కుమార్‌, గంగాధర్‌ మండలం గట్టుబూత్కూరు గ్రామానికి చెందిన పొత్తూరి రాజేందర్‌.. తమ నామినేషన్‌ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతికి అందజేశారు.

Spread the love