పథకాలను సీఎం నిర్వీర్యం చేస్తున్నారు

The CM is debilitating the schemes– బీజేపీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు
– పాలమూరు కార్నర్‌ మీటింగ్‌లో మాజీ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
”రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు.. దేశంలో పదేండ్ల బీజేపీ పరిపాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మాట నిలుపుకోని బీజేపీకి మళ్లీ ఎందుకు ఓటేయాలి..? ప్రధాని మోడీ కట్టు కథలు.. పిట్టకథలు చెప్పడం తప్ప ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదని, పైగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని” కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన రోడ్‌ షో అనంతరం క్లాక్‌ టవర్‌ దగ్గర కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. బేటీ పడావో బేటీ బచావో అన్నది నినాదం తప్ప కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క బేబీని కాపాడలేదని, చదివించలేదని విమర్శించారు. సబ్కా వికాస్‌ అనే నినాదం కాగితాలపైనే కానీ పేదల జీవితాల్లోకి తొంగి చూడలేదని అన్నారు. భవిష్యత్‌ అంతా అమృత్‌కాలంగా ఉంటుందన్న మోడీ పాలన.. పారిశ్రామికవేత్తలకే అమృత కాలంగా మారిందని విమర్శించారు. ఆత్మ నిర్భర భారత్‌ ఏమైందని ప్రశ్నించారు. ఫసల్‌ బీమాలో పసలేకుండా పోయిందన్నారు. పథకాలను అమలు చేయకుండా.. ఉన్నవాటిని నిర్వీర్యం చేస్తున్న మోడీకి మూడోసారి ప్రధానిగా ఎందుకు అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు. కేంద్రంలో మోడీ పథకాలు ఇలా ఉంటే.. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి మరోరకంగా పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ఎకరాకు రూ.15000 ఇస్తానన్న రేవంత్‌ రెడ్డి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. డిసెంబర్‌ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని భరోసా ఇచ్చి ఓట్లు దండుకొని గద్దెనెక్కి.. ఇప్పుడు జోగులాంబ సాక్షిగా, దేవుడు సాక్షిగా అంటూ ప్రమాణం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. యాసంగికి బోనస్‌ కాకుండా ఖరీఫ్‌కు ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెడితే రాష్ట్ర ప్రభుత్వం దానికి వత్తాసు పలికే అవకాశాలు ఉన్నాయన్నారు. కల్యాణ లక్ష్మి, పింఛన్ల పెంపుదల వంటి పథకాల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అందుకే పార్లమెంట్‌ ఎన్నికల్లో మన గొంతును వినిపించే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ లక్ష్మారెడ్డి, నాయకులు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, నరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love