ఎకరాకు రూ.25వేల పరిహారమివ్వాలి

25 thousand per acre should be compensated– మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నరు..?
– రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది
– 2వ తేదీన రైతుల పక్షాన కలెక్టర్లకు వినతిపత్రాలివ్వాలి
– అధైర్య పడకండి.. అండగా నేనుంటా :బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌
– మెదక్‌, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఎండిన వరి పంటల పరిశీలన
నవతెలంగాణ-సూర్యాపేట/ జనగామ
రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని ‘వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తాం’ అని హెచ్చరించారు. అవసరమైతే ఎక్కడికక్కడ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయలుదేరారు. అనంతరం అక్కడ నుంచి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోనూ పర్యటించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్‌తండాలో ఎండిన వరి పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు ఆంబోతు సత్తమ్మ మాజీ సీఎం కేసీఆర్‌కు తమ సమస్యను వివరించారు. 8 ఎకరాల్లో వరి వేశానని, సాగునీరు అందక ఆరు ఎకరాల పంట ఎండిపోయిందని తెలిపారు. గతంలో నాలుగు బోర్లు వేసి నష్టపోయామని, ఇప్పుడు పంట చేతికి వస్తుందనుకుంటే ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి పెండ్లి చేద్దామనుకున్నామని.. ఇలాంటి నష్టం ఎదురైందని తెలిపారు. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ.. పంట ఎండిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చే విధంగా రైతుల పక్షాన ఉండి పోరాడుతానని తెలిపారు. రైతులు అధైర్య పడొద్దని, అండగా ఉంటానని భరోసానిచ్చారు. అదేవిధంగా ఆంబోతు సత్తమ్మ కుమార్తె వివాహానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌కు సూచించారు. ఎండిన పంటను పరిశీలించి రైతుల గోడును వినడం జరిగింది కానీ ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉందని, మాట్లాడలేకపోతున్నానని కేసీఆర్‌ అన్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే బండ ప్రకాష్‌, ఎమ్మెల్సీ రవీందర్‌ రావు, క్యామ మల్లేశం తదితరులు ఉన్నారు.
సూర్యాపేట నియోజకవర్గంలోని తుంగతుర్తి, తదితర ప్రాంతాల్లో నీళ్లందక ఎండిపోయిన పంటలను కేసీఆర్‌ పరిశీలించారు. అనంతరం సూర్యాపేట పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒకప్పుడు పంటలు నష్టపోతే కేంద్రానికి నివేదిక పంపించాల్సి ఉండేదని, మూడు నెలల తర్వాత అధికారులు వచ్చి పరిశీలించి.. రిపోర్టు రాసేవారని, అయినా రైతులకు పరిహారం అందే పరిస్థితి ఉండేది కాదన్నారు. అందుకే ఆనాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని మార్చేశానని తెలిపారు. భయంకరమైన రాళ్ల వాన పడి మహబూబాబాద్‌, ఖమ్మం.. ఇలా చాలా జిల్లాల్లో పంట నష్టం జరిగితే స్వయంగా వెళ్లి పరిశీలించి.. ఆ పొలంలోనే నిల్చుండి ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ప్రకటించడమే కాకుండా.. ఐదారు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్లకు పైగా నష్టపరిహారం రైతులకు అందించానని గుర్తు చేశారు. అదే ఇవాళ వడగండ్లతో కూడిన అకాల వర్షాలు పడి సుమారు లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతే అడిగే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా సరే.. రణరంగమైనా సరే.. ఈ ప్రభుత్వం మెడలు వంచి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. 2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగిపోయిన నాడు కూడా రూ.470 కోట్ల బకాయిలు పెట్టిపోతే.. మేం ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇచ్చామని, అదే ఈనాడు తాము ఏ బకాయిలు పెట్టలేదని తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్‌, టీడీపీ పరిపాలనలో ఏనాడు ఇవ్వని రూ.10వేల నష్టపరిహారం అందిస్తే.. ఆనాడు దాన్ని ఎకసెక్కం చేసి మాట్లాడారన్నారు. రూ.10 వేలు ఏమూల సరిపోద్ది.. రూ.20 వేలివ్వాలని ఆనాడు కాంగ్రెస్‌ నాయకులు అన్న మాటలను గుర్తు చేశారు. ప్రజల తరఫున మాట్లాడేటోళ్లు లేరని అనుకుంటున్నారా? ఒక మహాసముద్రం అంత బీఆర్‌ఎస్‌ పార్టీ ఉందని, ఊరుకోదని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వందకు వందశాతం రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పంటలను మీరే ఎండబెట్టారు కాబట్టి.. మీ అసమర్థత వల్లే ఎండిపోయినయి కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఎన్యుమరేట్‌ చేయాలని సూచించారు. ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ రైతు పంట ఎంత ఎండిపోయిందనే లెక్కలు తీయాలన్నారు. ధరలు అన్నీ పెరిగినరు కాబట్టి.. ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘మీరు ఒకర్నో.. ఇద్దర్నో కుక్కల్నో.. నక్కల్నో గుంజుకుని ఓహో.. అహా.. అని సంకలు గుద్దుకోవచ్చు.. అది చిల్లర రాజకీయ స్టంట్‌ మాత్రమే ప్రజల సమస్యల ముందు, వారి బాధ ముందు.. ఎండిపోయిన పంటల ముందు.. చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో తిరిగి మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నరు..? ఎందుకు నీటిమోతలు స్టార్ట్‌ అయ్యాయంటూ సర్కారును నిలదీశారు. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ, 15-16 రాష్ట్రాలు కొనియాడి అమలు చేసుకుంటున్న మిషన్‌ భగీరథ పథకం ఉండి కూడా రాష్ట్రంలో ఎందుకు మంచినీళ్ల కొరత వచ్చిందని ప్రశ్నించారు. చీఫ్‌ సెక్రెటరీ స్టేట్‌మెంట్‌లో సోర్సెస్‌ అన్నీ బరాబర్‌ ఉన్నరు.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఈ టర్మ్‌లోగా భగీరథ కంప్లీట్‌ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని.. ఓట్లు అడగదని ఛాలెంజ్‌గా చెప్పి పథకాన్ని పూర్తి చేశామన్నారు. ఆ తర్వాత ఐదేండ్లు బ్రహ్మాండంగా నడిపామని, బిందెపట్టుకొని ఆడబిడ్డ ఎక్కడా రోడ్డుపై కనిపించలేదని అన్ని మామయ్యాయని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ మంచినీళ్ల ట్యాంకర్లు ఎందుకు విచ్చలవిడి వ్యాపారం చేస్తున్నాయని, హైదరాబాద్‌ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురించిందని, ఇవీ ఆలోచించాల్సిన విషయాలని తెలిపారు. రాష్ట్ర అవతరణ అనంతరం చాలా దారుణంగా ఉన్న విద్యుత్‌ రంగాన్ని మూడు నెలల్లోనే సుమారు రూ.35వేలకోట్లు ఖర్చు చేసి.. రకరకాల పద్ధతులు అవలంబించి.. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీని సంప్రదించి.. మెదడును కరగదీసి.. విద్యుత్‌ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. దేశంలో.. ఒక సెకండ్‌ కరెంట్‌ పోకుండా అన్నిరంగాలకు 24గంటలు కరెంట్‌ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంటు పోతే వార్త అని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త అని విమర్శించారు.
రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది?
గత బీఆర్‌ఎస్‌ పాలనలో అగ్రగామిగా తెలంగాణ.. నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్రానికి చెదలు పట్టి అస్తవ్యస్తంగా మారిందని మాజీ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.కొత్తగా నడిపించేది ఏమీ లేదని, కొత్తగా మొద్దులు మోసేది లేదని, కట్టెలు కొట్టేది లేదని, కొత్త గడ్డపారలు పట్టి తవ్వేది లేదని, ఉన్న వ్యవస్థ ఉన్నట్లు నడిపించలేని అసమర్థత, అశక్తత రాష్ట్ర ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అవివేకం, తెలివితక్కువ తనం, అవగాహనా రాహిత్యం, దేన్నీ ఎట్లా వాడాలో తెలియని అర్భకత్వం తమకు కనిపిస్తుందని దుయ్యబట్టారు. ఉన్న కరెంటును, మిషన్‌ భగీరథను వాడుకునే తెలివి లేక.. మళ్లీ జనరేట్లర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే పంటలను ఎండబెట్టిందని.. రైతులను వారే ఆదుకోవాలని లేకుంటే.. ఏప్రిల్‌ 2న బీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతుల పక్షాన జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. అదే రోజు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. హైదరాబాద్‌లో ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తారని చెప్పారు. పంటలకు బోనస్‌ కోసం ఏప్రిల్‌ 6న ఒక్క రోజు దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. రైతులను ఆదుకునే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని నిలదీస్తామని, నిరనసలు, ధర్నాలు చేపడతామని స్పష్టంచేశారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని.. వారి పక్షాన తాము పోరాడతామని తెలిపారు. సమావేశంలో మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు, జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థులు మల్లేష్‌, కంచర్ల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ దీపిక, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, చిరుమర్తి లింగయ్య, రవీంద్రనాయక్‌, ఫైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్‌ వాహనం తనిఖీ
ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో.. ఎండిన పంటలను పరిశీలించడానికి వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్‌ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధారావత్‌తండాలో రైతుల ఎండిన పంటలను పరిశీలించి అక్కడి నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటనకు బయలుదేరారు.
కాగా, ఈదులపర్రె తండా మీదుగా సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశిస్తున్న కేసీఆర్‌ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు.

Spread the love