మోడీ ఓ కాలనాగు

Modi Oh Kalanagu– మళ్లీ గెలిస్తే రాజ్యాంగం రద్దు
– బీజేపీ అంటే బ్రిటిష్‌ జనతా పార్టీ
– గుజరాతీ బ్యాచ్‌ దేశ సంపదను దోస్తోంది
– రూ.60 లక్షల కోట్ల పబ్లిక్‌ సెక్టార్‌ను మింగేసిండ్రు
– బిడ్డ బెయిల్‌ కోసం బీజేపీ గెలుపునకు కేసీఆర్‌ గూడుపుఠానీ
– వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేశాం
– జహీరాబాద్‌లో ఫార్మాక్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం : పెద్ద శంకరంపేట సభలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ – మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
నరేంద్ర మోడీ పగబట్టిన కాలనాగు లాంటోడని, మళ్లీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతాంగంపై ఉన్న పగతో రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేటలో నిర్వహించిన జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార జనజాతర సభకు హాజరై మాట్లాడా రు. బ్రిటీష్‌ వాళ్లు గుజరాత్‌లోని సూరత్‌ నుంచి ఇండియాలోకి వచ్చి మన మధ్య విభజన, విద్వేషాలు నింపి దేశాన్ని వందేండ్లు పాలించి సంపదను దోచుకు న్నారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం అనంతరం 75 ఏండ్ల తర్వాత అదే గుజరాతీ, సూరత్‌ బ్యాచ్‌ మోడీ, అమిత్‌ షా.. బయలుదేరి ప్రజల మధ్య మతం, కులం, భాష పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి దేశ సంపద, వనరులను దోచుకుంటున్నారని తెలిపారు. మోడీ, అమితాషాకు తోడు అంబానీ, అదానీ కలిసి ఆ నలుగు రు విష పూరితంగా ఆలోచిస్తూ బ్రిటీషోళ్ల మాదిరే దేశాన్ని దోచుకుంటున్నారని అన్నారు. బీజేపీ అధికా రంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారని తెలిపారు. నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూసిన మోడీకి చెమటలు పట్టించి రైతులు పోరాడారని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. రూ.60 లక్షల కోట్లు విలువచేసే పబ్లిక్‌ రంగ సంస్థలను కార్పొరేట్‌ దోస్తులకు కట్టబెట్టి ఉపాధి లేకుండా చేశారని అన్నారు. రిజర్వేషన్స్‌ను కాపాడుకోవడంతో పాటు బీసీ జనగణన చేసి వాళ్లకు రిజర్వేషన్‌ ఇప్పించేందుకు రాహుల్‌ గాంధీ ఆరు గ్యారంటీల్లో భరోసా ఇచ్చారని తెలిపారు. పదేండ్ల్లు మోసం చేసిన బీజేపీకి ఓట్లు వేస్తారో…? లేక వంద రోజుల్లో ఇచ్చిన మాట మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసిన కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారో ప్రజలు ఆలోచించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. కేసీఆర్‌ ఆరోగ్య శ్రీని ఆగం పట్టించి ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేస్తే కాంగ్రెస్‌ ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచింద న్నారు. కట్టెల పొయ్యి కష్టాలకు స్వస్తి పలికేందుకే రూ..500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామన్నారు. 30వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను ఓడించాలని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి గుడుపుఠానీ నడుపుతున్నా యన్నారు. బిడ్డ బెయిల్‌ కోసం జహీరాబాద్‌ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను బీజేపీలోకి తొలిందే కేసీఆర్‌ అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌ను కేసీఆర్‌ గాలికి వదిలేశారని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శెట్కార్‌ను గెలిపిస్తే జహీరాబాద్‌, నారాయణ ఖేడ్‌ ప్రాంతంలో 2 వేల ఎకరాల్లో ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల తర్వాత మహిళా ఐటీఐ కాలేజీ ఇస్తామన్నారు. అనంతరం మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే సమాజానికే పెను ప్రమాదం అన్నా రు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ను గెలిపిం చాలని కోరారు. ఈ సభలో అభ్యర్థి సురేష్‌ కుమార్‌ శెట్కార్‌, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు సంజీవ రెడ్డి, మదన్‌ మోహన్‌, లక్ష్మి కాంతారావు, రోహిత్‌ చౌదరి పాల్గొన్నారు.

Spread the love