ఇసుక క్వారీల్లో వసూళ్లను అరికట్టాలి

ఇసుక క్వారీల్లో వసూళ్లను అరికట్టాలి– టీఎస్‌ఎమ్‌డీసీ ఇన్‌చార్జి ఎమ్‌డీ మహేశ్‌దత్‌ ఎక్కాకు తెలంగాణ స్టేట్‌ లారీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో టీఎస్‌ఎమ్‌డీసీ నిర్వహిస్తున్న ఇసుక క్వారీల్లో ప్రతి లారీ నుంచి రూ.3,500 వసూలు చేస్తున్నారనీ, దీనిని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ స్టేట్‌ లారీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్‌ కోరారు. శుక్రవారం ఈ మేరకు టీఎస్‌ఎమ్‌డీసీ ఇన్‌చార్జి ఎమ్‌డీ, ప్రభుత్వ కార్యదర్శి మహేశ్‌ దత్‌ ఎక్కాకు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా ఇసుక క్వారీల్లో దొడ్డు ఇసుక, సన్న ఇసుక పేరిట రూ.5000 నుంచి 7000 తీసుకుంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వేసవి కాలం దృష్ట్యా క్వారీల దగ్గర డ్రైవర్ల కోసం తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలనీ, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని కోరారు. వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ముందు జాగ్రత్తగా డంపింగ్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఇన్‌చార్జి ఎమ్‌డీ హామీనిచ్చారని యాదయ్యగౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో గుండు లింగన్నగౌడ్‌, లింగస్వామి గౌడ్‌ కూడా పాల్గొన్నారు

Spread the love