అకాల వర్షాల వల్ల నష్టపోయినవారిని ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రవ్యాపితంగా మే 7న ఈదురుగాలులు, వడగండ్ల వర్షాల వల్ల ఏడుగురు మృతిచెందారు. కరెంట్‌ స్థంబాలు, చెట్లు విరిగిపోవడంతో అనేక ఇండ్లకు నష్టం వాటిల్లింది. మార్కెట్లల్లో ధాన్యం తడిచి, బస్తాలు కొట్టుకుపోయాయి. ఇంకా యాసంగి కోతకొచ్చిన వరి పంట దెబ్బతిన్నది. జొన్న, వేరుశనగ, మొక్కజొన్న పంటలతో పాటు, కూరగాయలు, మామిడి తదితర పండ్లతోటలకు నష్టం కలిగింది. తక్షణమే నష్టపోయిన రైతులకు, సామాన్య ప్రజలకు నష్టపరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపద్యంలో మార్కెట్లలో తగు రక్షణచర్యలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నది.
గత డిశంబర్‌ 4-7 తేదీల్లో మిచౌంగ్‌ తుఫాన్‌వల్ల రాష్ట్రంలో 2లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  49 మంది చనిపోయారు. మార్చి 18న వడగండ్ల వర్షాలకు 20వేల ఎకరాల్లో నష్టం జరిగింది. 16వేల మంది రైతులు నష్టపోయారు. నష్టపోయిన వారికి ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీన్నుండి రైతులు కోలుకోకముందే ఈ ఆకస్మిక వర్షాల వల్ల మరింత నష్టం వాటిల్లింది.   అకాల వర్షాలకు చనిపోయినవారి కుటుంబాలకు రు.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు దెబ్బతిన్న ఇండ్లకు మరమ్మత్తుల కోసం రు.10వేలు చెల్లించాలి. మార్కెట్లలో ధాన్యం కొట్టుకుపోయి నష్టపోయిన వారికి తగు పరిహారం చెల్లించాలని, తడిచిన ధాన్యాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరుతున్నది.

Spread the love