ఐదు గ్యారంటీలే ఎజెండా

Five guarantees are the agenda– దేశమంతటా తెలంగాణ, కర్నాటక మోడల్‌
– మహిళలు, రైతులు, యువత టార్గెట్‌గా మ్యానిఫెస్టో
– ప్రజల ఆశీర్వాదం ఉంటుందన్న ధీమాలో కాంగ్రెస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వీలుగా కాంగ్రెస్‌ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను మోడల్‌గా ఎంచుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అవలంభించిన వ్యూహాన్నే దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఐదు గ్యారంటీలతో రెండు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్‌ ఐదు న్యాయాలు (పాంచ్‌ న్యారు) ఎజెండాతో దేశ ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఆ ఎజెండాతో పాటు మ్యానిఫెస్టోలో మహిళలు, రైతులు, యువత ఓట్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక, తెలంగాణలో మ్యానిఫెస్టో రూపకల్పనకు ప్రజలు, మేధావులు, నాయకుల నుంచి కాంగ్రెస్‌ అభిప్రాయాలను సేకరించింది. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రాల వారీగా అభిప్రాయాలను స్వీకరించింది. వీటిపై పార్టీ ఉన్నత స్థాయిలో దశల వారీ అంతర్గత చర్చలు జరిపి పాంచ్‌ న్యారుతో పాటు మ్యానిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకురానుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అమలు చేసిన మహాలక్ష్మి స్కీమ్‌ మహిళా సాధికారతకు కొత్త బాటలు వేసిందని ఆ పార్టీ చెబుతోంది. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రకటించిన పథకాలు ఇంటింటికి ఆర్థిక బాసటనిస్తూ మహిళా ఓటర్లను కాంగ్రెస్‌కు మరింత దగ్గర చేశాయని అది భావిస్తున్నది. ఈ పథకాల స్ఫూర్తితో ప్రతి పేద కుటుంబంలో మహిళకు ఏడాదికి రూ.ఒక లక్ష ఆర్థిక సాయంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ఇచ్చిన హామీ మహిళలను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నదని పార్టీ నేతలు చెబుతున్నారు.
రాష్ట్రంలో బీసీ కుల గణనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూల ఫలితాలను ఇచ్చిందనే అంచనాకు ఆ పార్టీ వచ్చింది. దీంతో దేశమంతటా కుల గణన చేపట్టనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచి అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆ వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కుమరం భీం ‘ జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదం ‘ స్ఫూర్తితో సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కుల కోసం పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు పరిష్కరిస్తామని ఈ ఎన్నికల్లో హామీ ఇవ్వడం గమనార్హం.
పంటల మద్ధతు ధరలకు చట్టబద్ధత, అప్పుల బాధ నుంచి రైతులకు ఉపశమనం కల్పించేందుకు శాశ్వత రైతు రుణమాఫీ కమిషన్‌, పంట నష్టపోయిన రైతులకు 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లిస్తామనే గ్యారంటీలు.. ఈ ఎన్నికల్లో కీలకంగా మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలోనూ రోజుకు కనీస కూలీ రూ.400 ఇవ్వాలని తీర్మానించడం, గ్రామీణ పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకూ దాన్ని పథకం అమలు చేస్తామని ప్రకటించడమూ ఆయా వర్గాలను పెద్ద ఎత్తున తమ వైపునకు నడిపిస్తాయని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Spread the love