హోలీ వేడుకల్లో విషాదం

Tragedy during Holi celebrations– ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరుగురు మృతి
– చావులోనూ వీడని స్నేహబంధం
నవతెలంగాణ – కౌటాల, దండేపల్లి, ఆదిలాబాద్‌ రూరల్‌
హోలీ పండుగ ఆ కుటుంబాల్లో సంతోషం.. సరదా.. రంగుల జీవితాలను మాజం చేసింది. ఉదయం నుంచి స్నేహితులంతా కలిసి రంగుల చల్లుకుని కేరింతలు కొడుతూ సంతోషంగా గడిపిన వారు.. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే విగతజీవివులుగా మారారు. స్నానానికెళ్లి నీటిలో మునిగి ఆరుగురు ప్రాణం కోల్పోయారు. దాంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కౌటాల మండలంలో నలుగురు, దండేపల్లి మండలంలో ఒకరు ప్రాణం కోల్పోయారు. కౌటాలలో హోలీ వేడుకల్లో కేరింతలు కొట్టి సరదా కోసం తాటిపెల్లి వార్దా నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు చనిపోయారు. నదీమాబాద్‌కు చెందిన పనాస కమలాకర్‌, ఉప్పుల సంతోష్‌, ఎలుములె ప్రవీణ్‌, ఆలం సాయి, నవీన్‌, సంతోష్‌ మొత్తం ఆరుగురు మిత్రులు రంగులు చల్లుకుని హౌలీ ఆడారు. ఆ తర్వాత స్నానం చేసేందుకు మండలంలోని తాటిపెల్లి గ్రామ సమీపంలో ఉన్న వార్దా నదికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే నవీన్‌కు ఇంటి నుంచి ఫోన్‌ రావడంతో మళ్లీ వస్తానని కౌటాలకు వచ్చాడు. మిగతా ఐదుగురిలో పనాస కమలాకర్‌(23) ఉప్పుల సంతోష్‌(22), ఎలుములె ప్రవీన్‌(23), ఆలం సాయి(20) నీటిలోకి దిగారు. సంతోష్‌ బయట వస్తువులు, బట్టల వద్ద కాపలాగా ఉన్నాడు. నీటిలో ఒకరు మునిగిపోతుండగా మరొకరు.. ఇలా ఒకరి తర్వాత ఒకరు నలుగురూ మునిగిపోయారు. అది గమనించి బయట ఉన్న సంతోష్‌ కాపాడండి అంటూ అరుస్తుండగానే నలుగురూ నీటిలో మునిగిపోయారు. దాంతో సంతోష్‌ పరుగుపరుగున వెళ్లి కొంతమందిని తీసుకొచ్చాడు. ఈత వచ్చిన వారు నీటిలో దిగి గాలించినా ఫలితం లేకపోయింది. ఎలుములె ప్రవీణ్‌కు వివాహమై ఏడాది కుమారుడు, భార్య ఉన్నారు. ఉప్పుల సంతోష్‌ స్థానిక రైస్‌మిల్లులో ఆపరేటర్‌గా, పనాస కమలాకర్‌ డ్రైవర్‌గా, ఆలం సాయి ఇటీవల డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. సీఐ సాదిక్‌పాషా వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాడు. తాటిపెల్లి గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లను తీసుకొచ్చి గాలించారు. ఈతగాళ్లు నాటుపడవ సాయంతో నీటిలోకి వెళ్లి నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ఎదిగిన కొడుకులు ఇలా అర్ధాంతరంగా ప్రాణం కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్తులు ఘటనా స్థలానికి పెద్దఎత్తున చేరుకున్నారు. కుటుంబీకులతో పాటు గ్రామస్తులంతా వారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు.
మృతదేహాలను పరిశీలించిన ఎస్‌పీ
నలుగురు యువకుల మృతదేహాలను ఎస్‌పీ సురేష్‌కుమార్‌ సంఘటన స్థలంలో పరిశీలించారు. మృతికి కారణాలపై విచారణ చేపడతామని ఎస్పీ తెలిపారు. మితిమీరిన సరదాలతో యువత ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదని, పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. సరదా జీవితంలో ఎప్పటికీ ఉంటుందని, కానీ ప్రాణం పోతే తిరిగి రాదని గమనించాలన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, నాలుగు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చిందన్నారు. ఈత రాకుండా నదిలోకి వెళ్లకూడదని సూచించారు. ఆయన వెంట ఏఎస్‌పీ దేవీసింగ్‌, డీఎస్‌పీ కరుణాకర్‌, ఎస్‌ఐ మధుకర్‌ ఉన్నారు.
దండేపల్లిలో..
జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం కార్తీక్‌(18) హోలీ వేడుక అనంతరం స్నానానికెళ్లి మృతిచెందాడు. అమ్మమ్మ ఊరైన మామిడిపల్లి గ్రామానికి తరచూ వచ్చి వెళ్తూ ఉంటాడు. స్నేహితులు హోలీ వేడుకలకు రమ్మని పిలవగా సోమవారం వెళ్లాడు. ఈ క్రమంలో హోలీ వేడుకల అనంతరం స్నానం చేసేందుకు మండలంలోని తానిమడుగు వద్ద గల గూడెం ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నీటిలో గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చివరకు కార్తీక్‌ను గాయాలతో స్థానిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే యువకుడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మృతుని తల్లి గోపులపురం అశ్విని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ తెలిపారు.
కాలు జారి వాగులో పడి బాలుడి మృతి ఆదిలాబాద్‌ రూరల్‌లో..
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర సమీపంలోని భీంసరి వాగులో కాలు జారి పడి బాలుడు మృతిచెందాడు. ఎస్‌హెచ్‌ఓ సునిత తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని జైజవాన్‌నగర్‌కు చెందిన హర్షిత్‌(12) హోలీ వేడుకల్లో పాల్గొని, స్నేహితులతో కలిసి భీంసరి వాగుకు స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో కాలు జారి లోతులోకి పడిపోవడంతో మునిగిపోయాడు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Spread the love