టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. రేపటి నుండి ఆ టికెట్లు నిలిపివేత

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ పోస్ట్ పెట్టారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జనవరి 1,2024 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

“ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతోనే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

Spread the love