– నమ్మించి మోసం చేయొచ్చనుకుంటుండు
– ఓటుతో కర్రుకాల్చి వాత పెట్టాలి
– 6వ తేదీనే 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు
– కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా..?
– మాట ఇస్తే తలనరుక్కుంటా
– పంద్రాగస్టుకు రైతు రుణమాఫీ : ఆర్మూర్, నిజామాబాద్ కార్నర్ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-ఆర్మూర్, నిజామాబాద్‌సిటీ
”పోయిన సారి ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని గుండు అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చిండు. రాజ్‌నాథ్ సింగ్‌ను పిలిపించి మాట ఇచ్చిండు. ఆయన గెలిచి ఐదేండ్లయింది. మోడీ గెలిచి పదేండ్లయింది. కానీ ఇప్పటికీ పసుపు బోర్డు రాలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చినరు. ఈసారి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మోడీ మళ్లీ హామీ ఇస్తున్నారు. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో మాట ఇస్తే వాయిదాలు వేస్తుండేనా..? రైతులన్నా.. మన రాష్ట్రం అన్నా.. మోడీకి లెక్క లేదు. నమ్మించి మోసం చేయొచ్చని అనుకుంటున్నారు. రైతాంగానికి మాట ఇచ్చి మోసం చేసిన కవితను బండ కేసి కొట్టిర్రు. ఈసారి అరవింద్‌కు కర్రుకాల్చి వాత పెట్టాలి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం ఆర్మూర్, నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలు, కార్నర్ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
దేవుడి పేరుతో ఓట్లు అడగడం ప్రలోభ పెట్టడం బీజేపీకి భావ్యమా అని ప్రశ్నించారు. తాము దేవుళ్లను కొలువలేమా.. ఎల్లమ్మకు, పోశమ్మకు, మైసమ్మకు కోడిని కోసినం.. కల్లు పోసినం.. భక్తి గురించి, పూజ గురించి బీజేపీ వాళ్లే మనకు చెప్పాలా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని, మనలను మోసం చేయాలని చూస్తున్నారని, మరొక్కసారి చెప్తున్నా.. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని, బజార్ల దేవుడి ఫొటో పెట్టి ఓట్లు అడిగేవాడిని బిచ్చగాడు అంటారని ఎద్దేవా చేశారు. ధర్మాన్ని కాపాడుకోవాలన్నా, రైతుల సమస్యలు తీర్చుకోవాలన్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
6వ తేదీనే రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు
‘రైతు భరోసా నిధులు వస్తలే అని కేసీఆర్ అంటున్నాడని, 9వ తేదీలోగా వేయకపోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని, వేస్తే తాను ముక్కురాస్తానని కేసీఆర్ సవాల్ విసిరారని, 9వ తేదీ కాదు.. 6వ తేదీనే రాష్ట్రంలో ఉన్న 69 మంది లక్షల రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు వేశామని తెలిపారు. సవాల్ విసురుడు కాదు.. సవాల్ మీద నిలబడాలని అన్నారు. రైతుభరోసా నిధులు వేసినం.. రైతుల ఖాతాల్లో చూడండి. మాట ఇస్తే.. తల తెగిపడ్డా వెనక్కు తీసుకోనని స్పష్టంచేశారు. ఎన్ని కేసులు పెట్టినా.. జైలుకు పంపినా నిటారుగా నిలబడి కొట్లాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినట్టు తెలిపారు. హరీశ్‌రావు రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారని, పంద్రాగస్టులోగా చేస్తానని మాట ఇచ్చినట్టు చెప్పారు. కానీ హరీశ్‌రావు చేయలేవని అంటున్నాడని, పంద్రాగస్టున దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు రైతులకు నిధులు వేసి సిద్దిపేటకు పట్టిన శనీశ్వర్‌రావును వదిలిస్తానని స్పష్టం చేశారు. నాయకులు వచ్చి రైతు సమస్య పరిష్కరిస్తామని, కొట్లాడుతామని అంటున్నారని, జీవన్‌రెడ్డి స్వతహాగా రైతు అని, చీకటి పడితే ఎక్కడున్నా ఇంటికి వెళ్లి సాగు పనులు చూసుకుంటుండేవాడని తెలిపారు. ఆయనకు మించి రైతుల గురించి ఇంకా ఎవరికి ఎక్కువ తెలుసని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే.. హర్యానా, పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు మోడీ మెడలు వంచారని గుర్తుచేశారు. అలాంటి తెగువ నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంత రైతులకు ఉందని, ఆత్మగౌరవం కోసం ఆఖరి వరకు కొట్లాడుతారని అన్నారు. కాబట్టి రైతు పక్షపాతి జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్నర్ మీటింగ్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్వర్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.