రాహుల్‌గాంధీ పట్ల బీజేపీ చర్యలు కక్షపూరితం

– ఆయన విజ్ఞప్తికి గుజరాత్‌ కోర్టు తిరస్కరణ
– గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పట్ల కేంద్ర బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని టీపీసీసీ విమర్శించింది. పరువు నష్టం దావా కేసులో రెండేండ్ల జైలు శిక్షపై స్టే విధించాలన్న రాహుల్‌ విజ్ఞప్తిని గుజరాత్‌ హైకోర్టు తిరస్కరించడాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్యాంక్‌బండ్‌ వద్ద మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, రోహిన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మెట్టుసాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్‌లో టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ మాట్లాడుతూ గుజరాత్‌ హైకోర్టు సూరత్‌ సెషన్‌ కోర్టు విధించిన జడ్జిమెంట్‌ ఇచ్చిందన్నారు. దానిపై రాహుల్‌ గుజరాత్‌ హై కోర్టులో వేసిన పిటిషన్‌ను తిరస్కరించడం దురదృష్టకరమని తెలిపారు. న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కోరారు. గతంలో మోడీ సైతం నెహ్రు, రాజీవ్‌ గాంధీపై కూడా ఎన్నో వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ బీజేపీ కుట్ర పూరిత వైఖరికి ఇది నిదర్శనంగా నిలుస్తోందన్నారు. రాహుల్‌ చేపట్టిన భారత జోడో యాత్రకు వచ్చిన అదరణను జీర్ణించుకోలేక పలు ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పొయ్యేలా వ్యవహరిస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ, అమిత్‌షాకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Spread the love