మోడీ, కేసీఆర్‌ బ్రాండ్లకు కాలం చెల్లింది

– కర్నాటక తీర్పు దేశానికి దశ, దిశ
– త్వరలో కాంగ్రెస్‌ తరపున బీసీ డిక్లరేషన్‌
– కేసీఆర్‌ను ఓడించడం బీజేపీతో కాదు
– పార్టీని వీడిన వారికి ఇదే మా ఆహ్వానం : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ బ్రాండ్లకు కాలం చెల్లిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.మోడీని ఓడించొచ్చని కర్నాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు.కర్నాటక ప్రజల తీర్పును ప్రపంచ మంతా స్వాగతించిందని తెలిపారు. అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొని నిలిచిన అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యానికి అండగా నిలిచారని కొనియాడారు. హైదరా బాద్‌లోని గాంధీ భవన్‌లో పార్టీ నేతలు అంజన్‌కుమార్‌యాదవ్‌, షబ్బీర్‌ అలీ, వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌, రాములునాయక్‌తో కలిసి రేవంత్‌ విలేకర్లతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ బద్ధ వ్యతిరేకులు కూడా కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారని గుర్తు చేశారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌లది నాటకం
తెలంగాణ సీఎం కేసీఆర్‌ నుంచి తాము ఎలాంటి సానుకూల స్పందన ఆశించడంలేదని రేవంత్‌ అన్నారు. కాంగ్రెస్‌ను అభినందించాలని కూడా తాము కోరుకోవడంలేదన్నారు. కానీ, కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించి, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గొప్ప నిర్ణయం తీసుకు న్నారనే మాటను కేసీఆర్‌ అనుంటే ఎవరైనా ఆయన్ను అభినందించేవారని స్పష్టం చేశారు. ‘కర్నాటక ఫలితాల గురించి పట్టించుకో వాల్సిన పనిలేదంటూ బండి సంజరు చెప్పిన విషయాన్నే…నాలుగు రోజుల తర్వాత కేసీఆర్‌ కూడా చెప్పాడు’ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే బీజేపీ, బీఆర్‌ఎస్‌ విడిపోయినట్టు నాటకమాడుతున్నాయని తెలిపారు.
బీజేపీకి ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారా?
బీజేపీకి ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా? అని రేవంత్‌ ప్రశ్నించారు. మండల్‌ కమిషన్‌ ద్వారా బీసీలకు కాంగ్రెస్‌ రిజర్వేషన్లు కల్పిస్తే దానికి వ్యతిరేకంగా కమాండల్‌ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టిందని విమర్శించారు. బీసీ జనాభా లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మోడీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. త్వరలో బీసీలకు కాంగ్రెస్‌ ఏమి చేయబోతుందో బీసీ డిక్లరేషన్‌ రూపంలో వివరిస్తామని ఈ సందర్భంగా రేవంత్‌ చెప్పారు.
పార్టీ కోసం ఒక మెట్టు కాదు…పది మెట్లు దిగుతా
వివేక్‌ వెంకటస్వామి, ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ సిద్ధాంతాలను నమ్మరనీ, వారిని బీజేపీ కూడా నమ్మదని రేవంత్‌ చెప్పారు. వారంతా క్షణికావేశంలో బీజేపీలో చేరారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. తన వల్ల ఇబ్బంది అవుతుందనుకుంటే, ఒక మెట్టు కాదు… పది మెట్లు దిగడానికి తాను సిద్ధం’ అన్నారు. కేసీఆర్‌ను ఓడించడం బీజేపీతో కాదని గుర్తు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పేరిట రూ. 200 కోట్ల ప్రభుత్వ ధనంతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.

Spread the love