హస్తం వైపు రాజగోపాల్‌రెడ్డి చూపు

ఇప్పటికే క్యాడర్‌కు సంకేతాలు..బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న భావన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ విసిరిన వలలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని తెలుస్తున్నది. హస్తం గూటికి చేరేందుకు పావులు కదుపుతున్నట్టు, ఢిల్లీ నుంచి దిగ్విజరు సింగ్‌ రంగంలోకి దిగి ఆయనతో చర్చలు జరిపినట్టు, తిరిగి పార్టీలో చేరేందుకు రాజగోపాల్‌రెడ్డి సిగల్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. దానికి తగ్గట్టుగానే తన క్యాడర్‌కు రాజగోపాల్‌రెడ్డి సంకేతాలు పంపుతున్నారు. తన వెంటే నడిచి వచ్చేలా సన్నద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జిల్లాలో రాజగోపాల్‌రెడ్డి భువనగిరి పార్లమెంటరీ స్థానం పరిధిలో రాజకీయ చక్రం తిప్పేవారు. అందుకు తగ్గట్టుగానే ఆయా నియోజకవర్గాల్లో తనకంటూ సొంత క్యాడర్‌ను తయారుచేసుకున్నారు.
బీజేపీ ఆడిన నాటకం
కాంట్రాక్టులు, పెండింగ్‌ బిల్లులను అడ్డంపెట్టుకుని బీజేపీ ఆడిన నాటకం… ఇదే క్రమంలో రేవంత్‌రెడ్డి పార్టీ అధ్యక్షుడు కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన చివరకు కాంగ్రెస్‌ను వీడారు. ఆ సందర్భంలో సోదరులైన రాజగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి మధ్య అంతర్గతంగా చిన్నపాటి యుద్ధమే సాగిందనే ప్రచారముంది. అన్న చెప్పినా ఆయన వినలేదు. హస్తం గుర్తుపై గెలిచిన ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ తర్వాత, ఇప్పుడు బీజేపీలో నేతలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటుండటంతో ఆ పోరు భరించలేనన్న నిర్ణయానికి వచ్చి రాజగోపాల్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ‘మీకు ఫోన్‌ ఎప్పుడైనా రావచ్చు. నాతో కలిసి వచ్చేందుకు సిద్దంగా ఉండండి. మీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే. రెండు పార్టీల నేతలు పైకి విమర్శలు చేసుకున్నా…లోపల అంతా కలిసే ఉంటున్నారు. అందుకే లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాలేదు. దీనికి బీజేపీ సహకారం పూర్తిగా ఉంది’ అంటూ తన అనుయాయులతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బాహాటంగానే చర్చిస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదని తన అనుచరుల వద్ద తేల్చిచెపుతున్నారు. ఈ విషయం ఇప్పుడే కాదు…మునుగోడు ఉప ఎన్నికల్లోనూ తేలిపోయిందని చెబుతున్నారు.
మునుగోడులో పావుగా వాడుకుందనే ఆవేదన
మునుగోడు ఉప ఎన్నిక ద్వారా రాష్ట్రంలో చక్రం తిప్పాలనే భావనతో బీజేపీ తనను పావుగా వాడుకుందని సన్నిహితుల వద్ద ఆవేదన చెందినట్టు తెలిసింది. అంతేకాకుండా మునుగోడుకు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బండి సంజరు వెన్నంటి ఉండే జి మనోహర్‌రెడ్డి కూడా తన ఓటమికి కారణమయ్యారనే కోపం రాజగోపాల్‌రెడ్డిని వెంటాడుతున్నది. పాత బీజేపీ శ్రేణులు అక్కడ రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పని చేశారనే ప్రచారముంది. మరోవైపు బీజేపీలో ఇటీవల గ్రూపుల పోరు తీవ్రమైంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆయన కమలం పార్టీని వీడిని హస్తం గూటికి చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అక్కడే ఉంటే గెలుపు అంత ఈజీ కాదు
ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌ పార్టీ కర్నాటక రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ఊపొచ్చింది. రాజగోపాల్‌రెడ్డి సొంత అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం పనిచేశారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే మునుగోడులో గెలుపు అంత ఈజీగా కాదనేది తేలిపోయింది. దీంతో ఆయన సొంత గూటికి రావాలని నిర్ణయించుకున్నట్టు బలంగా వినిపిస్తున్నది.

Spread the love