2027లో హైదరాబాద్‌లో ఐసీసీఏ గ్లోబల్‌ సమ్మిట్‌

– రూ.50వేల కోట్లకు అట్టపెట్టల మార్కెట్‌
హైదరాబాద్‌ : వచ్చే 2027 జనవరిలో ఇంటర్నేషనల్‌ కారుగేటెడ్‌ కేస్‌ అసోసియేషన్‌ (ఐసీసీఏ) గ్లోబల్‌ సమ్మిట్‌కు హైదరాబాద్‌ వేదిక కానుంది. తొలి సారి భారత్‌లో ఈ కాన్ఫరెన్స్‌ జరగనుందని ఆ పరిశ్రమ కురవృద్ధుడు, ఐసిసిఎ వైస్‌ ఛైర్మన్‌ ఎంఎల్‌ అగర్వాల్‌ తెలిపారు. దీనికి 500 మంది అంతర్జాతీయ, 2,000 మంది దేశీయ ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ది అసోసియేషన్‌ ఆఫ్‌ కారుగేటెడ్‌ కేస్‌ ఆఫ్‌ తెలంగాణ (ఏసీసీటీ) రెండు రోజుల కారుపాక్‌ సమ్మిట్‌-2023 ప్రారంభమైంది. అట్టల తయారీ పరిశ్రమకు చెందిన పలువురు నిపుణులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. దేశంలో అన్ని రకాల ప్యాకేజింగ్‌లకు ఉపయోగించే అట్ట పెట్టలు, సంబంధిత ఉత్పత్తులు ఏడాదికి కోటి, 1.10 లక్షల టన్నుల సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఏడాదికి రూ.50,000 కోట్ల వ్యాపారం జరుగుతుందన్నారు. ఇందులో తెలంగాణ వాటా రూ.2500 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ పరిశ్రమ 15 శాతం వృద్థిని నమోదు చేస్తుందని.. ఇది దేశీయ సగటు కంటే ఎక్కువని తెలిపారు.
కాగా ఈ పరిశ్రమ కాగితపు నాణ్యత సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ఫైబర్‌ లభ్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

Spread the love