22న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు

– దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా
– సీఎం సొంత వ్యవహారంలా వేడుకలు
– ఖమ్మంలో భారీ సభకు ప్లాన్‌
– కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్‌కు లేదు
– చేరికలపై ఊహాగానాలు వద్దు: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దశాబ్ది ఉత్సవాలను బీఆర్‌ఎస్‌ సొంత వ్యవహారంలా నిర్వహిస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇవి దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా అని పేర్కొన్నారు. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారిందన్నారు. గ్రామస్థాయి నుంచి అధికారులందరూ బీఆర్‌ఎస్‌ సేవలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. పదేండ్లలో కేసీఆర్‌ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చేరికల విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామన్నారు. మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. పది రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ నెల 22న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రావణాసురుడి రూపంలో ఉన్న కేసీఆర్‌ పది వైఫల్యాలతో కూడిన దిష్టిబొమ్మ దహనం చేస్తామని వివరించారు. ఆర్డీవో కార్యాలయాలు లేదా ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించాలన్నారు. కేజీ టూ పీజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, దళితులకు మూడెకరాలు, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్‌ హామీల విషయంలో ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేసేలా కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్‌, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్‌పై చర్చ జరుగుతున్నదని తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ నెలాఖరులో ముగుస్తుందని తెలిపారు. జాతీయ నాయకులతో ఖమ్మంలో భారీ ముగింపు సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆయనతో సంప్రదించి ముగింపు సభ నిర్వహించాలనుకుంటున్నామని వివిరించారు. బీసీల్లో ఉన్న అన్ని కులాలకు లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సినీ దర్శకులు బి. నర్సింగరావు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తికి ప్రభుత్వ పెద్దలు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. ఇప్పటికైనా వారిని గౌరవించి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్‌ అవమానించారని విమర్శించారు. పదేండ్లు పూర్తయినా 600 మంది అమరులను కూడా గుర్తించలేకపోయారని తెలిపారు. రెండో రాజధానిపై ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందా? రాష్ట్రానికి వెళ్తుందా తెలియాలని డిమాండ్‌ చేశారు. విస్తతంగా చర్చించిన తరువాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు : రేవంత్‌
టీఎస్సీపీఎస్సీ సభ్యుల నియామకంపై పున:సమీక్షించాలంటూ హైకోర్టు చెప్పిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ చెప్పారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సమీక్ష చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విచారణ అధికారులు, ప్రభుత్వ పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ కమిషన్‌ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నా పత్రం లీకేజీలకు మంత్రి కేటీఆర్‌ కారణమనీ, ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి జి వినోద్‌ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ బీజేపీని ఎవడు ఓడించలేడని అనుకున్నారనీ, కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిచి చూపించిందని చెప్పారు. జేడీఎస్‌ కోసం కాంగ్రెస్‌ను చీల్చేందుకు సీఎం కేసీఆర్‌ కూడా కషి చేశారని గుర్తు చేశారు.కర్ణాటక ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని ఆయన ప్రశంసించారు.

Spread the love