– ఇంటింటికి కాంగ్రెస్ పోస్టర్లు
– ఇదే ప్రధాన అజెండాగా ఎన్నికలకు…
– ఆ దిశగా శ్రేణుల సన్నద్ధం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రానున్న ఎన్నికలకు కాంగ్రెస్ బలమైన ప్రచారాస్త్రాలను సిద్ధం చేస్తున్నది. కారు వైఫల్యాలపై హస్తం పార్టీ అస్త్రశస్త్రాలను పోగు చేసుకుంటున్నది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ అవినీతిపై ప్రతిపక్ష పార్టీగా అనేక ఆరోపణలు గుప్పిస్తున్నది. వాటన్నింటిని వడబోసి ఎన్నికల అస్త్రాన్ని తయారు చేసినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ ‘థర్టీ పర్సెంట్ కమీషన్ల’ సర్కారు అంటూ కారుపై కాంగ్రెస్ బాణాన్ని వదలనుంది. ఆ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి పోస్టర్లు వేసి పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించనుంది. తద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యాచరణ రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. కర్నాటకలో బీజేపీ సర్కారుపై హస్తం పార్టీ ఇదే రకమైన ప్రచారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పేటీఎం తరహాలో ‘పే సీఎం’ అంటూ, ’40 పర్సెంట్ కమీషన’్ల సర్కారు అంటూ గోడపత్రికలు వేసి మరీ ప్రచారం చేసింది.ఈ ప్రచారానికి ఆ పార్టీ అక్కడ దాదాపు 27శాతం ఓటర్లను ప్రభావితం చేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. అదే తరహాలో రాష్ట్రంలోనూ కారు వేగానికి బ్రేకులు వేసేందుకు ‘థర్టీ పర్సెంట్ కమీషన్ సర్కారు’ అంటూ విమర్శల బాణం ఎక్కు పెట్టింది. ఆ దిశగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా చుక్కనీరు అందడం లేదనీ, కానీ లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టిందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. వేల కోట్ల కమీషన్లు బీఆర్‌ఎస్ పెద్దలకు అందాయని ఆరోపణలు చేస్తున్నది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కాంట్రాక్టులు, ధరణి పోర్టల్, పరిశ్రమలకు భూముల కేటాయింపు,గొర్లకుర్మలకు గొర్ల పంపిణీ, దళితబంధు, బీసీలకు లక్ష సాయం, భూముల అమ్మకాల్లో అవినీతితోపాటు కరెంట్ కొనుగోళ్లల్లో రూ.18వేల కోట్లు చేతులు మారాయని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నది. వీటన్నింటిల్లో 30శాతంకమీషన్లు తీసుకోకుండా ఏ బిల్లును మంజూరు చేయడం లేదనేది బీఆర్‌ఎస్‌పై హస్తం పార్టీ ఆరోపణ.వీటికి సంబంధించిన స్పల్పకాల నిడివి ఉన్న సందేశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది. ఆయా జిల్లాల్లో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి, అక్కడే మీడియాకు చెప్పాలని అధిష్టానం కార్యకర్తలను ఆదేశించింది. సర్కారు అవినీతిపై బహిరంగంగా పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం ఒక పద్దతి కాగా,సెల్‌ఫోన్లు,ఫ్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్‌మీడియాతో క్యాం పెయిన్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సెల్‌ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఆ సందేశాన్ని చేరవేసేలా ప్లాన్ చేస్తున్నది. బీఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ‘కారు, సారు, సర్కారు’ అనే ట్యాగ్‌లైన్‌తో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసింది. ఈసారి వినూతన్నమైన ప్రచార శైలితో బీఆర్‌ఎస్ ఎత్తులకు చెక్ పెట్టాలని హస్తం పార్టీ వ్యూహాలకు పదును పెడుతున్నది.