రుణమాఫీ ఏమైంది?

– ధాన్యం కొన్న డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు
– పోడు రైతులు 11.50 లక్షల మంది ఉంటే, నాలుగు లక్షల మందికి పట్టాలిచ్చి చేతులు దులుపుకున్నారు
– ఉచితంగా ఇస్తానన్న ఎరువులు ఏమయ్యాయి?
– రైతు వేదికల్ని రాజకీయ వేదికలుగా మారుస్తారా? :రేవంత్‌రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సకాలంలో రైతు రుణమాఫీ చేయ కపోవడంతో అప్పుల బారినపడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూశామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆఖరి ఆర్థిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడం కూడా అయిపోయిందని తెలిపారు. ఇక రుణమాఫీ చేయబోదన్న విషయాన్ని తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటూ రైతులకు ఆదివారం ఈమేరకు రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు అనీ, రూ.20వేల కోట్లమేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచర రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని పేర్కొన్నారు. రైతుతో రాజకీయం చేసేందుకు బీఆర్‌ఎస్‌ బయలు దేరిందని ఎద్దేవా చేశారు. రైతులు ఎదుర్కొంటున్న బాధలు, ఇబ్బందులను బీఆర్‌ఎస్‌ నేతల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకారప్రాయంగా ఉంచిన ఆ పార్టీ…ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చేందుకు బరితెగించిందని విమర్శించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామంటూ జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌ 15 నాటికి రూ.6,800 కోట్లమేర బకాయిలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేండ్లలో లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను పేదల నుంచి ప్రభుత్వం లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి చేతులు రాలేదని తెలిపారు. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్‌ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలిందనీ, కేవలం నాలుగు లక్షల మందికి పట్టాలిచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామనీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌…అధికారంలోకి వచ్చిన తరావ్త రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని పునరుద్ఘాటించారు. సబ్‌ స్టేషన్‌లలో లాగ్‌బుక్‌లే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని వ్యాఖ్యానించారు. అందుకే అన్ని సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్‌లను వెనక్కి తెప్పించుకుందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్‌ది ఆల్‌ టైం రికార్డు అని ఎద్దేవా చేశారు. రైతు వేదికల సాక్షిగా రాజకీయం చేసేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు వస్తున్నారనీ, ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పేందుకు దీన్నీదొక సదవకాశం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో మన సమస్యలపై నిలదీసేందుకు సిద్ధం కావాలని కోరారు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రశ్నించాలనీ, ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో అడగాలని పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో నిలదీయాలని కోరారు. ‘సమస్యలు పరిష్కరించుడో… బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టుడో తేల్చేద్దాం. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం. ఇందుకు యావత్‌ తెలంగాణ రైతు లోకం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Spread the love