హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా

– జస్టిస్‌ అలోక్‌ అరాధ్‌ ప్రమాణం
– హాజరైన గవర్నర్‌, సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధ్‌ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రమాణం చేయించారు. వేదికపై వారిద్దరితో పాటు సీఎం కేసీఆర్‌ ఆశీనులయ్యారు. అరాధ్‌ భగవంతుని సాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలను అమలు చేస్తూ విధుల్ని నిర్వహిస్తూ తీర్పులు వెలువరుస్తానని తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్‌, సీఎంలు చీఫ్‌ జస్టిస్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. రాష్టపతి జారీ చేసిన నియామక వారెంట్‌ను హైకోర్టు రిజిస్ట్రార్‌ చదివి వినిపించారు. వారెంట్‌ కాపీని జస్టిస్‌ అలోక్‌కి గవర్నర్‌ అందజేశారు. చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు సీజేగా చేసిన జస్టిస్‌ భూయాన్‌కు పదోన్నతి లభించడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సీజేగా మధ్యప్రదేశ్‌ కు చెందిన జస్టిస్‌ అలోక్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి రికమండ్‌ చేసింది. దీన్ని కేంద్రం ఆమోదించడంతో ఈ నెల 19న రాష్ట్రపతి నియామక వారెంట్‌పై రాజముద్ర వేశారు.భుయాన్‌ సుప్రీంకోర్టుకు వెళ్లిన నాటి నుంచి యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా అభినంద్‌ కుమార్‌ షావిలి పని చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ అలోక్‌ అరాధ్‌ 2009 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి జమ్మూకాశ్మీర్‌ హైకోర్టు బదిలీ అయ్యారు. ఆ తర్వాత 2018 నుంచి కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ప్రమోషన్‌పై ఇప్పుడు రాష్ట్ర హైకోర్టుకు వచ్చారు. జస్టిస్‌ అలోక్‌ 1964 ఏప్రిల్‌ 14న రారుపూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చేశాక 1988లో లాయర్‌గా ఎన్‌రోల్‌ అయ్యారు. 2007లో ఆయనకు సీనియర్‌ అడ్వొకేట్‌ హౌదా లభించింది. కార్యక్రమానికి జడ్జీలు, లా ఆఫీసర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Spread the love