మోడీ భజనపరుల వింత భాష్యం

– వాస్తవంలో నిరుద్యోగం పెరిగింది
– ఉద్యోగాల కల్పనపై వితండవాదం
– వ్యవసాయంలో ఉపాధి కూడా ఉద్యోగమేనట
నరేంద్ర మోడీ హయాంలో 2019-2022 మధ్య కాలంలో దేశంలో ఉద్యోగాల కల్పన ఊపందుకున్నదని, దేశ చరిత్రలోనే ఇది ఓ సువర్ణాధ్యాయమని బీజేపీకి వంతపాడే ఆర్థికవేత్తలు ఊదరగొడు తున్నారు. ఆ కాలంలో దేశంలోని నిరుద్యోగులకు 5.8 కోట్ల ఉద్యోగాలు లభించాయంటూ గణాంకాలను ఉదహరిస్తున్నారు. అదే సమయంలో యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు కూడా సంధిస్తున్నారు. 2004-05 నుండి 2011-12 వరకూ…అంటే యూపీఏ ప్రభుత్వ పాలనలో కేవలం 1.33 కోట్ల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని వారు చెప్పుకొచ్చారు. అయితే ఘనత వహించిన ఆ ఆర్థికవేత్తలు ఓ వాస్తవాన్ని విస్మరించారు. అదేమిటంటే… మోడీ పాలనలో లభించాయని చెబుతున్న 5.8 కోట్ల ఉద్యోగాలలో ఎక్కువ వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారే.. దీనిని కూడా ఉద్యోగాల కల్పనగా చెప్పుకోవడం వీరికే చెల్లింది.
న్యూఢిల్లీ : 2019లో… అంటే కోవిడ్‌ ప్రారంభ సమయానికి వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 18.8 కోట్లు. 2020వ సంవత్సరం మధ్యలో ఆ సంఖ్య మరో నాలుగున్నర కోట్లు పెరిగింది. కోవిడ్‌ కష్టకాలంలో పట్టణాలు, నగరాలలో ఉపాధి కోల్పోయిన ప్రజలు గ్రామాలకు వలస వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందారు. 2021లో కోవిడ్‌ ప్రభావం తగ్గిన సమయంలో వారంతా తిరిగి వ్యవసాయ పనులు వదిలేసి పట్టణాలు, నగరాల బాట పట్టారు. ప్రభుత్వానికి చెందిన జాతీయ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) వివరాల ప్రకారం 2020తో పోలిస్తే 2021లో వ్యవసాయ రంగంలో 70 లక్షల మంది అదనంగా పని చేశారు. అదే యూపీఏ పాలనలో 3.7 కోట్ల మంది వ్యవసాయాన్ని వీడి వేరే ఉద్యోగాలు పొందారు. నిజానికి ఇది మంచి పరిణామం. ఆ కాలంలో వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగాలు సంవత్సరానికి 75 లక్షలు పెరిగాయి.
2013 తర్వాత…
ఈ కాలంలో వ్యవసాయం నుండి వేరే రంగాలకు వెళ్లిన వారి సంఖ్య తగ్గిపోయింది. 2016 నుండి దేశంలో కోవిడ్‌ ప్రవేశించే వరకూ జీడీపీ వృద్ధి రేటు ప్రతి త్రైమాసిక కాలంలోనూ పడిపోతూ వచ్చింది. 2017-18లో మన దేశంలో నిరుద్యోగ రేటు 45 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరింది. ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ విధించడంతో వ్యవసాయ రంగంలోకి వలసలు భారీగా పెరిగాయి. ఇప్పుడు వాటినే పెరిగిన ఉపాధి కల్పనగా బీజేపీ ఆర్థికవేత్తలుచెప్పుకొస్తున్నారు.
తగ్గిన కుటుంబ ఆదాయం
వ్యవసాయ రంగంలో అవసరమైన దాని కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు పనిచేయడం, ఆ రంగంలో ఉపాధి పెరగడం వల్ల ఉత్పాదకత పెరగకపోగా, వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి వాస్తవ ఆదాయం సైతం తగ్గింది. బీజేపీ అనుకూల ఆర్థికవేత్తలు చెప్పుకుంటున్నట్లు 2019 నుండి వ్యవసాయ రంగంలో పెరిగిన ఈ ఉద్యోగాలు వాస్తవానికి జీతం భత్యం లేనివే. కుటుంబంలో అప్పటికే వ్యవసాయం చేస్తున్న వారితో మహిళలు, యువత, పిల్లలు కలిసి పొలం పనులకు వెళ్లారు. పేరుకు వీరందరికీ ఉపాధి దొరికిందని చెప్పుకోవడమే కానీ కుటుంబ ఆదాయం మాత్రం పెరగలేదు.
వాస్తవ వేతనాలూ తగ్గాయి
బీజేపీ అనుకూల ఆర్థికవేత్తలు చేస్తున్న మరో వాదన వాస్తవ వేతనాలు భారీగా పెరిగాయట. వాస్తవానికి ఈ వాదనలోనూ పస లేదు. 2017-18 నుండి 2021-22 మధ్యకాలంలో రెగ్యులర్‌ ఉద్యోగుల రోజువారీ వేతనం రూ.302 నుండి రూ.292కు తగ్గింది. స్వయం ఉపాధి పొందుతున్న వారి వేతనం రూ.199 నుండి రూ.177కు పడిపోయింది. దీనికి కారణం అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. 2019లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు బాగా నష్టం కలిగించింది. ముఖ్యంగా వ్యవసాయ ఆదాయం, అసంఘటిత రంగంలో పని చేసే వారి ఆదాయం తగ్గిపోయింది. దీనికితోడు 2017లో ప్రవేశపెట్టిన జీఎస్టీ అసంఘటిత రంగానికి చెరుపు చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. ఆర్థిక వృద్ధి మందగించింది. జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. చివరికి నిరుద్యోగుల సంఖ్య 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగింది.
ఉద్యోగాల కల్పన అవసరమే
మోడీ ప్రభుత్వంలో పని చేస్తున్న సీనియర్‌ ఆర్థిక సలహాదారు చెప్పిన మాట వింటే ఎవరికైనా నవ్వు వస్తుంది. దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గిందట. 2021లో సంతానోత్పత్తి రేటు కూడా తగ్గిపోయిందట. కాబట్టి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరమే లేదట. ఈ వాదన ఎంత హాస్యాస్పదంగా ఉందో కదా. వ్యవసాయ రంగంలోకి మళ్లిన లక్షలాది మందిని దాని నుండి బయటికి తీసుకురావాల్సిన అవసరాన్ని బీజేపీ అనుకూల ఆర్థికవేత్తలు విస్మరిస్తున్నారు. గత సంవత్సరంలో కూడా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీనిని బట్టే ఉద్యోగాల కల్పన భేషుగ్గా ఉందని బీజేపీ అనుకూల ఆర్థికవేత్తలు కితాబు ఇస్తున్నారు. 2019లో వ్యవసాయ రంగంలో పనిచేసిన కార్మికుల వాటా 42% ఉంటే గత సంవత్సరంలో అది 45.6%కి పెరిగింది. విద్యావం తులు అయిన యువతకు వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగాలు కల్పించా ల్సిన అవసరం ఉంది. దీనిని బట్టి చూస్తే 2030 వరకూ మన దేశంలో ఏటా కోటి నుండి 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

Spread the love