– రాష్ట్రంలోని 23,890 గ్రామాలు, ఆవాసాలకు సరఫరా
– ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ
నవతెలంగాణ -హైదారాబాద్
తెలంగాణలో ఒకనాడు ఎండాకాలం వస్తుందంటే చాలు తాగునీటి కోసం మహిళలు పడే ఇబ్బందులు వర్ణణాతీతం. బిందెలు పట్టుకుని ఎండలో కిలోమీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకునే వారు. పట్టణాల్లో నల్లాల వద్ద బిందెలతో కొట్లాటలు నిత్య కత్యం. చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నప్పటికీ తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకలేదు. వందల అడుగుల లోతున ఉండే భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండేది. పాలకుల నిర్లక్ష్యానికి ఫ్లోరోసిస్ తో ప్రజలు నడి వయస్సులోనే కాళ్ళు వంకర పోయి వృద్దులయ్యేవారు. చెంతనే గోదావరి వున్నప్పటికీ సురక్షిత తాగునీరు అందక ఏజెన్సీ ప్రాంత ప్రజ లు అనేక ఇబ్బందులు పడ్డారు. వర్షాకాలంలో మురికి నీరు తాగుతూ వలన నీటి కారక వ్యాధులతో మంచం పట్టిన ఏజెన్సీ అనే వార్తలు వచ్చేవి.
దశాబ్దాలపాటు ప్రభుత్వాలను వేడుకున్నప్పటికీ ప్లోరోసిస్ సమస్య పరిష్కారం కాలేదు. నాడు చట్ట సభల్లో తాగునీటి సమస్య చర్చనీయాశమైంది. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు ఆందోళనలు నిత్యం జరిగేవి. ఉమ్మడి పాలకుల వివక్షకు చేతకానితనానికి ఇదొక నిదర్శనం. అన్ని సమస్యలకూ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో పరిష్కారం లభించింది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఉద్యమనేత అయిన కె.చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడంతో మహిళల కష్టాలు తొలగాయి. నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో శ్రీకారం చుట్టిన మంచినీటి పథకం అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేయుటకు రూ.45 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా జల జల పారే నీటిని వడిచిపట్టి ఫిల్టర్ బెడ్స్ ద్వారా శుద్ధిచేసి పైపుల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్లు చొప్పున సరఫరా అవుతున్నది. ఏటా 68 టీఎంసీల తాగునీటిని సరఫరా చేస్తున్నది. 2048 సంవత్సరం నాటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో 86.11 టీఎంసీల నీటిని సరఫరా చేయుటకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది. కృష్ణా గోదావరి జలాలను మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రభుత్వం అందిస్తున్నది.
మిషన్ భగీరథ పథకానికి అనేక అవార్డులు లభించాయి. వినూత్న వరవడితో నల్లాల ద్వారా నది జలాలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కృషిని మన్ కి బాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. నీతి ఆయోగ్, జల శక్తి మంత్రిత్వ శాఖ, 15 వ ఆర్థిక సంఘం తో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్, కర్నాటక , ఒడిశా రాష్ట్రాల ప్రశంశలు అందుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగు నీటిని నల్లాల ద్వారా రెగ్యులర్ గా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
మిషన్ భగీరథ పథకాన్ని ఫ్లాగ్ షిప్ కార్యక్రమంగా ప్రభుత్వం అమలు చేస్తున్నది. భౌగోళిక పరిస్థితులను బట్టి ఈ ప్రాజెక్టు ను 26 సెగ్మెంట్‌లు, 34 సబ్ సెగ్మెంట్స్‌గా విభజించారు. 9 ఏండ్ల స్వల్ప కాలంలోనే దశాబ్దాల తాగునీటి సమస్యను పరిష్కరించి పరిపాలనా దక్షత ను చాటుకున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చారు. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.