చదివింది 9వ తరగతి..

– నకిలీ ఎన్‌ఓసీలతో కార్ల విక్రయం
– పోలీసులకు చిక్కిన ముఠా సభ్యులు
నవతెలంగాణ-హయత్‌నగర్‌
అతను చదివింది కేవలం 9వ తరగతి వరకే.. కానీ సులభంగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ పత్రాలు సృష్టించి కార్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఫేక్‌ ఎన్‌ఓసీ తయారు చేసి కార్లను విక్రయిస్తున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ సాయిశ్రీ వివరాలు వెల్లడించారు.
కరుమురి వీర వెంకట సత్య గుప్తా నాగరాజ్‌ అలియాస్‌ కేేవీవీఎస్‌జీ నాగరాజ్‌ అలియాస్‌ రాజా స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. 2015లో నగరానికి వచ్చిన అతను సప్లయింగ్‌ ఆఫ్‌ ఫాస్ట్‌ కన్జుమర్‌ గూడ్స్‌ వ్యాపారం పెట్టాడు. 2018లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ద్వారా లోన్‌ తీసుకుని కారును కొనుగోలు చేశాడు. అయితే, దానికి లోన్‌ చెల్లించకుండా ఖైరతాబాద్‌ ఆర్టీఓ కార్యాలయం పేరుతో ఫేక్‌ ఎన్‌ఓసీ తయారు చేసి ఎలాంటి లోన్‌ లేకుండా బహిరంగ మార్కెట్‌లో అమ్మాడు. ఈ మేరకు వచ్చిన డబ్బుతో మరో కారు కొనుగోలు చేసి నకిలీ బ్యాంక్‌ స్టాంప్‌లు తయారు చేస్తున్నాడు. ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన శ్రావణి, నాగభూషణం, సంతోష్‌ కుమార్‌, లక్ష్మీకాంత్‌ సహకారంతో మొత్తం 9 వాహనాలను అమ్మకానికి పెట్టాడు. అయితే, హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భువనగిరి ఎస్‌ఓటీ, హయత్‌నగర్‌, వనస్థలిపురం పోలీసులు చేసిన జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.26 కోట్లు ఉంటుంది. నాగరాజ్‌కు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో మీడియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇతనిపై వనస్థలిపురంలో గతంలో ఓ కేసు నమోదైంది. ఈ సమావేశంలో హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ జలెందర్‌ రెడ్డి, భువనగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌, ఎస్‌ఐలు నర్సింహ, శోభన్‌ బాబు ఉన్నారు.

Spread the love