హస్తం దూకుడు

– జూపల్లి, పొంగులేటితో వేర్వేరుగా రేవంత్‌ భేటీ
– పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
– 25న రాహుల్‌గాంధీతో సమావేశం
– జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ … అదే వేదికపై చేరనున్న పొంగులేటి, జూపల్లి, దామోదర్‌రెడ్డి
– చేరికలతో రేవంత్‌ బిజీబిజీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నది. కర్నాటక ఎన్నికల ఫలితాలతో జోష్‌ మీదున్న హస్తం పార్టీ… తెలంగాణాలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎన్నికల్లో ప్రభావితం చూపే నేతలందరికీ గాలం వేస్తున్నది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉంటూ ఈ వ్యవహారాలను సమన్వయం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలతో ఆయన రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రేవంత్‌ దూకుడుకు కొంత మంది సొంత పార్టీ నేతలే కాళ్లకు బంధం వేస్తున్నట్టు తెలుస్తోంది. చేరికల విషయంలో రేవంత్‌కు ఫ్రీహాండ్‌ ఇచ్చినప్పటికీ తమ కాళ్లకిందికి నీళ్లొస్తాయనే లక్ష్యంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్‌ జాగ్రత్తగా సీనియర్లను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని వెంటబెట్టుకుని బుధవారం హైదరాబాద్‌లోని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికెళ్లారు. వేర్వేరుగా వారితో మంతనాలు జరిపారు. ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరాలని కోరినట్టు తెలిసింది. అందుకు అంగీకరించిన నేతలు…ఈనెల 25న ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు. అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించనున్నారు. జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆ సభకు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. ఆ వేదిక మీదనే పొంగులేటి, జూపల్లి, దామోదరరెడ్డితోపాటు చాలా మంది నేతలు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారని ప్రచారం సాగుతోంది.
కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ: రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రజల ఆశలను సీఎం కేసీఆర్‌ కాలరాశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ దిశగా పలువురు నేతలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి. చిన్నారెడ్డి, మల్లు రవి తదితరులు వెళ్లారు. పొంగులేటి, అతని మిత్రబందం కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పొంగులేటితోపాటు ఇతర నేతల చేరిక, కలయిక తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ పరితపించారని గుర్తు చేశారు. తెలంగాణ జాతిపితగా ఆయన్ను నాలుగు కోట్ల మంది గౌరవించుకున్నారని తెలిపారు. తొలి,మలిదశ ఉద్యమంలో ఆయన క్రియాశీలపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన ఆశించిన ఫలితాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబం కోసం తెలంగాణ వనరులను కబ్జా చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని రాజకీయ ప్రయోగశాలగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తామన్నారు. త్వరలో కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో సమావేశమవుతామన్నారు. ఖమ్మంలో కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఈసందర్భంగా రేవంత్‌ వివరించారు. పాలమూరు జిల్లా అభివద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఈ జిల్లా అభివృద్ది కోసం మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు, గుర్‌నాథ్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి గతంలో బీఆర్‌ఎస్‌లో చేరారనీ, తొమ్మిదేండ్లు గడిచినా కేసీఆర్‌ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అందుకే వారంతా కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగరేశారని తెలిపారు. తెలంగాణలో 17 పార్లమెంట్‌ స్థానాలు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని క్రియాశీలకంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కేసీఆర్‌ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయారు : జూపల్లి
కాంగ్రెస్‌ నేతలు నన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వారి ఆహ్వానంపై తమ నేతలతో చర్చిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్‌ కోల్పోయారని విమర్శించారు. అమరుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలను సీఎం తీసుకువస్తున్నారని విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించే వారితో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు ఏమైంది? అని ప్రశ్నించారు. పైసల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు.
మూడు, నాలుగు రోజుల్లో చేరికపై ప్రకటన : పొంగులేటి
కాంగ్రెస్‌లో చేరికపై మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన చేస్తామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నామని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని రేవంత్‌రెడ్డి ఆహ్వానించినట్టు చెప్పారు. ఉద్యమకారులు, ప్రజలు, కళాకారులు, కవులతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలిపారు. కొద్దిరోజుల్లోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామన్నారు. ఆరునెలల నుంచి పరిస్థితులను గమనిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ వచ్చాక ప్రజల కలలు సాకారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్‌ సమక్షంలో పలువురు నేతల చేరిక
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సమక్షంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరారు. నిర్మల్‌, కొడంగల్‌, గజ్వేల్‌, మానకొండూరు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌లో చేరికలు జరిగాయి. మానకొండూరు నుంచి సర్పంచులు, గన్నేరువరం ఎంపీటీసీ, ఖాసీంపేట ఉపసర్పంచ్‌, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కారుడు మాజీ ఎంపీ ఆర్‌. సురేందర్‌ రెడ్డి తన భవిష్యత్తు కార్యాచరణపై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, నాయకులు బలరాం నాయక్‌, చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, ఫహీంఖురేషి, చరణ్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

Spread the love