డీకే…ఓకే..!

–  తెలంగాణపై ఫోకస్‌
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎత్తులకు పై ఎత్తులు
– అన్ని తానై వ్యవహరించాలంటూ అధిష్టానం ఆదేశం
– అధికారమే లక్ష్యంగా పక్కా ప్రణాళిక
– ప్రియాంకగాంధీ నేతృత్వంలో సభలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో గత రెండు ఎన్నికల్లో స్వయంకృతాపరాధంతో ఓటమిపాలైన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని నిర్ణయించింది. అందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని భావిస్తున్నది. ఈసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా జాగ్రత్త పడాలని నిర్ణయిస్తున్నది. ఇందులో భాగంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలకు చెక్‌ పెట్టేందుకు ద్విముఖ వ్యూహాన్ని రచిస్తున్నది. కర్నాటక ఎన్నికల్లో పార్టీ అనుసరించిన కీలకమైన అంశాలను ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. అధికారమే లక్ష్యంగా పక్కా ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే…బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల కదలికలను గమనిస్తూ…వాటికి చెక్‌ పెట్టడం వంటి పనులు ఏకకాలంలో చేయాలని భావిస్తున్నది. ఈ క్రమంలో కర్నాటక ఎన్నికల్లో ట్రబుల్‌ షుటర్‌గా పేరొందిన ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను తెలంగాణ ఎన్నికల రణరంగంలోకి దించాలని అధిష్టానం భావిస్తున్నది. అందుకు ఆయనే సరైన నేతగా అధిష్టానం గుర్తించినట్టు సమాచారం. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు సమాన దూరంగా ఉంటూనే, వాటిని మట్టి కరిపించేందుకు ధీటైన నేతగా ఆయన్ను ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా బీజేపీ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే ఆయన రంగంలోకి దిగినట్టు వినికిడి. ఇతర పార్టీల నుంచి ఎవరైనా సరే బీజేపీలో చేరకుండా అడ్డుకట్టవేడయంతోపాటు విధిలేని పరిస్థితుల్లో కమలం కండువా కప్పుకున్న వారిని సైతం హస్తం గూటికి రప్పించేందుకు ఆయన ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. ఆ పార్టీ ఎత్తుగడ లకు పైఎత్తులు వేయడం ద్వారా కారుకు బ్రేకులు వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు డీకేను సమన్వయకర్త గా నియమించనున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఎన్నికల్లో వ్యూహాత్మ కంగా ఉండమేగాక అన్ని తానై వ్యవహరించాలంటూ ఆయనకు ఇప్పటికే ఏఐసీసీ ఆదేశించినట్టు గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే డీకే వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిలతో చర్చలు జరి పారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలొ స్తున్నాయి. ఈ పరిణామాల వెనుక డీకే చక్రం తిప్పినట్టు గుసగుసలు విని పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ తీసుకునే ప్రతీ నిర్ణయా న్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలిసింది. డీకే ను రంగంలోకి దించడం వెనుక కర్నాటక ఎన్నికల ఫలితాలు ఒక కారణ మైతే, సామాజిక తరగతులవారీగా ఓటింగ్‌ను కాంగ్రెస్‌ వైపు తిప్పడంతో ఆయన అక్కడ కీలక పాత్ర పోషించడం మరో కారణం. తెలంగాణ కాంగ్రె స్‌లో బలమైన గ్రూపులు, అంతర్గత కుమ్ములాటలు, తగాదాలు ఎక్కువే. వాటన్నింటిని ఓ దారికి తీసుకొచ్చేందుకు డీకేను ప్రయోగించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలబలాలు బేరీజు వేయడం, గెలిచే అవకాశాలున్న నేతలకు టికెట్లు ఇవ్వడంతోపాటు అన్ని రకాల సహయ, సహకారాలు అందించేందుకు ఆయనకు పూర్తి అధికారాలు కట్టబెట్టేలా ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంపై రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సైతం దృష్టి సారిం చారు. అమెరికా న్యూజెర్సీలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో యూత్‌ డిక్లరేషన్‌ విడుదల చేసిన ప్రియాంకగాంధీ…జూన్‌ చివరి వారంలో మరోసారి ఖమ్మం సభకు రానున్నారు. తద్వారా బీఆర్‌ఎస్‌ హామీలకు దీటుగా కాంగ్రెస్‌ హామీలు ఇచ్చేందుకు కరసత్తు చేస్తున్నది. ఇప్పటికే యూత్‌ డిక్లరేషన్‌ కొంతమేరకు ప్రభావాన్ని చూపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్‌ సభలో రైతు డిక్లరేషన్‌ విడుదల చేసింది. ఆ తర్వాత మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు విడుదల చేయనుంది. రానున్న ఎన్నికల్లో వాటినే ఎన్నికల హామీలుగా ప్రచారం చేయాలని భావిస్తున్నది.

Spread the love