యూసీసీ వద్దు..

– వ్యతిరేకిస్తున్న పలు వర్గాలు, మతాలు
– రాజ్యాంగం కలిగించిన హక్కులకు భంగం: విశ్లేషకులు
– ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో తీవ్ర నిరసనలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అకస్మాత్తుగా దేశంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నది. అన్ని మత వర్గాలకు వర్తించే ఉమ్మడి చట్టాన్ని అమలు చేయటానికి కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రాబోయే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు యూసీసీ అమలు ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ప్రస్తుతం దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీల వివాహం, వారసత్వం, దత్తత, సంరక్షకత్వం వంటి జీవితంలోని వివిధ అంశాలు వారి స్వంత వ్యక్తిగత చట్టాల ద్వారా జరుగుతున్నాయి. అయితే, ఇస్లామిక్‌ చట్టం ప్రకారం, బహుభార్యత్వం అనుమతించబడు తుంది. అలాగే, పార్సీలు, సిక్కులు వంటి ఇతర మైనారిటీ మతాల్లోనూ ఇలాంటివి ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి.
అయితే, ఈ దశలో ఇది అవసరం లేదు, కోరదగినది కాదని 2018లో 21వ లా కమిషన్‌ కొన్ని ఆసక్తికరమైన సూచనలు చేసింది. అయితే, 22వ లా కమిషన్‌ చర్యల అనంతరం ఇలాంటి తరుణంలో కేంద్రంలోని మోడీ సర్కారు యూసీసీ విషయంలో ఒకడుగు ముందుకేసింది. ఇందులో భాగంగానే ప్రధా మోడీ వ్యాఖ్యలని విశ్లేషకులు గుర్తు చేశారు. ”రెండు చట్టాల ప్రకారం ఒక దేశాన్ని ఎలా నడపాలి?” అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.యూసీసీ ఉన్న ఏకైక రాష్ట్రం గోవా.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు 1961లో విలీనమైనప్పటి నుంచి 154 ఏండ్ల నాటి పోర్చుగీస్‌ సివిల్‌ కోడ్‌కు కట్టుబడి ఉన్నారు. కానీ ఇందులోనూ అనేక ప్రతికూలతలు ఉన్నాయని కొందరు నిపుణులు చెప్పారు. ఇందులో కొన్ని హిందూ వివాహ చట్టానికి పూర్తిగా విరుద్ధం అని వివరించారు. అయితే, దేశంలో యూసీసీ అమలుపై ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని మతాలు, వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతు న్నది. ముస్లింలే కాదు.. గిరిజనులు, సిక్కుల, పార్సీలు సైతం యూసీసీపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా అనేక గిరిజన సంఘాలు తమ గుర్తింపు, స్వయం ప్రతిపత్తికి ముప్పు వాటిల్లుతుందని భయపడుతున్నారు. ఇటు రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, మధ్యప్రదేశ్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలోని ప్రధాన రాజకీయ పార్టీల భవితవ్యాన్ని యూసీసీ నిర్ణయించే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెప్పారు.ఉమ్మడి చట్టం చుట్టూ చర్చ ఊపందుకున్నందున, ఈ అన్ని రాష్ట్రాల్లోని వివిధ గిరిజన సంస్థలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజ్యాంగ నిబంధనల ద్వారా రక్షించబడిన తమ సంప్రదాయాలను ఉల్లంఘిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

Spread the love