అర్హులైన పేదలందరికీ ‘డబుల్‌’ ఇండ్లు ఇవ్వాలి

– జీఓ 58 ప్రకారం రెగ్యులరైజ్‌ చేయాలి
– తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-బేగంపేట్‌
తెలంగాణ ప్రజాసంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మారెడ్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ, డీవైఎఫ్‌ఐఏఐడీడబ్ల్యూఏ, కేవీపీఎస్‌ సంఘాల అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్‌ఐ రాధికకు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ సికింద్రాబాద్‌ జోన్‌ కార్యదర్శి టి.మహేందర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ట్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇస్తామని హామీనిచ్చి పదేండ్లు కావస్తున్నా నగరంలోని పేదలకు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దుర్మర్గమన్నారు. నగరంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా, ప్రభుత్వ భూములను భూకబ్జదారులు కబ్జా చేస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు. పేద ప్రజలు తల దాచుకోవడానికి గతంలో మహీంద్రాహిల్స్‌లోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే పోలీసులతో తొలగించి కేసులు పెట్టించినట్టు తెలిపారు. రాష్ట్రంలో పేదలు గుడిసెలు వేసుకుంటే ఒక న్యాయం, అధికార పార్టీలో ఉన్న నాయకులు, కబ్జాదారులు కబ్జా చేస్తే ఒక న్యాయమా అని ప్రశ్నించారు. గతంలో అందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగమని సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయి అని హడావిఇగా సంగారెడ్డిలోని కొల్లూరులో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ప్రారంభిస్తున్నారనీ, అలాగే నగరంలోని అర్హులైన పేద ప్రజలందరికీ ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జీవో 58 ప్రకారం దరఖాస్తుదారులందరికీ ఇండ్లను రెగ్యులరైజ్‌ చేసి పట్టాలు ఇవ్వాలనీ, లేని పక్షంలో పేదలందరినీ సమీకరించి ఆందోళన, పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ నగర నాయకులు అజరు బాబు, సీఐటీయూ నాయకులు మల్లేష్‌, మధు, రజక సంఘం నగర కార్యదర్శి గోపాల్‌, మహిళా సంఘం నాయకురాలు అంజమ్మ, బాబర్‌, నాయకులు సత్యనారాయణ, బాలమణి విజరు, రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Spread the love