ప్రపంచ ఖ్యాతి పొందిన కేరళ హృదయపూర్వం అపూర్వం

కుల, మతాల తావులేదు
‘గహిణులు మాత్రమే కాదు, ఉద్యోగాలు చేసే మహిళలు కూడా పార్శిల్‌లను సిద్ధం చేస్తారు. మా అమ్మ టీచర్‌, ఆమె కూడా ఆహార పొట్లాలు ఇస్తుంది. ఇలాంటి కార్యక్రమం దేశంలో మరెక్కడైనా జరిగితే ఎన్నో సమస్యలు వచ్చేవి. ఎందుకంటే చాలా చోట్ల నిమ్న కులస్తులు పాఠశాలలో విద్యార్థుల కోసం భోజనం వండితే అగ్రవర్ణాల తల్లిదండ్రులు వ్యతిరేకించడం మనం చూస్తున్నాం. రహీమ్‌ అనే పేరున్న వ్యక్తి ఆహారాన్ని అందిస్తే మతం, కులంతో పాటు దాని నిరూపణను ప్రశ్నించడాన్ని కూడా చూశాం. కానీ కేరళ ఆహార పొట్లాలకు ఇలాంటి సమస్యలేమీ లేవు. భోజనం వండే స్త్రీకి లబ్దిదారుని కులం, మతం తెలీదు. ఆరేండ్లలో నేను ఎప్పుడూ కులం, మతం పేరుతో పార్శిల్‌ ఇవ్వలేదు. భోజనం తీసుకున్న వారు కూడా అది వండింది హిందూనా, క్రిస్టియనా, వారి కులం ఏంటీ? అని మమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. ప్రజలు కతజ్ఞతతో ఆహారంగా స్వీకరిస్తారు” అని ఎర్నాకులం జిల్లా డివైఎఫ్‌ఐ కార్యకర్త, లా విద్యార్థిని మేఘనా మురళి అంటున్నారు.
దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం తన గొప్పతనాన్ని మరోసారి రుజువు చేసుకున్నది. ఆస్పత్రుల్లో ఆకలితో ఉన్న రోగులు, వారి కుటుంబీకులకు ఆహారం అందిస్తూ ఆ రాష్ట్ర అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) తన మానవత్వాన్ని చాటుకుంటున్నది. ఇప్పటి వరకు ఆరు కోట్ల పైచిలుకుల భోజనాలు పంపిణీ చేసి కేరళ డీవైఎఫ్‌ఐ ప్రపంచ ఖ్యాతి సొంతం చేసుకున్నది. అందుకే ప్రతిష్టాత్మక బ్రిటన్‌ పత్రిక ”ది గార్డియన్‌” వీరి మానవత్వంపై ప్రత్యేక కథనం సైతం ప్రచురించింది. 2017లో ప్రారంభమైన ఈ నిత్య భోజన పంపిణీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. హదయపూర్వం విజయవంతం కావడంలో కేరళ మహిళల పాత్ర వెలకట్టలేనిది. ఆ వివరాలు నేటి మానవిలో…

ప్రేమతో వండిన ఆహారమే శ్రేష్ఠమైనది. అయితే కేరళలో ప్రేమతోపాటు మానవత్వంతో కలిపి వంట చేయడం వల్ల రుచికరమైన భోజనం లభిస్తుందని వేలాది మంది మహిళలు నిరూపించారు. ప్రతిరోజూ ఉదయం కేరళ స్త్రీలు తమ కుటుంబ సభ్యుల కోసం వంట చేసేటపుడు అదనపు బియ్యాన్ని, మరికొన్ని కూరగాయలను వంటలో కలుపుతారు. అదనంగా వండిన ఆ ఆహారాన్ని అరటిఆకుపై ఉంచి, ఆహార పొట్లం వలె చక్కగా కట్టి , రక్షణ కోసం వార్తాపత్రిక షీట్‌లో చుట్టి పెడతారు. తర్వాత డివైఎఫ్‌ఐ కార్యకర్తలు వచ్చి ఆ భోజన పొట్లాలను సేకరిస్తారు. మధ్యాహ్నానికి రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో రోజుకు సుమారు 40,000 మంది రోగులకు ఆ పొట్లాలను పంపిణీ చేస్తారు.
ప్రేమతో పాటు మానవత్వం కలిపి
ఆసుపత్రుల్లో ఉచితంగా ఆహారం ఇవ్వరు. వైద్యం పొందుతున్న రోగి వద్ద తప్పనిసరిగా ఎవరో ఒకరు సహాయంగా ఉండాల్సిందే. మందుల కోసం పరిగెత్తడం, పరీక్షలు ఏర్పాటు చేయడం, అవసరమైనపుడు నర్సును తీసుకురావడం వంటి చాలా పనులు వీరికి ఉంటాయి. మన దేశంలో వైద్యం అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అది భరించడం ఎంతో కష్టం. ఇక సహాయకులకు హౌటల్లో గది తీసుకునే ఆర్థిక స్థోమత ఎక్కడ ఉంటుంది. దాంతో చాలా మంది హాస్పిటల్‌ వార్డులో నేలపై, కారిడార్‌లలోని బెంచీలపై పడుకుంటారు. అలాంటి వారు రెస్టారెంట్లలో తినడం అనేది వారి స్థోమతకి మించినది. దాంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి సహాయం చేయాలనే డివైఎఫ్‌ఐ రంగంలో దిగింది. ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు తమ ఇళ్ల వండి ప్యాక్‌ చేసిన ఆహార పొట్లాలు సేకరించి ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు అందజేస్తారు.
అదనపు ఖర్చు లేకుండా...
2017లో 300 పొట్లాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఎటువంటి ఖర్చులూ ఉండవు. గ్యాస్‌, విద్యుత్‌ బిల్లులు, కుక్‌లు, క్లీనర్‌లతో కూడిన ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్‌ అవసరమే లేదు. ఇళ్లల్లో మహిళలు కుటుంబ సభ్యులకు సరిపడిన దానికంటే కొద్ది మొత్తం అదనపు భోజనం వండుతారు అంతే. డివైఎఫ్‌ఐ వాలంటీర్లు ప్రతి కుటుంబాన్ని ఒకటి లేదా రెండు పొట్లాలను సిద్ధం చేయమని అడుగుతారు. అయితే చాలా మంది ఐదు లేదా ఆరు తయారు చేసి పెడతారు. కొంత మంది 10 పొట్లాలు కూడా సిద్ధం చేసి పెడుతుంటారు. పండుగలు, ఆదివారం అంటూ విరామం లేకుండా ఏడాదిలో 365 రోజులు భోజన పంపిణీ ఉంటుంది. కేరళలో అత్యంత ముఖ్యమైన పంటల పండగ ఓనం సమయంలో బియ్యం, గింజలు, బెల్లం, పంచదారతో కూడిన తీపి వంటకం పాయసం పార్శిల్స్‌కు అదనంగా జోడిస్తారు. క్రిస్మస్‌ సమయంలో ప్లం కేక్‌ ముక్కను జత చేస్తారు.
భారంగా భావించరు
డివైఎఫ్‌ఐ కార్యకర్తలు ప్రతి ఏడాది జనవరి 1న షెడ్యూల్‌ను తయారు చేసి వంట చేయాల్సిన తేదీలను ఇళ్లకు ఇస్తారు. నిర్ణీత సమయానికి ఒక వారం ముందు వాలంటీర్లు వారు పర్యవేక్షించే ప్రాంతాల్లోని కుటుంబాలను (దాదాపు 100 నుండి 200 కుటుంబాలను) అప్రమత్తం చేయడానికి ఫోన్‌కాల్‌ చేస్తారు. ఒక రోజు ముందు మళ్లీ గుర్తు చేస్తారు. రోజూ వాలంటీర్లు అన్ని పొట్లాలను సేకరించి జిల్లాలోని ఆసుపత్రులకు పంపిణీ చేస్తారు. పెద్ద ఆసుపత్రులలో ఒక రోజులో 1,000 కంటే ఎక్కువ పంపిణీ చేస్తారు. అలా ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 6,08,42,970 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
సమానత్వాన్ని సృష్టించడం
”మరిన్ని ఆసుపత్రులకు ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తాం, అన్నదానంతో పాటు రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్నాం’ అంటూ డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు అంటున్నారు. వరదలు, కోవిడ్‌ మహమ్మారి వంటి ఏ సంక్షోభంలోనైనా కేరళ డివైఎఫ్‌ఐ కార్యకర్తలు అలసిపోకుండా రోజంతా కష్టపడతారు. ప్రతి రోజూ ఒక్కో ప్రాంతీయ కమిటీ ఆహార పొట్లాల పంపిణీ చేసే బాధ్యత తీసుకుంటుంది. ”ఈ కార్యక్రమం లక్ష్యం కేవలం పేదరికాన్ని నిర్మూలించడమే కాదు. సమానత్వాన్ని సష్టించడం, కుల, మత భేదాలను తొలగించడం. సమాజం పట్ల శ్రద్ధ వహించాలని యువతకు నేర్పడం. ప్రాథమికంగా ఇది మనిషిగా ఒక సాధారణ సందేశాన్ని బోధించడమే” అని డివైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపి ఎఎ రహీం అన్నారు.
మరింత రుచిగా వండేందుకు
‘మేము ఆహార పొట్లాలను అందజేస్తున్నపుడు వారి కండ్లలో కతజ్ఞతను చూస్తాం. అది మాకు చాలా భావోద్వేగ క్షణం. మహిళలు తమ సొంత కుటుంబాలకు చేసే భోజనం కంటే మెరుగైన భోజనాన్ని పంపిణీ కోసం వండుతున్నారు. మరింత రుచిగా వండేందుకు ప్రయత్నం చేస్తారు. వేయించిన చేప ముక్క, పచ్చళ్లు, చట్నీ, పొప్పడును వీటిలో కలుపుతారు” అని చెరువైక్కల్‌లోని డివైఎఫ్‌ఐ వాలంటీర్‌, సివిల్‌ సర్వెంట్‌ అయిన సూర్య హేమన్‌ అంటున్నారు. దేశంలోని అత్యంత ప్రగతిశీల రాష్ట్రాం కాబట్టే ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతం అయిందని అందరూ ‘హృదయపూర్వం’ని అభినందిస్తున్నారు.
– జె.జగదీష్‌, న్యూఢిల్లీ

సంతోషంగా చేస్తున్నాం
చెరువైక్కల్‌ ప్రాంత నివాసి జయ కుమారి నిత్యం భోజన పొట్లాలు తయారు చేసి పంపుతారు. ఆమె మాట్లాడుతూ ‘భోజనం పొట్లాల కోసం వంట చేసేటపుడు నా భర్త కూడా నాకు సహాయం చేస్తారు. వాలంటీర్లు నన్ను రెండు, మూడు పొట్లాలు మాత్రమే సిద్ధం చేయమంటారు. కానీ మేము మాత్రం ఎనిమిది నుండి 10 పొట్లాలను సిద్ధం చేసి ఇస్తాము. ఇదేమీ మాకు భారం కాదు. పైగా చాలా సంతోషంగా చేస్తున్నాము. నేను ఏ కూరగాయతో వంట చేసినా అందులో వేయించిన చికెన్‌ని కలుపుతాను. దీని వల్ల కూరకు రుచితో పాటు తినేవారికి పోషకాలు కూడా అందుతాయి’ అన్నారు.

Spread the love