ఆహార సంక్షోభానికి అమెరికా నాంది!

ఉక్రెయిన్‌కు ప్రమాదకర క్లస్టర్‌ బాంబులు ఇచ్చి సంక్షోభాన్ని మరింతగా ఎగదోస్తున్న అమెరికా ప్రపంచానికి మరొక ముప్పు తలపెట్టింది. అమెరికా చర్యకు ప్రతిగా ఉక్రెయిన్‌ ఆహార ధాన్యాలు, ఖాద్యతైల ఎగుమతుల అనుమతిపై కుదిరిన ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. దాంతో అనేక దేశాల్లో ధరల పెరుగుదల ఆహార సంక్షోభానికి అమెరికా, నాటో కూటమి తెరతీసింది. రాగల ముప్పును గ్రహించిన మన దేశం గురువారం నాడు బాసుమతి రకం మినహా మిగిలిన రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం ప్రకటించింది. ఉక్రెయిన్‌ నుంచి పొద్దుతిరుగుడు పువ్వు నూనె దిగుమతులపై అనిశ్చితి ఏర్పడటంతో నూనెల ధరలకు మరింతగా రెక్కలొచ్చే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా ఇచ్చిన క్లస్టర్‌ బాంబుల దమ్ముతో ఉక్రెయిన్‌ దళాలు రష్యాలోని క్రిమియాలో వంతెన పేల్చివేతకు విఫల దాడి చేశాయి. దానికి ప్రతీకారంగా పుతిన్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. గత మూడు రోజులుగా ఉక్రెయిన్‌లోని మూడు రేవుల మీద పుతిన్‌ సేనలు దాడులు జరుపుతున్నాయి. ప్రధానమైన ఒడెసా, మరో రేవులో అరవైవేల టన్నుల ధాన్యం పనికిరాకుండా పోయిందని వార్తలు. గతంలో తమతో అంగీకరించిన షరతులను అమలు జరిపితే తిరిగి ఒప్పందం మేరకు నౌకలను అనుమతిస్తామని పుతిన్‌ బుధవారం నాడు ప్రకటించాడు. తలెత్తే పరిస్థితికి పశ్చిమ దేశాలదే బాధ్యత అన్నాడు. అందువలన దీనికి పూర్తి బాధ్యత అమెరికాదే అన్నది స్పష్టం. ఐరాస, టర్కీ, ఉక్రెయిన్‌, రష్యా ప్రతినిధులు ఉమ్మడిగా తనిఖీ జరిపి ఉక్రెయిన్‌ వైపు వెళ్లే నౌకల్లో ఆయుధాలు లేవని నిర్థారించిన తరువాత అనుమతించే విధంగా ఒక ఒప్పందం కుదిరింది. ఇప్పుడు దాన్ని పొడిగించేందుకు రష్యా నిరాకరించటంతో మరో సంక్షోభం తలెత్తింది.
నల్లసముద్ర ప్రాంతంలో తిరుగాడే నౌకలను మిలిటరీ ముప్పు తెచ్చేవిగా పరిగణిస్తామని అటు రష్యా ఇటు ఉక్రెయిన్‌ ప్రకటించాయి. దీంతో నౌకల రవాణాను అడ్డుకోనున్నట్లు స్పష్టమైంది. ఇదే జరిగితే ఆహార ధాన్యాలతో పాటు రష్యా, బెలారస్‌ నుంచి జరిగే ఎరువుల ఎగుమతుల మీద కూడా నీలి నీడలు కమ్ముకున్నట్లే. మూడు రోజుల్లో అమెరికా, ఐరోపాలో గోధుమల ధరలు తొమ్మిదిశాతం, మొక్కజొన్న ధరలు నాలుగుశాతం పెరిగాయి. 2012 నుంచి ఒక్కసారిగా ఇంత ఎక్కువగా పెరిగిన ఉదంతం ఇదే. మరోవైపున ఉక్రెయిన్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న గోధుమలతో తమకు దక్కాల్సిన ధరలు రావటంలేదని పోలాండ్‌, హంగరీ, స్లోవాకియా, బల్గేరియా, రుమేనియా రైతులు గత కొద్ది నెలలుగా ఆందోళనలకు దిగారు. దీంతో ఐరోపా సమాఖ్య కొన్ని ఆంక్షలను విధించక తప్పలేదు. రైతులకు చెల్లించేందుకు పదికోట్ల యూరోలను చెల్లించింది. రైళ్ల ద్వారా ఉక్రెయిన్‌ ధాన్యం దిగుమతులకు జర్మనీ, తదితర దేశాలు చూస్తున్నాయి.
పశ్చిమ దేశాల కుట్రలను దాచి పెట్టి ధరల పెరుగుదల, ఆహార సంక్షోభం తలెత్తితే దానికి రష్యాదే బాధ్యత అని ఎదురుదాడి ప్రారంభించారు. గత సంవత్సరం ఐదు నెలల పాటు ఉక్రెయిన్‌ నుంచి నౌకల దిగ్బంధం కారణంగా అనేక దేశాల్లో ధరలు పెరిగాయి, కొన్నిచోట్ల ఆ పేరు చెప్పి పెంచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సిన లక్షల టన్నుల ధాన్యం ఇప్పుడు నిలిచిపోయింది. గతంలో రష్యా చమురు, గాస్‌ ఎగుమతులపై ఆంక్షలతో పాటు నగదు లావాదేవీల మీద కూడా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అవేవీ పెద్దగా పని చేయలేదు. దీంతో ఇప్పుడు రష్యాను మరింతగా రెచ్చగొట్టేందుకు క్లస్టర్‌ బాంబులు, ఇతర అధునాతన మారణాయుధాలను ఉక్రెయిన్‌కు అందిస్తున్నారు. అందువలన ఏ విధంగా చూసినా తాజా పరిస్థితికి అమెరికా, నాటో కూటమిదే బాధ్యత. ఆహారం, చమురు, గాస్‌లను ఆయుధాలుగా చేసుకుంటోందని రష్యాను ఒక బూచిగా చూపేందుకు మరోమారు ప్రారంభించిన ప్రచారంతో సంక్షోభం పరిష్కారం కాదు. తమ ముంగిటకు విస్తరించబోమని నాటోకూటమి హామీ ఇస్తే సైనిక చర్యనిలిపి వేస్తామని సంక్షోభ ప్రారంభం నుంచి పుతిన్‌ చెబుతూనే ఉన్నాడు. దాని గురించి ప్రస్తావించకుండా దాని సరిహద్దులోని ఫిన్లండ్‌, స్వీడన్‌లను చేర్చుకొని రష్యా సరిహద్దులకు చేరారు. ఈ పరిణామం కూడా సంక్షోభం మరింతగా ముదరటానికి దారితీసింది. అందువలన ఏ విధంగా చూసినా వర్తమాన పరిణా మాలు, వివిధ దేశాల్లో తలెత్తే ధరల, ఆహార సంక్షోభం తదితర పర్యవసానాలకు పశ్చిమ దేశాలు, ప్రత్యేకించి అమెరికాదే పూర్తి బాధ్యత.

Spread the love