పరిష్కారం… ప్రజామోదం…

ప్రస్తుతం రాష్ట్రమంతటా ముసురు పట్టింది. ఎక్కడ చూసినా ఒకటే వాన. అది పట్నమైనా, పల్లెయినా ఇదే పరిస్థితి. ఇదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు సమస్యల ముసురు కూడా పట్టింది. జానెడు జాగా కోసం పేదలు, వేతనాలు పెంచాలంటూ పంచాయతీ కార్మికులు, సీఎం హామీనిచ్చిన నాటి నుంచి వేతన పెంపును అమలు చేయాలంటూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, కొలువుల కొనసాగింపు నిర్ణయాలు వెలువడక గెస్టు లెక్చరర్లు, జీతాల్లేక మిషన్‌ భగీరథ కార్మికులు అల్లాడిపోతున్నారు. మరోవైపు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకూ ఖాళీ పోస్టులు మనల్ని వెక్కిరిస్తున్నాయి. ఇవన్నీ తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలు, యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలు.
కానీ రాష్ట్ర సర్కారు వీటిపై శీతకన్నేసింది. ఆయా సమస్యలపై అడిగితే ‘సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలవుతున్నాయి…’ అనే రొటీన్‌ సమాధానాలే మంత్రులు, అధికారుల నుంచి వస్తున్నాయి తప్పితే నిర్దిష్ట సమస్యలకు, నిర్దిష్ట పరిష్కారాలు అనే విధానాన్ని అమలు చేసేందుకు వారు ముందుకు రాకపోవటం శోచనీయం. సర్వ రోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అనే రీతిలో విద్య గురించి ప్రస్తావిస్తే… గురుకులాలు, దళితులకు మూడెకరాల భూమి గురించి అడిగితే ‘దళిత బంధు, వృత్తిదారుల సమస్యలపై నిలదీస్తే ‘బీసీలకు ఆర్థిక సాయం’ అంటూ ప్రభుత్వం తనను తాను సమర్థించుకుంటున్నదే తప్ప ఇతమిద్ధంగా ఆయా సంఘాల డిమాండ్లను పరిశీలించి పరిష్కరించేందుకు చొరవ చూపటం లేదు. ఇది ముమ్మాటికీ విధానపరమైన లోపమే.
ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమంటూ మొన్నటిదాకా గొప్పలు చెప్పుకున్న క్రమంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయటానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటో అర్థం కావటం లేదు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లనిస్తామంటూ ప్రజలకు హామీనిచ్చినప్పటికీ ఇప్పటికీ అనేక జిల్లాల్లో అసలు ఇండ్లే నిర్మించలేదు. నిర్మించిన చోట వాటిని లబ్దిదారులకు అందజేయలేదు. ఈ క్రమంలోనే పేదలు ఇండ్ల జాగాల కోసం పోరు మొదలుపెట్టారు. చాకిరీ ఎక్కువ.. వేతనం తక్కువ అనే రీతిలో ఒక్కో పంచాయతీ కార్మికుడికి ఇచ్చే జీతాన్ని నలుగురైదుగురు సిబ్బంది పంచుకోవాలంటూ సూచిస్తే.. అది ఏ మూలకూ సరిపోక జీపీ కార్మికులు, సిబ్బంది సమ్మెబాట పట్టారు. వారివన్నీ గొంతెమ్మ కోర్కెలు కాదు.. తీర్చలేనివి అసలే కాదు. కానీ వాటిని పరిష్కరించటంలో సర్కారుకు చిత్తశుద్ధి కొరవడటం శోచనీయం.
ఈ క్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రులు… అందుకు భిన్నంగా ఇక్కడో విచిత్రకరమైన వాదనను కూడా ముందుకు తీసుకురావటాన్ని మనం గమనించవచ్చు. తెలంగాణలోని కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరుల అంశాలు ముందుకొచ్చినప్పుడు ఇక్కడి ప్రభుత్వ ఆదాయం, రాష్ట్రంలోని భౌతిక పరిస్థితులు, ఉన్న వెసులుబాట్ల గురించి చెప్పి.. ఒప్పించి, మెప్పించాలి. సామరస్య పూర్వక వాతావరణంలో చర్చలు జరపటం ద్వారా ఆందోళనలు, సమ్మెలను విరమింపజేయాలి. ఇది ప్రభుత్వ గురుతర బాధ్యత. కానీ బెదిరింపులు, హెచ్చరికలు, అల్టిమేటాలు జారీ చేయటమనేది విజ్ఞత అనిపించుకోదు. పంచాయతీ కార్మికుల సమ్మె పట్ల సర్కారు ఇదే రకమైన వైఖరిని ప్రదర్శించి ప్రజాందోళనల పట్ల తన విధానాన్ని చెప్పకనే చెప్పింది.
తమ ఈతి బాధలను మానవత్వంతో అర్థం చేసుకుని, పెద్ద మనసుతో అంగీకరిస్తే అలాంటి వారిని ప్రజలు అక్కున చేర్చుకుంటారు. అలాగాక ఉద్యమాలను కించపరుస్తూ.. హక్కుల కోసం జరిగే పోరాటాలను అవమానపరుస్తామంటే మాత్రం సహించబోరు. అందువల్ల తెలంగాణ తొలి ప్రభుత్వంలో తొలి శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాధినేత చెప్పినట్టు… అధికారంలో ఉన్నవారెవరైనా విజ్ఞత, దక్షత, బాధ్యతను పాటించాలి. వాటిని మాటల్లో చెప్పిన నేతలు.. ఇప్పుడు చేతల్లో చూపించాల్సిన తరుణం ఆసన్నమైంది. రాబోయేదంతా ఎన్నికల కాలం కాబట్టి… ప్రతిష్టకు పోకుండా లౌక్యాన్ని పాటిస్తూ ముందుకు సాగాలి. ఆ క్రమంలో ‘రాజకీయంగా తమకు అవసరమైనప్పుడు, ప్రయోజనం ఉన్నప్పుడే…’ సమస్యలను పరిష్కరిస్తాం.. పలు వర్గాలను సంతృప్తి పరుస్తామనే పంథాను విడనాడాలి. ప్రజలు తమ నిరసనను చెప్పుకోవటానికి ఆస్కారమివ్వాలనే ఉదాత్త మనస్సును పాలకులు కలిగుండాలి. మున్ముందు ప్రజామోదం పొందాలంటే ఈ రీతిలోనే పాలన కొనసాగించక తప్పదు. అలా జరిగినప్పుడే బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుంది.

Spread the love