ప్రపంచాధిపత్య దిశగా నాటో కూటమి!

లిథువేనియా రాజధాని విలినస్‌ నగరంలో జూలై 11, 12 తేదీల్లో జరిగిన వార్షిక నాటో శిఖరాగ్రసభ ఆమోదించిన తీర్మానం, పత్రాలను చూస్తే ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించేందుకు మరొక అడుగు ముందుకు వేసినట్లు స్పష్టం అవుతోంది. సామ్రాజ్యవాదుల నేతగా ఉన్న అమెరికా, దాన్ని ఆశ్రయించుకొని లబ్దిపొందాలని చూస్తున్న జూనియర్‌ భాగస్వాముల మధ్య కొన్ని విబేధాలు ఉన్నప్పటికీ ప్రపంచాధిపత్యం దగ్గరకు వచ్చేసరికి ఒకే మాట మీద ఉన్నట్లు తేటతెల్లమైంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం గురించి ధనిక దేశాల మీడియాలో పెద్దచర్చ నడపటం జనం దృష్టిని మళ్లించే ఎత్తుగడలో ఒక భాగం తప్ప తాజా సమావేశాల ప్రధాన అజెండా అది కాదు. ఇప్పటికైతే దాని గురించి అడగొద్దు, పుతిన్‌ సేనలతో పోరాడేందుకు మీక కావాల్సి అస్త్రాలన్నింటినీ అందిస్తామంటూ నాటో కూటమి దానిలో లేని జపాన్‌ వంటి దేశాలు కూడా వాగ్దానాలు చేశాయి. అంటే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించే ఉద్దేశ్యం వాటికి ఏ కోశానా లేదని, ఎలాగైనా సరే రష్యాను ఓడిస్తే తమకు ఎదురులేదని ప్రపంచాన్ని భయపెట్టి పెత్తనాన్ని నెలకొల్పటం సులభమనే వైఖరి కనిపించింది. ఇస్తామన్న అస్త్రాలతోనే జెలెన్‌స్కీ సంతృప్తి ప్రకటించాడు.
విలినస్‌ సమావేశం విడుదల చేసిన 24పేజీల ప్రకటన, సమావేశాల్లో ఆమోదించిన దాదాపు నాలుగువేల పేజీల పత్రాలలో ఉక్రెయిన్‌ సంక్షోభం ఒక పేజీ వంటిదే. శాంతి చర్చలు జరగాలంటే బేషరతుగా పుతిన్‌ సేనలు అక్కడి నుంచి వైదొలగాలని మరోసారి పునరుద్ఘాటించారు. మరోవైపు ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్‌లో నాటోలో చేర్చుకుంటామని కూడా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొని ఆయుధాలతో తమ గుమ్మం ముందు దిగి ముప్పు తెస్తారనే భయంతోనే రష్యా ప్రత్యేక సైనిక చర్యకు దిగిన సంగతి తెలిసిందే. గతేడాది ఆమోదించిన ఫిన్లండ్‌, తాజాగా ఓకే చెప్పిన స్వీడన్‌తో మరోవైపు నుంచి రష్యా ముంగిటకు నాటో సరిహద్దులు ఇప్పటికే విస్తరించాయి. చక్రబంధంలో ఇది భాగమే. మాస్కోకు ముందు పూర్వపు రాజధాని నగరమైన సెంట్‌ పీటర్స్‌ బర్గ్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు నాటో సేనలను మోహరించవచ్చు. బాల్టిక్‌ ఇప్పుడు నాటో సముద్రంగా మారింది. ఫిన్లండ్‌కు మోకాలడ్డుతామని చెప్పిన టర్కీని దారికి తెచ్చుకున్నారు. దాన్ని పుతిన్‌ నుంచి దూరం చేసేందుకు చివరకు ఎఫ్‌16 యుద్ధ విమానాలను ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది. చాపకింద నీరులా తూర్పు ఐరోపాలో సేనలు, ఆయుధాల మోహరింపు పథకాలను విలినస్‌లో ఆమోదించారు. దానిలో భాగంగా తక్షణమే స్పందించే నాటో దళాలను ఇప్పుడున్న 40వేల నుంచి మూడులక్షలకు పెంచుతారు. ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వటమంటే తక్షణమే రష్యాతో పోరుకు దిగినట్లే. అందుకు ఇప్పుడున్న సన్నద్దత చాలదు గనుక ఇలాంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. మరోవైపున పోలాండ్‌ లేదా ఇతర నాటో సభ్యదేశాలు ఏదో ఒకసాకుతో ఉక్రెయిన్‌లో దళాలను మోహరించేందుకు అమెరికా అనుమతితో తలుపులు తెరిచినట్లు చెబుతున్నారు. అంటే నాటో సభ్యత్వం, ఇతర సాంకేతిక అంశాలను పక్కన పెడితే రష్యాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దం అవుతున్నారు, ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుంది.
తాజా నాటో సమావేశాల తీర్మానంలో మరొక ముఖ్య అంశం చైనా మీద కేంద్రీకరణ. గతేడాది మాడ్రిడ్‌ సమావేశాల్లో చైనా నుంచి సవాలు ఎదురవుతున్నదన్న ఒక్క ముక్కతో నాంది పలికారు. ఈ సారి పదిహేను సందర్భాలలో చైనా ప్రస్తావనలు తెచ్చి ఆరోపణలు, దాడి తీవ్రతను పెంచారు. బీజింగ్‌ నుంచి వ్యవస్థాపూర్వకమైన సవాలు ఎదురవుతున్నదనే పల్లవి అందుకున్నారు. తన రాజకీయ, ఆర్థిక, మిలిటరీతో ప్రపంచంలో తన ముద్ర వేస్తున్నదని, ఇది నాటో, ఇతర దేశాల భద్రతకు, చట్టబద్దమైన పాలనకు ముప్పు తెస్తున్నదని ఆరోపించారు. రష్యాతో వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవటం తీవ్రత మరింత పెరిగిందని ప్రపంచాన్ని భయపెట్టేందుకు ఒక మైండ్‌ గేమ్‌ను ప్రారంభించారు. ఉక్రెయిన్‌కు అపరిమితంగా ఆయుధాలు అందించటం నాటో హక్కని చెబుతున్న దేశాలు తన భద్రత కోసం ఒప్పందాలు, ఆయుధ సేకరణ చేస్తున్న రష్యాది తప్పంటున్నాయి. ఈ క్రమంలోనే మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతాలు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతం నాటోకు ఎంతో ముఖ్యమని చెప్పాయి. ఈ క్రమంలోనే జపాన్‌లో నాటో కార్యాలయ ప్రారంభం గురించిన ప్రతిపాదలనలకు విలినస్‌లో ఆమోదముద్ర వేయాలని చూసినా పర్యవసానాలనూ ఊహించి తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. మొత్తం మీద చూసినప్పుడు ప్రపంచీకరణ వైఫల్యంతో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రపంచానికే ముప్పు తెస్తున్నారని శాంతి శక్తులు గ్రహించాలి.

Spread the love