వార్త యందు జగము వర్థిల్లుచున్నదా!

‘వార్తయందు జగము వర్థిల్లు చున్నది’ అనే వాక్యం పాతదైనప్పటికీ ఆనాటి దానర్థం ఏమైనప్పటికీ, నేడు వార్తలు తెలియకపోతే ప్రపంచంలో చైతన్యయుత పౌరులంగా మెలగలేమన్నది వాస్తవం. ఆధునిక ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో, ఏయే పరిణామాలు సంభవిస్తున్నాయో, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంకేతిక విషయాలు అర్థం చేసుకోవటానికి పత్రికలు, వార్తాచానళ్లు, మీడియా ప్రధానపాత్ర పోషిస్తాయి. అయితే ప్రపంచాన్ని, పరిణామాలను ఇవి వాస్తవంగా ప్రతిబింబిస్తున్నాయా! లేదా! అన్నది ఒక పెద్ద సమస్య. ”ఏది సత్యం, ఏదసత్యం, ఓ మహాత్మా!” అని కవి పాడుకున్నట్లు మనమూ పాడుకోవాల్సిందేనా! ఇదొక సంశయాత్మక విషయం ఒకటయితే, వార్తలు అందించే సంస్థలకు, వ్యక్తులకూ సత్యాన్ని, వాస్తవాన్ని అందించే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయా అనేది మరో సమస్య. ఇప్పుడిది ప్రశ్నార్థకంగా మారిన సమస్య. అందుకనే అప్పుడెప్పుడో కవి ‘పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన మన పత్రికలు’ అని తీవ్ర ధ్వనితో తిట్టారు. తిట్టటం తేలికే కానీ బాగుచేసుకోవడం మహాకష్టం. అయితే ఇప్పటికీ ప్రజల పక్షాన నిలిచి నిబద్ధంగా వార్తలనందిస్తున్న పత్రికలూ, చానళ్లూ సంఖ్య రీత్యా తక్కువే, అయినా ఉన్నాయి. వాటి విస్తృతీ తక్కువే.
శాస్త్ర సాంకేతికత పెరిగాక ఎలక్ట్రానిక్‌ చానళ్లు, సోషల్‌ మీడియా పెద్దయెత్తున జన సామాన్యాన్ని ప్రభావితం చేసే సాధనంగా మారాయి. అందుకనే చానళ్లు అన్నీ ఇప్పుడు కార్పొరేటు శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆయా వ్యాపార వర్గాల ప్రయోజనాలకు భిన్నమైనవేవీ ఇక వార్తలుగా రావు. ప్రజలు, సమాజము అనే ప్రాధాన్యం నుండి వ్యాపారులు, వ్యాపార ప్రయోజనం అనే ప్రాధాన్యానికి మారిపోయిందనేది జగమెరిగిన సత్యం. మనదేశంలోనైతే మోడీ కార్పొరేట్‌ మిత్రుల ఆధీనంలోనే మీడియా అంతా చేరిపోయింది. ఒక్క అంబానీ చేతిలోనే 27 చానళ్లు ఉన్నాయి. ఆదానీ గుప్పిట్లోకి 11 చానళ్లు, సుభాష్‌చంద్ర చేతిలోకి 15 చానళ్లు చేరిపోయాయి. ఇక స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా వార్తలూ, కథనాలు, నిజాలు చెబుతాయని భావించవచ్చా!
”స్వాతంత్య్ర పోరాటంలో పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. నేడు మీడియా కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అంబానీ, అదానీలను కాదని వార్తలు ప్రసారం చేసే స్థితి మీడియాకు లేదు. వాస్తవాలు వెలికితీసే మీడియా సంస్థలకు ఆదాయం రాకుండా ప్రకటనలు నిలిపివేస్తున్నారు. ఆదాయం కోసం వార్తా సంస్థలు మౌనంగా ఉంటున్నాయి. కాబట్టి మీడియా గుత్తాధిపత్యాన్ని పగలగొట్టాలి” అని ప్రముఖ పరిశోధక పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారంటే, పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు బాగుందని కాదుగానీ, ఈ పదేండ్లుగా మీడియాపై నియంత్రణ బాగా పెరిగిపోయింది. డైరెక్టుగానే కార్పొరేట్‌ సంస్థలు మీడియా సంస్థల్ని వారి చేతుల్లోకి తెచ్చేసుకున్నారు. వారి కనుసన్నల్లోనే ఏ కథనమైనా వెలువడుతుంది మరి! ఈ నియంత్రణలు, వొత్తిళ్లు భరించలేని నిజాయితీగల జర్నలిస్టులు, న్యూస్‌ రీడర్స్‌ ఒక్కొక్కరుగా సంస్థల నుండి బయటపడ్డారు. అందుకు రవీశ్‌కుమార్‌ ఒక ఉదాహరణ మాత్రమే.
దీని పర్యవసానంగానే స్వతంత్ర జర్నలిస్టులు నేడు ప్రజాభిప్రాయాలను, జనం సమస్యలను, కార్పొరేట్‌, మతోన్మాదశక్తుల కుతంత్రాలను బయటపెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇది తట్టుకోలేని ప్రభుత్వాలు, పాలకులు, ఉన్మాదులు జర్నలిస్టులపై ట్రోలింగ్‌కు తెగబడుతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. నిర్బంధాలకూ పూనుకుంటున్నారు. అనేక ఆటంకాలనూ కల్పిస్తున్నారు. ఇందుమూలంగానే ప్రపంచంలోని 180 దేశాలతో పోల్చినప్పుడు వరల్డ్‌ ప్రెస్‌ఫ్రీడమ్‌ ఇండెక్స్‌లో 161కి మనదేశం పడిపోయింది. మనకంటే శ్రీలంక, పాకిస్థాన్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌లో ముందున్నాయి. ఇది అత్యంత విచారించాల్సిన విషయం. కానీ మన అధినాయకుడు మాత్రం అమెరికాలో మాత్రం దేశంలో స్వేచ్ఛా సమానత్వం వర్థిల్లుతున్నాయని, ఏరకమైన వివక్షతలూ లేవని నిఖార్సయిన అబద్ధాలను సెలవిచ్చారు. చివరకు బైడెన్‌తో పాటుగా జరిగిన ప్రెస్‌మీట్‌లో మోడీని భారత్‌లో ప్రజాస్వామ్యంపై ప్రశ్నించిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ సబ్రినా సిద్దిక్‌పై కూడా ట్రోలింగ్స్‌ మొదలవ్వటం, దానిని వైట్‌హౌజ్‌ కూడా ఖండించడం చూస్తే ఎంత భయంకరంగా పరిస్థితి ఉందో అర్థమవుతుంది! మొన్న మన రాష్ట్రంలో తులసీచందుపైనా ఇలాంటి బెదిరింపులే జరిగాయి. ఇవికొన్ని మాత్రమే.
ఒకవైపు ప్రజల పట్ల వారి సమస్యల పట్ల నిర్లక్ష్యం చేసే మీడియా, రెండోవైపు నిజాలు చెప్పే, ప్రశ్నలు సంధించే జర్నలిస్టుల పట్ల నిర్బంధం, వేధింపులు – ఇదీ నేటి వార్తా పరిస్థితి! దీని నుండి బయటపడటానికి ప్రజా సమూహాలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా పనిచేస్తున్న వారికి అండగా నిలిచినప్పుడే వార్తయందు జగతి వర్థిల్లుతుంది.

Spread the love