ఓ వైపు మణిపూర్ హింసాత్మక ఘటనల్లో మండిపోతుంటే.. మరో వైపు ప్రధాని అమెరికా వైట్‌హౌస్‌లో విందులు, యోగా వేడుకలు జరుపుకోవడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హింసాకాండకు వ్యతిరేకంగా కుకీ కమ్యూనిటీకి చెందినవారు దేశరాజధానిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం ఎదుట ‘సేవ్ కుకీ లైవ్స్(కుకీల ప్రాణాలను కాపాడండి)’ అనే సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. నిజానికి ఇప్పుడు కాపాడాల్సింది కుకీలొక్కరినే కాదు మతకోరల్లో చిక్కుకుంటున్న దేశ ప్రజల్ని కూడా…
నేడు దేశమంతా మతం రంగు పులుముకుంటోంది. ఇది రోజు రోజుకూ దావాగ్నిలా రగులుకుంటోంది. ఏకంగా మనుషుల ప్రాణాలను బలిగొంటోంది. అయినా మన దేశ్‌కి నేత మౌనంగానే ఉంటున్నారు. మణిపూర్‌లో ‘గిరిజన హోదా’పై కుకీలు, మెయిటీలు రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం హింసాత్మక, ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మణిపూర్ మంటల్లో కాలుతుంటే మన ”విశ్వగురు” మాత్రం విమానమెక్కి విదేశీ పర్యటనలకు చెక్కేశారు… ‘ఇక్కడ మేము ఆదుకునేవారి కోసం ఆర్తనాదాలు పెడుతుంటే ఈ దేశాధినేత ఎక్కడ విందు భోజనం ఆరగిస్తున్నార’ని మణిపూర్ వాసులు ప్రశ్నిస్తున్నారు. తల్లులు, పిల్లలు, వృద్ధులు ప్రశాంతమైన మణిపూర్ కావాలని నేడు రోడ్లమీదకొస్తే ఆయన మాత్రం ఎవరికీ అందకుండా ‘గాల్లో’ తేలుతున్నారు. అతను కావాలనే మణిపూర్‌పై మౌనంగా ఉంటున్నారా?
దేశమంతా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనేది బీజేపీ నినాదం. అప్పుడే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయన్నది వారి విధానం! మరి మణిపూర్ బీజేపీ పాలిత రాష్ట్రమే. డబులింజన్ సర్కారే… అయినా అక్కడ రగిలిన చిచ్చును ఎందుకు ఆర్పడం లేదనేది సంశయం? ప్రజల ప్రాణాలు పోతున్నా, వారి ఆస్తులు ధ్వంసమవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనేదే అంతర్మథనం. రాష్ట్రంలో ఇప్పటికే చాలా చర్చీలు తగలబడ్డాయి. ‘మణిపూర్ మంటల్లో కాలిపోతుంటే మోడీ ఎక్కడా?’ అని ఇటీవల వెలసిన పోస్టర్లను చూస్తే ప్రజల ఆవేదన అర్థమవుతోంది. అక్కడ ఘర్షణ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా వారిని పట్టించుకోక పోవడం వెనుక కారణాలేమిటి? ఈ భయానక, హింసాత్మక ఘటనల్లో ఏకంగా నూట ముఫ్తై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాల పాలయ్యారు. యాభై వేలకు పైగా నిరాశ్రయులయ్యారు. రాష్ట్రం రక్తమోడుతుంటే ప్రజలు భయంభయంగా బతుకు లీడుస్తున్నారు. కొంతమందైతే వలసబాట పట్టారు. ఇంత జరుగుతున్నా డబులింజన్ సర్కార్‌లో స్పందన లేదు!
అసలు మణిపూర్‌లో తమ స్వార్థ రాజకీయాలకు మత చిచ్చుకు ఆజ్యం పోసిందే బీజేపీ. అక్కడ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన ప్రజల్లో కుకీల్లో క్రైస్తవులు అధికం. ఇక మైదాన, లోయ ప్రాంతంలో ఉండే మెయిటీల్లో హిందువులెక్కువ. ఈ మెయిటీల్లో తమకు గిరిజన హోదా కల్పిం చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ మేరకు ఆ వర్గం ప్రజలు ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు కూడా చేపట్టారు. మెయిటీల డిమాండ్‌ను కుకీలు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని బీజేపీ ఈ వివాదానికి ఆజ్యం పోస్తూ వస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల ఆ రాష్ట్ర హైకోర్టు మెయిటీలను ఎస్టీ జాబితాలో చేర్చటాన్ని పరిగణలోకి తీసుకోవడంతో ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చి నేటి అల్లర్లకు దారితీసింది. దీని వెనుక పాత్రదారి, సూత్రదారి బీజేపీయేనన్నది అక్కడి సామాజిక విద్యావేత్తల ఆరోపణ. సీఎం బీరెన్ సింగ్ స్వయానా మెయిటీ వర్గానికి చెందినవారు. ముఖ్యమంత్రే మెయిటీ వర్గం వ్యక్తి కావటం, అందులోనూ మెయిటీలంతా హిందువులవ్వడంతో బీజేపీ దీనిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నమే ఈ హింసకు కారణమవుతోందన్నది విమర్శ.
మణిపూర్‌లో మత ఛాందసవాదం పెరిగిపోవటానికి బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వైఖరే కారణమని సామాజిక, ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. కాగా, ఇది నిజమేనని ప్రధాని మౌనం, ప్రభుత్వాల తీరు నిరూపిస్తున్నాయి! మెయిటీ, కుకీల మధ్య వివాదాన్ని హిందూ, క్రైస్తవుల మధ్య గొడవగా చిత్రించే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ప్రయత్నాలు దీనిని మరింత బలపరుస్తున్నాయి. కుకీలు మయన్మార్ (బర్మా) నుంచి వచ్చారని ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను నెలకొల్పుతున్నారు. లేదు ఇదంతా అబద్ధమయితే ఈ మంటల్ని ఆర్పేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి కాదా! అటువైపు తొంగైనా చూడటం లేదెందుకు? ఓ వైపు మణిపూర్ హింసాత్మక ఘటనల్లో మండిపోతుంటే.. మరో వైపు ప్రధాని అమెరికా వైట్‌హౌస్‌లో విందులు, యోగా వేడుకలు జరుపుకోవడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హింసాకాండకు వ్యతిరేకంగా కుకీ కమ్యూనిటీకి చెందినవారు దేశ రాజధానిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం ఎదుట ‘సేవ్ కుకీ లైవ్స్(కుకీల ప్రాణాలను కాపాడండి)’ అనే సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. నిజానికి ఇప్పుడు కాపాడాల్సింది కుకీలొక్కరినే కాదు మతకోరల్లో చిక్కుకుంటున్న దేశ ప్రజల్ని కూడా…