నేటి నిజాలు

ఎక్కడైనా నిష్పాక్షికం ఉందా?
మనిషి పుట్టుకలో
మహా ప్రస్థానంలో
మంచి ఘడియల పేర
ప్రసవ మరణాలలో?
‘కార్పొ’ ఆస్పత్రుల
కాసుల మాయే కదా?

అవును ఇప్పుడు రాజ్యాలు
కార్పొరేట్ల లాభాల భోజ్యాలు
జాతి జాతీయతల రాగాలు
వాటి చెప్పుకింద నలిగే తేళ్ళు
కుల మత అహాలు ఏవైనా
వాటి లాభార్జనల దాసోహాలు
ప్రపంచమొక పాడిపశువై
నిత్యం పితకాలి లాభాలు
దానికే దేశ పొలిమేరలు చెరిపే
పరదేశీ పెట్టుబడి వ్యాపారాలు

దేశమంటూ ఒకటుందని
చాటింపు వేయడానికే
ప్రజాస్వామ్య పాలక
ప్రభు వర్గ పీఠాలు
మాటలు ఏ కోటలు దాటినా
చేతలు ‘కార్పొ’ల దాసోహాలు
దేశభక్తి ప్రభోద గీతాలేవైనా
మెదడుకెత్తిన మతం మత్తులే
కైపెక్కించే అర్థసత్యాల ఎత్తులే

బ్రాహ్మణ రెడ్డి కమ్మ కాపు
ఆస్తి భేషిజాలు దూసినా
మాల మాదిగ బిసిలమంటూ
అస్తిత్వ ఆర్తనాదాలు చేసినా
సరుకు కొనేవాడే
కార్పొరేటుకు దేవుడు
వినకుంటే కొనకుంటే
బెదిరేసి అదిరేసి పేరేది పెట్టినా
ఏ శాసన హద్దుల్లో బందీని చేసినా
పాలక పలకంపై దేశ ద్రోహే వాడు
రాజాదేశంతో చెరసాల బాధితుడే

‘కార్పొ’ లాభానికి లేని
కుల మత విభజనలు
నిత్యం కష్టం అమ్మి బ్రతికే
‘శ్రముల’కేల ఈ కంపు

గింజ పుట్టించేది సరుకు సృష్టించేది
శ్రమశక్తి ఒక్కటే కష్టజీవి ఒక్కడే
గజమంత ఈ నిజము
జగమంత వెలిగినా
కోర మీసాలు తిప్పడం
కులమత తోకలెత్తడం వంటి
పౌరుషాల రసాలు ఉడికిస్తూ
విడదీసి పడదోస్తున్నారు
వొద్దులే వొద్దిప్పుడు
కులమతాధార అస్తిత్వాలు
కదపండి కలపండి
శ్రమైక్యతా రాగాలాపనలు

కుల మత అహాలు కత్తిరించి
శ్రమజీవుల రెక్క లెక్క కోసం
జనం కదిలి పిడికిళ్ళై లెగిస్తే
మంది బలం ముందు
మద బలం కూలదా?
కష్టాలెరుగని రోజు కోసం
కాలం పడవెక్కి నడపలేమా?
బాధల్లేని జన గానం
గుండె గొంతుకై పాడదా?
– ఉన్నం వెంకటేశ్వర్లు

Spread the love