పశ్చిమ దేశాలకు ఓ హెచ్చరిక!

”మీరు మమ్మల్ని ముట్టుకోనంతవరకు, మేము ఎవరి మీదా అణ్వాయుధ దాడికి దిగే ఆలోచన లేదు, కనుక దాని గురించి మరచిపోండి. అలాగాక దాడికి దిగారో తక్షణ ప్రతిస్పందన ఉంటుంది, దేన్ని దెబ్బతీయాలో తెలుసు” అని గురువారం నాడు రష్యా మిత్రదేశమైన బెలారస్‌ అధినేత అలెగ్జాండర్‌ లుకషెంకో పశ్చిమ దేశాలను హెచ్చరించాడు. దీన్ని వాస్తవానికి పుతిన్‌ హెచ్చరికగానే పరిగణించాలి. గతేడాది మార్చినెల నుంచి రష్యన్‌ దళాల ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‌ జపోరిఝియా అణువిద్యుత్‌ కేంద్రాన్ని పేల్చివేసేందుకు చూస్తున్నారని జెలెన్‌స్కీ గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆరోపణల పూర్వరంగంలో ఈ హెచ్చరిక వెలువడిందని చెప్పవచ్చు. తప్పుడు ప్రచారం చేసి వారే పేల్చివేసి తమ మీద నెట్టేందుకు చూస్తున్నారని రష్యా ప్రకటించింది. మరోవైపున ఏదో ఒక మిషతో జెలెన్‌స్కీ దళాలకు ఆధునిక ఆయుధాలు అందచేసేందుకు నాటో, పశ్చిమ దేశాలు చూస్తున్న తరుణంలో లుకషెంకో హెచ్చరికను తేలికగా తీసుకోలేము. క్రిమియా వంతెన పేల్చివేతకు, ఐరోపాకు గాస్‌, చమురును సరఫరా చేసే పైప్‌లైన్ల ధ్వంసానికి ఉక్రెయిన్‌ దాడులు చేసిన సంగతి తెలిసిందే. కఖోవ్‌ఖా రిజర్వాయర్‌ ఆనకట్టకు గండికొట్టి దిగువన ఉన్న ప్రాంతాలను ముంచివేసిన కుట్ర గురించి చెప్పనవసరం లేదు. ఆత్మరక్షణకు ఎదురుదాడులు అని చెప్పిన జెలెన్‌స్కీ నాటో అండ చూసుకొని ఏకంగా మాస్కో మీద దాడులకు డ్రోన్లను పంపటాన్ని కూడా ప్రపంచం చూసింది.
ఈనెల 11-12 తేదీల్లో లిధువేనియా రాజధాని విలినస్‌ నగరంలో నాటో వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఆ లోపుగా సంచలనం కలిగించే విధంగా జపోరిఝియా అణువిద్యుత్‌ కేంద్రం మీద ఉక్రెయిన్‌ కిరాయి దళాలు దాడులకు దిగవచ్చని మాస్కో అనుమానిస్తున్నది. జెలెన్‌స్కీ ఆరోపణల పూర్వరంగంలో అంతర్జాతీయ అణు ఇంథన సంస్థ ప్రతినిధులు ఆ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎలాంటి అనుమానిత పేలుడు, ఇతర పదార్ధాలు లేవని చెబుతూనే, పూర్తిగా తనిఖీకి అనుమతించలేదని ముక్తాయింపునిచ్చారు. ఆ కేంద్రంలోని రెండు చోట్ల పేలుడు పదార్ధాల మాదిరి ఉన్న వాటిని అమర్చినట్లు జెలెన్‌స్కీ ఆరోపించాడు. వాటి కొనసాగింపుగా ఆ కేంద్రంలోని సిబ్బందిని, రష్యన్‌ మిలిటరీని ఖాళీ చేయించినట్లు కూడా ప్రచారం చేశారు. ఆ కేంద్రాన్ని కవచంగా చేసుకొని తమ ప్రాంతాలపై రష్యా దళాలు దాడి చేస్తున్నట్లు, తాము ప్రతిదాడి జరిపితే అణు విద్యుత్‌ కేంద్రానికి హాని జరిగే అవకాశం ఉన్నందున ఆ వైపు వెళ్లటం లేదని ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాల మీడియా కూడా ప్రచారం చేస్తున్నది.
తమను వెంటనే నాటోలో చేర్చుకోవాలని, ఆధునిక అస్త్రాలను పెద్ద ఎత్తున సరఫరా చేయాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తున్నది. గత నెల రోజులుగా ఎదురుదాడుల పేరుతో జరుపుతున్న ప్రచారంలో పసలేకపోగా మిలిటరీ, ఆయుధాలు కూడా పెద్ద ఎత్తున పోగొట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో నిబంధనలను సడలించి తక్షణమే నాటోలో చేర్చుకొనేందుకు విలినస్‌ శిఖరాగ్ర సభ పూనుకోవచ్చని చెబుతున్నారు. అదే గనుక జరిగితే ఉక్రెయిన్‌ సంక్షోభ స్వభావమే మారిపోతుంది. పుతిన్‌ మీద నేరుగా ఆ కూటమి సేనలు యుద్ధానికి దిగవచ్చు. రష్యా దాడులకు దిగకముందు ఉన్న పరిస్థితి వేరు. తరువాత తమ ప్రాంతాలను ఆక్రమించుకున్నందున నాటో సభ్వత్వం ఇవ్వాలని గతేడాది సెప్టెంబరులో జెలెన్‌స్కీ దరఖాస్తు చేశాడు. అనేక దేశాలు అందుకు మద్దతు తెలిపినా అమెరికా, జర్మనీ సిద్దం కాలేదు. కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్నుంచి వేరుపడి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. క్రిమియా ద్వీపం తమదే అంటూ 2014లోనే రష్యా స్వాధీనం చేసుకుంది. మరికొన్ని ప్రాంతాలు ఇప్పుడు దాని ఆధీనంలో ఉన్నాయి, పోరు జరుగుతున్నది.అటువంటప్పుడు మధ్యలో సభ్యత్వం ఇవ్వటం, గతం నుంచి వర్తింపచేసి ఎదురుదాడులకు పూనుకోవటం నాటో ఐదవ ఆర్టికల్‌ నిబంధన పరిధిలోకి రాదని చెబుతున్నారు. సవరించి ఆ పని చేయటమంటే రష్యాతో నేరుగా తలపడేందుకు నాటో సిద్దమైనట్లే? మాడ్రిడ్‌లో గతేడాది జరిగిన శిఖరాగ్ర సమావేశంలో తొలిసారిగా నాటో కూటమి భద్రతకు చైనా ఒక సవాలుగా ఉందని ప్రకటించారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో చైనా తటస్థంగా ఉన్నప్పటికీ రాజకీయంగా రష్యాతో ఉన్న పటిష్టమైన సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. చైనాను దెబ్బతీయాలని చూస్తున్న జపాన్‌, దక్షిణ కొరియా,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల నేతలు కూడా విలినస్‌ శిఖరాగ్ర సభకు హాజరౌతున్నారు. ప్రస్తుతం తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. కనుక విలినస్‌ సమావేశంలో చైనా అంశాలను లేవనెత్తకుండా ఐరోపా, ప్రపంచ భద్రత, శాంతికి నిర్మాణాత్మక చర్చలు జరిపితే అందరికీ మంచిదని చైనా సున్నితంగా హెచ్చరించింది. సామ్రాజ్యవాదులు, యుద్ధోన్మాదులతో ఉన్న నాటో కూటమికి ఈ హితవచనాలు చెవికెక్కుతాయా?

Spread the love