సేద్యంపై కేంద్రం సమ్మెట పోటు!

ఎరువుల విధానం, చెరకు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సేద్యానికి సమ్మెట పోటుగా తయారయ్యాయి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల (బయో ఫెర్టిలైజర్స్‌) వైపు మళ్లించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం ఇటీవల జరిగిన సమావేశంలో కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. రసాయనిక ఎరువుల వాడకానికి బదులు సేంద్రీయ ఎరువులను వాడడం వల్ల శ్రీలంకలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయి తీవ్ర ఆహార సంక్షోభంలో ఎలా చిక్కుకున్నదీ అందరికీ తెలిసిందే. విఫలమైన ఆ విధానాన్నే మోడీ ప్రభుత్వం దేశంలో అమలు చేయడానికి ఆతత ప్రదర్శించడం ప్రమాదకరం. భూమాతను రసాయనిక కాలుష్యం బారి నుండి కాపాడవచ్చని, పంటల్లో పోషక విలువలు పెరుగుతాయని సర్కారు సెలవిస్తోంది కానీ ఆహార భద్రతకు ఏర్పడే ముప్పును గమనించడం లేదు. పాలకుల అసలు లక్ష్యం ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవాలన్నదే! రైతుల కోసం మూడేళ్లలో రూ.3,70,128 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సిసిఇఎ) ఆమోదించిందని మంత్రులు ప్రకటించారు. భారీగా చెప్పిన ఈ మొత్తంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా కలిపి చెప్పారంటే రైతాంగాన్ని, దేశ ప్రజలను సర్కారు ఎంతలా బురిడీ కొట్టిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం టన్ను చెరకుకు ఫెయిర్‌ రెమ్యూనరేటివ్‌ ప్రైస్‌ (ఎఫ్‌ఆర్‌పి) కేవలం రూ.3150గా ప్రకటించడం చెరకు రైతుకు మళ్లీ మొండిచెయ్యి చూపడమే. చెరకు పంటకు అవసరమైన అన్ని ఇన్‌పుట్స్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది టన్నుకు రూ.100 మాత్రమే పెంచడం రైతులను వంచించడమే అవుతుంది. దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది చెరకు రైతులు, మరింతమంది వ్యవసాయ కార్మికులు, కౌలుదార్లు ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోతారు. బేసిక్‌ రికవరీ రేటు 10.25 శాతంగా నిర్ణయించడమూ దారుణం. సరళీకరణ విధానాలు రాకముందు కనీస రికవరీ 8.5 శాతంగా ఉన్నదాన్ని తొలుత 9.5శాతానికి, 2018-19లో 10శాతానికి, గత ఏడాది 10.25శాతానికీ పెంచారు. కనీస రికవరీని పెంచడం ద్వారా కూడా రైతుకు చెల్లించవలసిన సొమ్ముకు కోత పడుతోంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంట ఉత్పత్తికి అయ్యే మొత్తం ఖర్చు (సి2)కు మరో 50శాతం అదనంగా వచ్చే విధంగా మద్దతు ధరల్ని ప్రకటిస్తామని చెప్పిన కేంద్రం చెరకు రైతును నిలువునా మోస గించింది. మరోవైపున చక్కెర పరిశ్రమాధిపతులకు మాత్రం ప్రోత్సాహకాల పేరిట సర్కారు ఖజానాను దోచిపెడుతోంది. ఆధునీకరణకు వడ్డీలేని రుణం మొదలు ఇథనాల్‌ తయారీ అమ్మకాల్లో భారీ రాయితీ లిస్తోంది. చక్కెర విధానం కూడా దేశ విదేశీ కార్పొరేట్లకు అనుకూలంగానే ఉంటోంది. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడమంటే ఇదే కదా !
మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాల మూలంగా ఏడాదికేడాది చెరకు సాగు తగ్గిపోతూ వస్తోంది. చక్కెర ఉత్పత్తి కూడా తగ్గి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైతుకు గిట్టుబాటయ్యేలా ధర నిర్ణయించడం తొలి చర్యగా ఉండాలి. అతిగా రసాయనిక ఎరువుల వాడకంవల్ల కలిగే నష్టాలను రైతాంగానికి వివరించి, ఆయా భూముల స్వభావం, పంటల సరళికి అనుగుణంగా ఎరువుల వినియోగం, మరోవైపు భూసారాన్ని కాపాడేందుకు పచ్చిరొట్ట ఎరువులు, పంటల మార్పిడి వంటివాటిని శాస్త్రీయ పద్ధతుల్లో అమలు చేసేలా రైతులను విజ్ఞాన వంతుల్ని చేయాలి. సమగ్రమైన ప్రణాళికాబద్ధమైన వ్యవసాయ విధానం, పంటల సరళి, సస్యరక్షణ, మార్కెటింగ్‌ వంటివాటిని సన్న చిన్నకారు రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించాలి. కానీ కేంద్రానికి అదానీ, అంబానీ ల్లాంటి కార్పొరేట్లు, వాణిజ్య పంటల్లో సాగించే కాంట్రాక్టు వ్యవసాయాన్ని లక్ష్యంగా చేసుకొని సేద్య విధానాలు రూపొందించడం నష్టదాయకం. ఒకవైపు ఆత్మనిర్భర్‌ భారత్‌ అని గొప్పలు చెబుతూ ఇంకోవైపున వ్యవసాయ రంగాన్ని కునారిల్లజేయడం మోడీ సర్కారుకే చెల్లింది. చారిత్రాత్మక సుదీర్ఘ పోరాటంతో నల్ల వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టిన రైతాంగం మోడీ సర్కారు వ్యవసాయ విధానాల్ని గట్టిగా ప్రతిఘటించాలి. మరిన్ని ఐక్య పోరాటాలకు సిద్ధపడాలి.
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

Spread the love