విద్వేషపు ఆంక్షలు..!

తినే తిండి మీద ఆంక్షలు…కట్టుకునే బట్టమీద ఆంక్షలు…భావ ప్రకటన పైనా ఆంక్షలు…పుట్టిన నేలపై స్వేచ్ఛగా జీవించాలన్నా ఆంక్షలు. చివరకు బతుకుదెరువు కోసం చేసే పని మీద కూడా ఆంక్షలే! అసలు దేశం ఎటుపోతోంది? ఏమైపోతోంది? సగటు భారతీయుని ఆవేదన ఇది. ఓవైపు ఆధునిక ప్రపంచం అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేసే స్థాయికి దూసుకుపోతుంటే, దేశాన్ని మరోవైపు మతవిద్వేషాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలమయం చేస్తున్న తీరును ఏమనాలి? రాజ్యమేలడం దేశానికి ఏం చెబుతున్నట్టు? ఏం సూచిస్తున్నట్టు? ఈ దేశం ‘మీది కాదు మాది’ అంటే భిన్నత్వంలో ఏకత్వంలా కలిసుండే ప్రజలు ఎక్కడివెళ్లాలి? ఇది విచ్చిన్న విధానం. ఇదే వ్యవస్థ ఇప్పడు దేశంలో అమలవడం చూస్తుంటే ఆందోళనగా ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆంక్షల భోనును ప్రజల నెత్తిన పెట్టారు పాలకులు. ఉత్తర ప్రదేశ్‌లో జులై4న జరిగే కన్వర్‌యాత్ర సాగే ప్రాంతంలో మాంసాన్ని బహిరంగంగా అమ్మకూడదని నిబంధన తీసుకొచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ సమీక్ష జరిపి ఏకంగా నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కానీ బాధితులకు కూడా మనోభావాలు ఉంటాయి కదా? వాటి సంగతేమిటి?
ఉత్తారఖండ్‌లో ఏం జరిగింది? ఉత్తరకాశీలో ఎక్కువమంది ముస్లింలు ఉండే ప్రాంతంలో బక్రీద్‌ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ చేయకూడదని విశ్వహిందూ పరిషత్‌ ఆంక్షలు విధించింది ‘వారి నివాసాల్లో నమాజ్‌ చేసుకుంటే ఎవరడ్డుకుంటారు’ అంటూ వీహెచ్‌పి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వీరేంద్ర రావత్‌ వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉద్దేశపూర్వకమైన మాటల దాడిని చూస్తుంటే కావాలనే ముస్లింలను రెచ్చగొట్టే పద్ధతిని ఆరెస్సెస్‌-సంఘ్ పరివార్‌ ప్రేరేపిస్తున్నదా? అనే అనుమానం రాకమానదు! సంస్కృతీ సంప్రదాయాలను ఆచరిస్తున్నామనే పేరుతో, గౌరవిస్తున్నామనే సాకుతో ప్రజల్ని ఆంక్షల ఛట్రంలోకి లాగే అధికారం వారికి ఎవరిచ్చారు? దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే హిందువులు గుళ్లలో పూజలు చేస్తున్నారు. ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఎప్పుడూ ఎలాంటి ఆటంకాలు రానిది ఇప్పుడే ఎందుకు సృష్టించబడుతున్నవి? ‘హిందూ, ముస్లిం భాయ్ భాయ్’ అని సోదరుల వలే కలిసుండే వారి మధ్య విభజన చిచ్చును ఎందుకు రగిలిస్తున్నారో ఆలోచన చేయాల్సిన అంశంగా కనిపిస్తున్నది.
దేశంలో మైనార్టీ ప్రజలు నిత్యం అభద్రత, ఆందోళన, అసహనంతో బతుకులీడుస్తున్నారు. వారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ఫలాలకు కత్తెరేశారు. హిజాబ్‌ ధరించి కళాశాల, పాఠశాలలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. అంతకుముందే ఎవరూ భీప్‌ తినొద్దని హెచ్చరికలు చేశారు. ఆవు దేవుని ప్రతిరూపమని, దాన్ని పూజించాలని చెప్పుకొస్తున్నారు. ఆవు మూత్రం తాగితే సర్వరోగనివారిణిగా పనిచేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఆవు మూత్రం తాగి ఆవుపాలను గంగలో కలిపే సన్యాసులను చూస్తుంటే ఏమై పోతుంది దేశం అని అనిపించకమానదు. ముస్లింల వృత్తిలో ప్రధానమైనది మాంసం విక్రయించడం. ఇది ఏండ్లుగా సాగుతున్న వారి జీవనోపాధి. ఇప్పుడు కొత్తగా ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో, శోభాయాత్రలు నిర్వహించే ప్రదేశాల్లో, హోమాలు జరిగే చోట్ల మాంసపు అమ్మకాలు నిషేధం అంటే వారి జీవనోపాధి ఏం కావాలి? ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జంతు వధను నిషేధించారు. అక్కడక్కడ పట్టుబడిన మాంసాన్ని కూడా గో మాంసం పేరుతో దాడులు చేస్తూ ముస్లింలను చంపేస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ మహారాష్ట్రలో హత్యకు గురైన అబ్దుల్‌ అన్సారీ. వాస్తవానికి దేశ, విదేశాలకు మాంసాన్ని సరఫరా చేస్తున్నవారిలో హిందువులు కూడా ఉన్నారు. కానీ బాధితులు మాత్రం ముస్లీంలే. దీన్ని బట్టి కాషాయ పరివారానికి ముస్లింల మీదే ద్వేషం తప్ప మాంసం మీద కాదని అర్థమవుతున్నది.
తాలిబన్ల పాలనలో ఉన్న అప్ఘనిస్థాన్‌లో ప్రజల మీద అమలు చేస్తున్న ఆంక్షల గురించి విన్నాం. వారు ఎదుర్కొంటున్న అవరోధాలను తెలుసుకున్నాం. విధిస్తున్న శిక్షలను చూసి ఆందోళనకు గురయ్యాం. ఇప్పుడు ఇక్కడ ముస్లింల మీద జరుగుతున్న ప్రత్యక్ష, పరోక్ష దాడులు చూస్తుంటే అవే పరిస్థితులు మనదేశంలోనూ గోచరిస్తున్నాయి. విభజించు, పాలించు నినాదంతో మత, విద్వేష పాలన సాగిస్తున్న కేంద్రం విధానాల్ని ఎదుర్కోవడం ప్రస్తుతం దేశ లక్ష్యం. లౌకిక ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతునివ్వడం, వారిబాటలో అడుగులేయడం ప్రజల కర్తవ్యం. చీకట్లోకి నెడుతున్న భారతావనికి వెలుగులు చూపడం అందరి బాధ్యత. ఇక ఆలోచించాల్సింది పౌర సమాజమే…

Spread the love