ప్రతిపక్షాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్న బీజేపీ మహారాష్ట్రలో ఎన్‌సిపిని చీల్చిపడేసింది. శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్, తన అనుచర ఎనిమిది మంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని ఉన్నపళంగా ఆదివారంనాడు అధికార శివసేన (ఏక్‌నాథ్ షిండే), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పంచన చేరారు. అలా వచ్చారో లేదో ఇలా అజిత్‌కు కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా, తతిమ్మా ఎనిమిది మందిని మంత్రులుగా నియమించారు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే. వెనువెంటనే రాజ్‌భవన్‌లో గవర్నర్ రమేశ్ బైస్ వారి చేత పదవీ ప్రమాణం చేయించారు. ఉదయం తొమ్మిది గంటలకు అజిత్ నేతృత్వంలో ఎమ్మెల్యేల భేటీ, ప్రతిపక్ష నేత పదవికి అజిత్ రాజీనామా, క్షణాల్లో స్పీకర్ ఆమోదం, ప్రభుత్వంలో చేరిక, ప్రమాణ స్వీకారం… ముందస్తు ప్రణాళిక లేకుండా కొన్ని గంటల్లో ఈ ‘రాజకీయ’ క్రతువు ఎంతమాత్రం సాధ్యమయ్యే పని కాదు. కేంద్ర బీజేపీ కనుసన్నల్లోనే వ్యవహారమంతా నడిచింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఎన్‌సిపి ఫినిష్ అయిపోతుందని ప్రకటించారు. అంతకుముందు అజిత్ పవార్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశ మయ్యారు. వీటికి కొనసాగింపే అజిత్ ముఠా ఫిరాయింపు.
మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత గడచిన నాలుగేండ్లలో పార్టీల చీలికలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులు డ్రామాలా జరుగుతుండగా వీటికి పక్కా స్క్రిప్టు అందిస్తున్నది మోడీ-షా ద్వయమేనన్నది జగమెరిగిన సత్యం. ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. సి.ఎం. పదవి విషయంలో విభేదాలు రావడంతో శివసేన దూరం జరిగింది. మెజారిటీ లేనప్పటికీ కేంద్ర బీజేపీ సూచనల మేరకు అప్పటి గవర్నర్ తెల్లవారుజామున బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేత సి.ఎం.గా ప్రమాణం చేయించారు. అప్పుడే అజిత్ పవార్‌ను దువ్వి ఆయనతో డిప్యూటీ సిఎంగా ప్రమాణం చేయించారు. నాలుగు రోజుల్లోనే శరద్ పవార్ ఒత్తిడి మేరకు అజిత్ వెనక్కొచ్చేశారు. ఫడ్నవీస్ సర్కారు కూలిపోయింది. ఉద్ధవ్ ధాకరే నేతృత్వంలో శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సహించలేని బీజేపీ గతేడాది జూన్‌లో శివసేనను నిట్టనిలువునా చీల్చి ఏక్‌నాథ్ షిండేకు మద్దతిచ్చి సి.ఎం.ను చేసింది. ఏడాదిలో ఇప్పుడు ఎన్‌సీపీ ఎమ్మెల్యేల్లో చీలిక పెట్టింది. వాస్తవానికి ఏక్‌నాథ్, బీజేపీ ప్రభుత్వానికి మెజార్టీ ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలు, ఆపై అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎన్‌సీపీని బీజేపీ చీల్చింది. సి.ఎం.గా పని చేసిన ఫడ్నవీస్ ఏక్‌నాథ్ కేబినెట్‌లో డిప్యూటీ సి.ఎం.గా ఉన్నారు. మరలా అజిత్ కోసం మరో డిప్యూటీ సి.ఎం. పదవిని సృష్టించడం భవిష్యత్ రాజకీయ లబ్ధి కోసమే. కాగా తమ పార్టీ చీలిపోలేదని, కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారని, వారిపై చర్యలు తప్పవని ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ అంటున్నారు.
అధికారం కోసం నానా గడ్డి కరవడం బీజేపీకి అలవాటే. ప్రతిపక్ష పార్టీలలో అసంతృప్తి నాయకులకు గాలం వేసి ఏదొక రకంగా చేరదీయడం, ప్రభుత్వాలను కూల్చేయడం చూస్తున్నదే. మధ్యప్రదేశ్‌లో, గతంలో కర్నాటకలో అదే చేసింది. రాజస్థాన్‌లో అటువంటి ప్రయత్నాలే చేస్తోంది. నాలుగేండ్ల నుంచి మహారాష్ట్రలో చేస్తున్నవి అలాంటి కుట్రలే. ప్రభుత్వాల ఏర్పాటులో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వంటివి పాత్ర పోషించడం బీజేపీ నిరంకుశ, ఏకపక్ష రాజకీయాలకు పరాకాష్ట. బీజేపీ పంచన చేరిన అజిత్ పవార్‌పై అవినీతి కేసులున్నాయి. ఆయనతో వెళ్లిన ఎమ్మెల్యేలందరూ కేసులెదుర్కొంటున్నవారే. అజిత్ పదవీ కాంక్ష ఉండనే ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఒంటరిపాటు చేసి ఓడించే లక్ష్యంతో మొన్న పాట్నాలో నిర్వహించిన విపక్షాల భేటీలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కీలకంగా నిలిచారు. ఆ భేటీకి ఆతిథ్యమిచ్చిన నితీష్ సర్కారును అస్థిరపర్చే కుట్రలు చేసి విఫలమైంది బీజేపీ. ఇప్పుడు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు ఎర వేసి ఆ పార్టీని ఇబ్బంది పెట్టి భయపెడుతోంది. ప్రజాస్వామ్యాన్ని అంతమొందిం చేందుకూ బీజేపీ వెనుకాడట్లేదు. బీజేపీ కుట్రలను ఎదుర్కొని నిలబడటమే పార్టీల ముందున్న సవాల్. ప్రజాస్వామ్య పరిరక్షణే దేశ ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.