దేశం గొంతెత్తాలి…

హింసాకాండతో మండుతున్న మణిపూర్‌ నుండి పది పార్టీలకు చెందిన ప్రతినిధులు ఢిల్లీకి వచ్చారు. రెండు వర్గాల ఘర్షణ వల్ల రాష్ట్రంలో ఇప్పటికే 150మందికి పైగా చనిపోయారని సామాజిక సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఆరవై వేల మందిపైగా నిరాశ్రయులయ్యారని ప్రసార సాధనాలు ఘోషిస్తున్నాయి. ఢిల్లీకి వచ్చిన మణిపూర్‌ ప్రతినిధులు జూన్‌ పదో తేదీ నుండి ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం పడిగాపులు కాశారు. వారిని కలవటానికి ప్రధాని సమయం ఇవ్వలేదు. ఆదిపురుష్‌ చిత్రం డైలాగ్‌ రైటర్‌కు మాత్రం 45నిమిషాలు సమయమిచ్చి ముచ్చటించారు. అంతేకాదు రైలు ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ‘బాలాసోర్‌’ను ప్రధాని సందర్శించారు. అందుకు అభినందించాలి. కానీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి, నిరాశ్రయులుగా మారుతూ, నేటికీ హింసాకాండ కొనసాగుతున్న మణిపూర్‌కు ఎందుకు పోవటం లేదు. అక్కడికెళ్తే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది గనుక. ఇది అక్షరాల నిజం. అందుకే మౌనాసనంతో, యోగా విన్యాసాల కోసం యూఎన్‌ఒకు, అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు యూఎస్‌ఏకు మందీ మార్భలంతో ప్రధాని దేశం విడిచి వెళ్ళారు. మణిపూర్‌లో మెయిటీలు, కుకీలు తదితర జాతుల మధ్య అపనమ్మకాలతో చిచ్చురేగి యాభై రోజులు దాటింది. మారణకాండ సాగుతున్న సమయంలో ప్రధాని కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, రోడ్‌షోలలో వారం రోజుల పాటు అక్కడే గడిపారు. హింస ప్రారంభంలోనే ప్రధాని నిబద్దత, ధృఢసంకల్పంతో తగిన చర్యలు తీసుకుంటే 24గంటల్లోనే మారణకాండ ఆగిపోయేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో శాంతికోసం ఒక్కమారైనా ప్రధాని నోరు విప్పలేదు. కనీసం మన్‌కీ బాత్‌లోనైనా ప్రవచిస్తారేమోనని ఎదురు చూసిన వారికి ఆశాభంగమే కలిగింది. కేంద్రం లోనూ, ఆ రాష్ట్రంలోనూ ఉన్నవి ఒకే పార్టీ ప్రభుత్వాలు. కాషాయ నేతల భాషలో చెప్పాలంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌. మణిపూర్‌ నుండి బీజేపీకే చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని ప్రధానికే మెమోరాండం అందజేసినట్టు పత్రికల్లో చూశాం.
మణిపూర్‌లో చిచ్చుకు కారణం కాషాయనేతలేనన్నది బహిర్గత మవటంతో దేశం విస్తుపోయింది. బీజేపీయే కదా అధికారంలో ఉన్నది వారెందుకు బాధ్యుల వుతారన్న కౌంటర్‌ వాదనలు వినిపించాయి. నిజమేననిపిస్తుంది. మణిపూర్‌ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న ‘మెయిటీ’ జాతి ప్రజలకు ఎస్‌టీ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తే ఆ రాష్ట్రంలో అధికారం శాశ్వతం చేసుకోవచ్చన్న ‘దురాలోచన’తో పావులు కదిపారు. శతాబ్దాలుగా అక్కడి ప్రజల మధ్య నెలకొన్న ఐక్యత, సామరస్యతలతో చెలగాటమాడారన్న విషయం దేశంలో, మీడియా, వీడియోలు బట్టబయలు చేశాయి. ప్రార్థనా మందిరాలపై దాడులలో ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తమంటూ పత్రికలలో కథనాలు చూశాం. విభజనవాదానికి హద్దులేముంటాయి? సాధనే దానికి సరిహద్దు. మణిపూర్‌లో శాంతికోసం మాట్లాడటమంటే విభజన వాదాన్ని వ్యతిరేకిం చటమే అవుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్తగా చెప్పుకునే ప్రధాని అందుకే నోరువిప్పటం లేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. దేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వంగా విలసిల్లుతూ దేశాన్ని భావ సమైఖ్యతతో భారతీయులను ఐక్యంగా ఉంచగలుగు తున్నది. రాజకీయపార్టీలు తమ పాలనతో మెజారిటీ ప్రజలకు దగ్గరవటం, తమ విధానాలకు, పాలనా సామర్థ్యానికి గీటురాయిగా భావిస్తారు. కానీ విభజన వాదులు అధికారానికై ఎన్నుకున్న మార్గం దేశానికి, ప్రజలకు అత్యంత ప్రమాదకరమైంది. కులం, మతం, ప్రాంతం, భాషలలో మెజారిటీగా ఉన్న ప్రజలను భావోద్రే కాలకు గురిచేసి అధికారానికై ఎగబాకాలనుకోవటం అమానవీయమే కాదు అత్యంత హేయం. వాస్తవాలతో సంబంధం లేకుండా ఎవరో కొందరు మూర్ఖులనో, మూఢాచారాలో సాకుగా, బూచిగా చూపి ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్లుగా మెజారిటీ ప్రజానీకాన్ని రెచ్చగొట్టే ధోరణి అత్యంత గర్హనీయం. ఈ విధానాలకు నిరసన తెలిపే వారిపై తమ అధికార దండం ఆయుధాలుగా ఈడీ, సీబీఐ, ఐటీల ద్వారా దాడులకు ప్పాలడుతున్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న తలసీచందు, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, దేవి వంటివారిని ట్రోల్‌చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు.
ప్రజలు భావోద్వేగాలకు గురయ్యే నాటకీయ పరిణామాలను ఎన్నికల సమయంలో చూశాం. ప్రత్యామ్నాయ విధానాలతో బలమైన రాజకీయ పక్షాలు ఐక్యంగా ప్రజల ముందు కనిపించకపోవటం వలన రెండవసారి కూడా ఈ విభజనవాదులు కేంద్రంలో అధికారానికి రాగలిగారన్నది వాస్తవం. ప్రపంచంలో రెండవ పెద్ద దేశంగా, ప్రజాస్వామ్య మూలాలున్న భారత్‌లో మనువాద ప్రచారకులు అధికారంలో కొనసాగటం చూస్తున్నాం. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు జీవనాడిగా ఉన్న రాజ్యాంగంపైనే దాడి చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, పాలకపార్టీ ప్రతినిధులు మన రాజ్యాంగం పనికిమాలినదంటూ, నాటి ప్రాచీన మనుధర్మ శాస్త్రమే నేటి రాజ్యాంగానికి ప్రత్యామ్నా యమని ప్రచారం చేస్తున్నారు. అయినా రాజ్యాంగ పరిరక్ష కుడిగా ప్రధాని నోరు విప్పరు, వారిని నివారించరు. ప్రజల పక్షాన మాట్లాడకుండా, విభజన వాద భావజాలం ప్రతినిధులుగా మరల అధికారానికై, కుటిలమైన ఎత్తుగడలతో వ్యవహరించటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశానికి పతకాలు తెచ్చిన రెజ్లర్లతో ఫొటోలు దిగి, తేనేటి విందులిచ్చారు ప్రధాని మోడీ. అందులోని మహిళా రెజ్లర్లే ‘లైంగిక వేధింపులకు గురవుతున్నాము, చర్యలు తీసుకోండి’ అని అభ్యర్థిస్తూ రోడ్లపైకి వచ్చినా నాలుగు మాసాల నుండి ప్రధాని మోడీ నోరువిప్పటం లేదు. రెజ్లర్ల, మణిపూర్‌ ప్రజల వేదన మానవ మృగాల మధ్య అరణ్య రోదనగా మారిపోయింది.ప్రజల సమస్యలు, బాధలు, వేదనల పట్ల గుడ్డిగా, చెవిటిగా, మూగవారిగా వ్యవహరిం చటమే కనిపిస్తున్నది. శుద్దులతో ‘మంకీబాత్‌’లు, ఉద్వేగాలతో భాషణలు, ఎన్నికల్లో భ్రమలు గొల్పే వాగ్దానాలతో విశ్వరూపం ప్రదర్శిస్తారు. తొమ్మిది సంవత్సరాలుగా ఇదే తంతును చూస్తూనే ఉన్నాం. నాడు అక్షరాస్యులుగా ఆధిపత్య స్థానాల్లో ఉన్న కొద్దిమంది, మనుధర్మశాస్త్ర సూత్రాలతో నిరక్షరాస్యులుగా మెజారిటీ ప్రజలను మానసికంగా బానిసల్ని చేసిన తీరు చరిత్రలో చూశాం. అక్షరాస్యులుగా ఉన్న మెజారిటీ ప్రజలను నేడు మెజారిటీ, మైనారిటీలుగా చీల్చే భావజాల ప్రచారంతో అధికారంలో కొనసాగటం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రజాసమస్యలపై మోడీ నోరువిప్పటం భ్రమేనన్నది స్పష్టం. ప్రధానిగా ప్రజల సమస్యలపై స్పందించకుండా పార్టీ, కార్పొరేట్‌ ప్రచారకగా ఏకపక్ష ధోరణితో వ్యవహరించేవారిని ఎంతకాలం భరిస్తాం! కనుక ఇప్పుడు నోరు విప్పాల్సింది జనం. లేదంటే అధికార కాంక్షతో మనుషుల మధ్య విభజన సృష్టిస్తున్న మనువాద చక్రాల కింద నలిగిపోతాం!
సిహెచ్‌. కృష్ణారావు
9490098586

Spread the love