కండక్టర్ల మెడపై కత్తి!

నిత్యం జనంతో కిటకిటలాడే హైదరాబాద్‌లో కూడా సర్వీసులు బాగా తగ్గించేశారు. దాంతో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. గత్యంతరం లేక ప్రయివేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ప్రజలను, కార్మికులను ఇద్దరినీ ఆర్టీసీ ఇబ్బందుల పాలు చేస్తున్నది. అధికారులు ఉద్యోగులను వేధించడంపై పెట్టిన ఆసక్తి బస్సుల సంఖ్య పెంచడం, రూట్ల సర్వీసులు పెంచడం, ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలపై పెడితే ఆర్టీసీ మరింత మెరుగ్గా నడుస్తుంది.
   ఆర్టీసీ ఓ సేవా సంస్థ. సామాన్య ప్రజలను సకాలంలో తమ గమ్యాలకు చేర్చేందుకు ఏర్పడిన ముఖ్యమైన ప్రజారవాణా వ్యవస్థ. అలాంటి సంస్థను ఇప్పుడు కేవలం ఓ ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. దీని కోసం ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నది. టార్గెట్లు పెట్టి మరీ వేధిస్తున్నది. మానసికంగా హింసిస్తున్నది. దీనికి ఉదాహరణే ఇటీవల మియాపూర్‌, మేడ్చల్‌ డిపోల వద్ద జరిగిన ఫ్లెక్సీల ఉదంతం.
ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల కొత్త బస్‌పాస్‌లను తీసుకొచ్చి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే ఈ పాస్‌లు రోజుకు ఇన్ని కచ్చితంగా అమ్మాల్సిందే అంటూ కండక్టర్లకు టార్గెట్లు నిర్దేశించారు. కండక్టర్లు గొంతు అరిగిపోయేట్టు ప్రయాణికులకు అవగాహన కల్పించి మరీ అమ్మకాలు పెంచుతున్నారు. దీంతో ఆర్టీసీకి కొంత ఆదాయం పెరిగింది. ఇంకా పెంచాలని అధికారులు కండక్టర్లను ఒత్తిడి చేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే గొంతు మీద కత్తి పెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. అమ్మలేక పోయిన కండక్టర్ల ఫొటోలను ఫ్లెక్సీల రూపంలో డిపోల వద్ద పెట్టి అవహేళన చేస్తున్నారు. అవమాన భారంతో ఉద్యోగులు కుంగిపోతున్నారు.
ఆర్టీసీపై సుమారు 48వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీరికి సంబంధించిన ఒక్క ఆర్థిక సమస్య కూడా పరిష్కరించలేదు. పైగా 2017, 2021లో జరగాల్సిన వేతన సవరణ చేయలేదు. 2013లోని పే స్కేల్‌తోనే జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో సుమారు వెయ్యి సర్వీసులు తగ్గించేశారు. కొత్త ఉద్యోగులను తీసుకోవడం లేదు. ఉన్న ఉద్యోగులకే పనిభారం పెంచారు. అయినా ఉద్యోగులు సేవా భావంతో శ్రమిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం మొదటి నుంచీ ఆర్టీసీకి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. 2022-23 ఆర్థిక ఏడాదిలో బస్‌పాసుల రీయింబర్స్‌మెంట్‌ రూ.850 కోట్లు రావల్సి ఉంటే కేవలం రూ.295 కోట్లు మాత్రమే ఇచ్చింది. బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించి రూ.763 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అధికారులేమో ప్రభుత్వం నుంచి రావల్సిన బకాయిల ఊసే ఎత్తకుండా ఉద్యోగులను టార్గెట్‌ చేస్తున్నారు.
హైదరాబాద్‌ నగరంలో ఆర్టీసీ కార్మికులు 13,800 మంది వరకు ఉంటారు. అందులో ఎనిమిది వేల మంది కండక్టర్లు ఉన్నారు. నగరంలోని ట్రాఫిక్‌ రద్దీతో సమయానికి డ్యూటీ పూర్తి చేయడం జరిగే పని కాదు. అయినా సరే ఆ ఉద్యోగులు తమ రోజువారీ ట్రిప్పుల టార్గెట్‌ పూర్తి చేసిన తర్వాతనే ఇండ్లకు పోవాలి. దాంతో కొంతమంది రోజులో 12 నుంచి 14 గంటల వరకు కష్టపడుతున్నారు. ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఎంతో మంది ఉన్నారు. వీరి కష్టాలైతే మాటల్లో చెప్పలేనివి. కొన్ని డిపోల్లో మరుగుదొడ్ల సదుపాయం లేక చుట్టుపక్కల ఇండ్ల వారిని బతిమాలుకుంటున్నారు. అయినా వీరి శ్రమను ఆర్టీసీ యాజమాన్యం గుర్తించడం లేదు. కనీసం అత్యవసర సమయాల్లో కూడా సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారు.
ఇప్పటికీ రాష్ట్రంలో ఆర్టీసీ హారన్‌ మోగని పల్లెలు 1200 ఉన్నాయి. వాటి గురించి అధికారులకు ఆలోచనే లేదు. నడుస్తున్న పల్లె వెలుగు బస్సుల్లో సగం అద్దె బస్సులే. ‘కండక్టర్లు ప్రజా రవాణా సంస్థలకు ఆదాయం తేవట్లేదు. డీజిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీటిని నివారించేందుకే ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టాం’ అంటూ ఇటీవల జరిగిన సీఐఐ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కండక్టర్లను అవమానించాడు. దేశ వ్యాప్తంగా జనం రద్దీ ఉండే ప్రతీ చోట ప్రయివేటు బస్సులకు అనుమతించి ఆర్టీసీ నష్టాల్లో ఉందనడం హాస్యాస్పదం. పైగా నష్టాలకు కండక్టర్లను కారణం చేయడం ఘోరం. ఇక మన రాష్ట్రంలో ఇటీవల ఎలక్ట్రిక్‌ బస్సులు అద్దెకు తీసుకున్నారు. కార్మికుల శ్రమని ప్రయివేటు పరం చేయడానికి తప్ప ఈ బస్సుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి లాభం లేదనేది జగమెరిగిన సత్యం.
ఇక నిత్యం జనంతో కిటకిటలాడే హైదరాబాద్‌లో కూడా సర్వీసులు బాగా తగ్గించేశారు. దాంతో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. గత్యంతరం లేక ప్రయివేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ప్రజలను, కార్మికులను ఇద్దరినీ ఆర్టీసీ ఇబ్బందుల పాలు చేస్తున్నది. అధికారులు ఉద్యోగులను వేధించడంపై పెట్టిన ఆసక్తి బస్సుల సంఖ్య పెంచడం, రూట్ల సర్వీసులు పెంచడం, ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలపై పెడితే ఆర్టీసీ మరింత మెరుగ్గా నడుస్తుంది.
సమస్యలకు మూలాలను పరిష్కరించకుండా ఆర్టీసీ ఉద్యోగులను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని కార్మిక సంఘాలు మొత్తుకుంటున్నాయి. ఫలితంగా ఉద్యోగుల్లో అభద్రతా భావం రోజురోజుకూ పెరిగిపోత్నుది. స్వరాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది ఆర్టీసీ కార్మికులే అంటే అతిశయోక్తి ఏమీ లేదు! ఇప్పటికైనా సర్కారు స్పందించాలి.

Spread the love