రాజదండం వెనుక కట్టుకథ!

మే 28వ తేదీ ఉదయం ఈ రాజదండాన్ని పట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ మత గురువులు, మతాధిపతుల ప్రదర్శనకు ముందు నడవడం, దాన్ని లోక్‌సభలో
సభాపతి కుర్చీ వెనుక ప్రతిష్టించడమన్నది, హిందూ దేశాన్ని అనుకరిస్తూ కొత్త భారతదేశాన్ని ప్రతిష్టించడంలో భాగంగానే ఉంది. ఇది లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్‌ భావజాలానికి పూర్తి విరుద్ధం. రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలంటూ కొత్తగా నియమితుడైన రాజుకు సాంప్రదాయంగా ప్రధాన మత గురువు అందించే రాజదండమే ఇది.

పజలు ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజాస్వామ్య రిపబ్లిక్‌లో ఇటువంటి భావనకే స్థానం లేదు.
మే28న కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవాన్ని 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. ప్రభుత్వ, పార్లమెంట్‌ అధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కకు పెట్టి కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ కారణంతోనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్క రించాయి. ప్రభుత్వ అధినేతను పార్లమెంట్‌పై బలవంతంగా రుద్దుతూ రాజ్యాంగపరంగా తీసుకున్న అనౌచిత్య చర్య ప్రతిపక్షాల నిరసనకు చట్టబద్ధమైన కారణంగా ఉంది.
వాస్తవానికి ప్రారంభోత్సవం రోజున జరిగిన పరిణామాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలన్న ప్రతిపక్షాల నిర్ణయాన్ని మరింత బలపరిచాయి. ఆనాడు వైస్రారు లార్డ్‌ మౌంట్‌బాటన్‌, జవహర్‌లాల్‌ నెహ్రూకు అధికారాల బదలాయింపునకు గుర్తుగా అందచేసిన రాజదండాన్ని పార్లమెంట్‌ లోపల నెలకొల్పనున్నట్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా అకస్మాత్తుగా ప్రకటించారు. అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే… ”పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూకు రాజదండాన్ని అప్పగించడం ద్వారా భారతదేశ అధికార బదలాయింపు జరిగింది” అని పేర్కొన్నారు. ఆ రకంగా బ్రిటిష్‌ వారి నుండి కొత్త ప్రభుత్వానికి ‘అధికార బదలాయింపు’ను సూచించేలా హిందూ మతపరమైన కల్పిత కథనం రూపొందించబడింది.
అధికార బదిలీని ప్రతిబింబించేలా భారతీయ కార్యక్రమం ఏదైనా ఉందా అని లార్డ్‌ మౌంట్‌బాటన్‌, జవహర్‌లాల్‌ నెహ్రూను అడిగినట్లు అధికారికంగా తెలియచేయబడింది. అప్పుడు నెహ్రూ, కాంగ్రెస్‌ నేత రాజగోపాలాచారిని దీని గురించి సంప్రదించగా… ఆయన తమిళనాడులోని మతపరమైన మఠాలను సంప్రదించి, అధికార బదిలీకి ప్రతీకగా రాజదండం ఉండాలని సూచించారు. రాజ్యాంగ నిర్ణాయక సభ అధికారిక సమావేశానికి ముందుగా ఆగస్టు 14వ తేదీ రాత్రి లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ఆ రాజదండాన్ని నెహ్రూకు అందచేశారని తెలియచేయ బడింది. అయితే, రాజదండం గురించి అసలు వాస్తవం, చరిత్ర ఏమిటి? అధికార బదిలీకి ఉపయోగించే గుర్తు గురించి మౌంట్‌బాటన్‌, నెహ్రూను అడిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లేదా రికార్డులు లేవు. అసలు ఈ విషయంలో రాజాజీ పాత్ర ఉందన్నట్లుగా కూడా ఎలాంటి ఆధారం లేదు. వాస్తవానికి మౌంట్‌బాటన్‌, నెహ్రూ కు రాజదండాన్ని అందచేయలేదు. ఆగస్టు 13వ తేదీ సాయంత్రం మౌంట్‌బాటన్‌ కరాచి వెళ్ళారు. తిరిగి ఆగస్టు 14వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చారు.
తమిళనాడులోని శైవమఠం ఆధ్వర్యంలో ఈ దండం తయారుచేయబడింది. దాన్ని ఢిల్లీకి తీసుకువచ్చి 14వ తేదీ రాత్రి నెహ్రూ నివాసంలో ఆయనకు అందచేశారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక కార్యక్రమం లేదు. ఇదంతా కేవలం అనధికారిక వ్యవహారం మాత్రమే. ఇతర అనేక బహుమతు ల్లాగానే దీన్ని కూడా నెహ్రూ స్వీకరించారన్నది వాస్తవం. తర్వాత దాన్ని అలహాబాద్‌ మ్యూజియంలో పెట్టారంటేనే నెహ్రూ ఆ విషయాన్ని ఎలా చూశారన్నది అర్థమవుతోంది.
14వ తేదీ రాత్రి ఈ రాజదండాన్ని అప్పగించడం ద్వారా అధికార బదిలీ జరిగిందంటూ కట్టు కథలు చెప్పడాన్ని చూస్తుంటే, హిందూ రాజ్యాన్ని పునరుద్ధరించడం ద్వారా శతాబ్దాల తరబడి సాగిన బానిసత్వ పాలన ఎలా అంతమొందించబడిందో చెప్పడానికి ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ అల్లిన కథనానికి సరిపోతుంది. ఆనాటి నేతలకు కల్పిత పాత్రలను అంటగడుతూ చారిత్రాత్మకంగా దీనికో కథనాన్ని కల్పించడం ద్వారా అధికార బదిలీ కార్యక్రమానికి హిందూ మతం రంగు పులమగలిగారు. ఈ రాజదండం అధ్యాయం కల్పిత గాథను రూపొందించింది ఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతికవేత్త ఎస్‌.గురుమూర్తి. 2021లో తమిళ పత్రికలో దీని గురించి ఆయన రాశారు.
మే 28వ తేదీ ఉదయం ఈ రాజదండాన్ని పట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ మత గురువులు, మతాధిపతుల ప్రదర్శనకు ముందు నడవడం, దాన్ని లోక్‌సభలో సభాపతి కుర్చీ వెనుక ప్రతిష్టించడమన్నది, హిందూ దేశాన్ని అనుకరిస్తూ కొత్త భారతదేశాన్ని ప్రతిష్టించడంలో భాగంగానే ఉంది. ఇది లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్‌ భావజాలానికి పూర్తి విరుద్ధం. రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలంటూ కొత్తగా నియమితుడైన రాజుకు సాంప్రదాయంగా ప్రధాన మత గురువు అందించే రాజదండమే ఇది. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజాస్వామ్య రిపబ్లిక్‌లో ఇటువంటి భావనకే స్థానం లేదు. పైగా పార్లమెంట్‌లో ప్రధాన స్థానంలో ఇటువంటి మతపరమైన చిహ్నాన్ని ఉంచడమనేది లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ స్వభావానికే పూర్తి విరుద్ధం.
వి.డి.సావర్కర్‌ జయంతి అయినందునే మే 28వ తేదీని కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి ఎంచుకున్నారు. కొత్త భారతదేశం ఎలా నిర్మించబడుతుందో చెప్పడానికి ఇది కూడా ఒక సంకేతం. తొలుత స్వాతంత్య్ర సమరయోధునిగా పోరాటం మొదలుపెట్టిన సావర్కర్‌ తదనంతర కాలంలో అండమాన్‌ సెల్యులార్‌ జైలు నుండి విడుదలైన తర్వాత బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని విరమించుకున్నాడు. పదే పదే క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు పెట్టుకున్న అనంతరం ఆయనను జైలు నుండి విడుదల చేశారు. ఇక ఆ తర్వాత పూర్వపు పాలకులు, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం జరపడంపై, హిందూత్వను పునరుద్ధ రించడంపై ఆయన తన దృష్టిని మరల్చాడు. ఆయన హిందూత్వ భావనను సమర్థించిన బీజేపీ పాలకులు, వేలాది సంవత్సరాల బానిసత్వ పాలనను అంతమొందించడమే హిందూ రాష్ట్ర స్థాపనగా చూశారు.
అదే రోజున కొత్త పార్లమెంట్‌ భవనానికి కొద్ది వందల మీటర్ల దూరంలోనే శాంతి యుతంగా ఆందోళన జరుపుతున్న మహిళా రెజ్లర్లను పోలీసులు దారుణంగా ఈడ్చుకెళుతూ అరెస్టు చేశారు. దీంతో ఈ రాజదండం ధర్మపాలనను ప్రతిబిం బిస్తుందన్న బీజేపీ పాలకుల వాదన ఘోరంగా దెబ్బ తింది. ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొంటున్న నూతన భారతదేశ చిహ్నాలు… అయోధ్యలో రామాలయ నిర్మాణం, సెంట్రల్‌ విస్తా, కొత్త పార్లమెంట్‌ భవనం… ఇవన్నీ కొత్త నిరంకుశ హిందూత్వ రాజ్య లక్షణాలుగా ఉన్నాయి. ఈ భాష్యానికి అనుగుణంగా చరిత్రను వక్రీకరించడం, సృష్టించడం చేస్తున్నారు.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

 

Spread the love