నీడ కోసం పోరుబాటై…

ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పేదలు పెద్ద సంఖ్యలో కదులుతున్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. నిర్బంధాన్ని తట్టుకుని, పాములు, తేళ్ళ మధ్య బతుకుతున్నారు. పాలకులు పట్టించుకోరు. ప్రభుత్వాలే భూములు అమ్మకానికి పెడుతున్నాయి. బడాబాబులు కబ్జాలు చేస్తున్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా, పేదలకు జానెడు జాగా కూడా మిగలదన్న ఆందోళన పేదల్లో పెరిగిన ఫలితమే ఈ ఉద్యమం. వీరికి భరోసా ఇచ్చేందుకు తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నాయకత్వ బృందం బస్సుయాత్ర చేసింది. 19జిల్లాలలోని 64పోరాట కేంద్రాల్లో పర్యటించింది. గుడిసెవాసు లతోపాటు తింటూ, వారితోపాటే గుడిసెల కేంద్రాల్లో బస చేసింది. రాష్ట్ర నాయకులు హౌటల్‌ గదుల్లో, గెస్ట్‌హౌజుల్లో ఉంటారని మాత్రమే వారికి తెలుసు. తమతోపాటు గుడిసెల్లో బస చేస్తారని వారు ఊహించ లేదు. అందుకే వారికి కొండంత విశ్వాసం కలిగింది.
ఓట్లకోసం పాకులాడటమే తప్ప పాలకులకు వీరి పాట్లు పట్టవు. కేంద్రంలో మోడీ సర్కారు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద, 2022 డిసెంబర్‌ 31 నాటికే ఇండ్లులేని పేదలకు ఇండ్లు కట్టిస్తామని ప్రకటించింది. ఆ గడువు దాటింది. మోడీ మళ్ళీ ఆ ఊసెత్తడంలేదు. ప్రధాని నివాసం మాత్రం, ప్రభుత్వ డబ్బుతో, 36228 చదరపు అడుగుల స్థలంలో 2,26,203 చదరపు అడుగుల భవనం నిర్మించుకుంటున్నారు. తడిక చాటు లేని మహిళల బతుకులు ఎంత దుర్భరమో కదా! ఆడబిడ్డల అవసరాలు పట్టవు. అందలం ఎక్కినవారికి మాత్రం అన్నీ కావాలి. రాష్ట్ర పాలకులు కూడా ముఖ్యమంత్రి నివాసం, సచివాలయం నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యత పేదల ఇండ్ల నిర్మాణానికి ఇవ్వలేదు. దశాబ్దాల కాంగ్రెసు పాలనలో నిర్లక్ష్యానికి గురైన పేదలు నేటికీ గూడు కోసం గోడు వినిపించవల్సిన పరిస్థితే!
ఇంటి సౌకర్యం పేదల హక్కు. రాజ్యాంగంలోని 21వ అధికరణం ఈ దేశంలోని పౌరులందరికీ జీవించే హక్కు ఉన్నదని చెప్పింది. ఇంటి సౌకర్యం జీవించే హక్కులో భాగమేనని గత సంవత్సరం ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఇంటి కోసం ప్రైవేటు భూముల్లోకి పోజాలరు కదా! పేదలు మరొకరి సొమ్ము ఆశించరు. కష్టార్జితంతో బతుకుతారు. కానప్పుడు పాలకులు ఆదుకోవాలంటారు. కనీస వేతనాలు కూడా లేవు. కేంద్రంలో బీజేపీ సర్కారు, కనీస వేతనం రోజుకు రు.178గా నిర్ణయించింది. అంటే నెలకు రు.4628. ఈ వేతనంతో కుటుంబం బతకాలట! ఇక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర పాలకులు కోటి మంది కార్మికులకు వర్తించే కనీస వేతనాలు సవరించలేదు. కుటుంబపోషణకే చాలని వేతనాలతో, పేదలు జీవితకాలమంతా పనిచేసినా, ఇంటిస్థలం కూడా కొనలేరు. ఇక ఇల్లు కట్టేదెప్పుడు? అందుకే ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ స్థలాలంటే ప్రజల ఆస్తి. అందుకే ప్రజలు గుడిసెలు వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు గృహలకిë పథకం విధివిధానాలు ప్రకటించింది. ఇది సమస్య పరిష్కారానికి ఉపయోగపడదు. రిజిస్టరయిన ప్లాటు, రేషన్‌కార్డు ఉన్న పేదలకే వర్తిస్తుంది. అదికూడా ఆ ప్లాటు మహిళ పేరు మీద ఉంటేనే. దేశంలో సాధారణంగా ఆస్తి పురుషుల పేరు మీదనే ఉంటున్నది. ఇక ఈ పథకం వర్తించేంది ఎవరికి? ఎక్కడో ఒకరున్నా, వారు డబుల్‌ బెడ్రూం ఇల్లు నక్ష దాఖలు చేస్తే వచ్చేది రూ.3లక్షలు. ప్రభుత్వం గుండుగుత్తగా నిర్మించే ఇండ్లకే రూ.8.5లక్షలవు తున్నపుడు, రూ.3లక్షలు ఏమూలకు? ఎవరికి వారు నిర్మించుకుంటే ఖర్చు రెట్టింపవుతుంది. ఇంత చేస్తే, ఈ పథకం వర్తించేది సొంత ప్లాటు ఉన్నవారికే. ఇంటి జాగ కూడా లేని లక్షలాది పేదల పరిస్థితి ఏమిటి? జీఓ నెం.58, 59 కూడా విడుదల చేసింది. ఆచరణలో ప్లాటు ఉన్న పేదలకు వర్తించే జీఓ నెం.58 ప్రచారం కోసమే. ప్రభుత్వ భూములు కారుచవకగా పెద్దలకే జీఓ నెం.59 పేరుతో కట్టబెడుతున్నారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు, మునిసిపల్‌ అధికారులు, రియలెస్టేట్‌ కబ్జాదారులతో కుమ్మక్కవు తున్నారు. అనేకచోట్ల పేదల మీద దాడులు చేస్తున్నారు. బడాబాబుల కబ్జాలను మాత్రం పట్టించుకోరు. రంగారెడ్డి జిల్లాలో 17వేల ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లాలో 5వేల ఎకరాలు కోటీశ్వరుల కబ్జాలో ఉన్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటి కబ్జాకోర్లతో కుమ్మక్కై దాడులకు తెగబడుతున్నారు. అనివార్యమైతే కబ్జాకోర్లమీద సివిల్‌ కేసులు పెడతారు. పేదలమీద మాత్రం దాడులు చేసి, క్రిమినల్‌ కేసులు పెడుతున్నారు. మహిళలు, గర్భిణులని కూడా చూడకుండా లాఠీచార్జి చేస్తున్నారు. 530మంది పేదలమీద కేసులు బనాయించారు. 35మంది మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మోపారు. వీరంతా దళితులు, బడుగు బలహీన వర్గాలే. 212మంది గుడిసెవాసులను బైండోవర్‌ చేసారు. మహిళలతో సహా 54మంది పేదలను జైలుకు పంపారు. ఆదివాసీ యువకుడి మీద పీడీ చట్టం ప్రయోగించారు. పోలీసు దాడులలో 248మంది గాయపడ్డారు. దాడులకు గురైనవారిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులవారే. మూకుమ్మడిగా గుడిసెలు తగులబెట్టారు. ఈ పరిస్థితుల్లోనే పేదలకు అండగా పోరాటవేదిక నాయకత్వ బృందం బస్సుయాత్ర చేసింది. మహబూబాబాద్‌లో యాత్ర ప్రారంభంలోనే అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేసారు. రియలెస్టేట్‌ గద్దలు ఇచ్చిన బుల్డోజర్లు, జేసీబీలతో పోలీసులు గుడిసెలమీద దాడి చేసిన స్థలంలో, పేదలను పరామర్శించేందుకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బృంద నాయకుల మీద, ఫొటోగ్రాఫర్‌, బస్సు డ్రైవర్లమీద దౌర్జన్యం చేసారు. బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేదలు ప్రతిఘటించిన తర్వాతనే వెనక్కి తగ్గారు.
కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కమిటీల పేర్లతో, అగ్రవర్ణ పెత్తందార్లు కూడా యాత్రకు ఆటంకాలు సృష్టించారు. కామారెడ్డి దగ్గర జంగంపల్లిలో యాత్ర బృందానికి గ్రామంలో ఎవరూ సహకరించవద్దని హుకుం జారీ చేసారు. గుడిసెవాసులతోనే బసచేసిన బృందాన్ని వీరి ఆంక్షలు ఏమీ చేయలేకపోయాయి. గుడిసెవాసులు ఇంటికి ఇద్దరి చొప్పున భోజనానికి ఆహ్వానించారు. అక్కడే భోంచేస్తారని పెత్తందార్లు ఊహించలేదు. జగిత్యాలలో సభ నిర్వహణకు ఫంక్షన్‌హాల్‌ ఇవ్వకుండా అడ్డుకున్నారు. వర్షంలోనే పేదలు సభలో పాల్గొన్నారు. గుడిసెవాసులే పన్నెండు కుటుంబాలు బృందానికి ఆతిధ్యం ఇచ్చారు. చెన్నూరు గుడిసెల్లోకి 7అడుగుల పాము వచ్చింది. ఇల్లందు గుడిసెవాసుల మధ్యకు కొండచిలువ వచ్చింది. అమరచింత గుడిసెల్లో ఒక తల్లి నిద్రలేచేసరికి పక్కనే పెద్ద తేలు ఉన్నది. సూర్యాపేట జిల్లా కాపుగల్లు గుడిసెల కేంద్రంలో సభలోకి పాము వచ్చింది. ఎండ, వాన, చలిని లెక్కచేయక, ఆ గుడిసెల్లోనే బతుకుతున్నారు పేదలు.
ఇల్లు వాకిలి లేక పేదలు ఇబ్బందులు పడుతుంటే కొందరు ప్రజాప్రతినిధులు వింతవాదనలు చేస్తున్నారు. మహబూబాబాద్‌ ప్రజాప్రతినిధి పేదలను ‘ఎక్కడ పుట్టి ఇక్కడ గుడిసెలు వేస్తున్నార’ని దూషించారు. పేదలు కూడా ఆయన్ను ‘ఎక్కడ పుట్టి ఇక్కడ శాసనసభ్యుడివయ్యావ’ని ప్రశ్నిస్తే ఏం జవాబు చెపుతారు. ఏ జిల్లాలో పుట్టి, పెరిగినా మహబూబాబాద్‌లో పోటీ చేసే హక్కు ఆయనకు రాజ్యాంగం ఇచ్చింది. పేదలు కూడా ఎక్కడ పుట్టినా మహబూబాబాద్‌లో పనిచేసుకుంటూ, అక్కడే స్థిరపడే హక్కు అదే రాజ్యాంగం ఇచ్చింది. బాధ్యతాయుత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి రాజ్యాంగవిరుద్ధంగా మాట్లాడుతున్నారు. జగిత్యాలలో ఇద్దరు కౌన్సిలర్లు గుడిసెల కేంద్రం నాయకుల మీద దాడులకు తెగబడ్డారు.
మెదక్‌లో గత ప్రభుత్వాలు పేదలకు కేటాయించిన భూమిలోనే ఇప్పుడు గుడిసెలు వేసారు. ఆ పరిసరాలలోనే ఇప్పుడు కొత్తగా కలెక్టర్‌ కార్యాలయం వెలిసింది. భూముల ధరలు పెరిగాయి. పేదలకు ఇంత విలువైన భూమి ఎట్లా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. వీరి దృష్టిలో మనుషులకు విలువ పెరగదు. విలువైన భూములు ‘పెద్దల’ కబ్జాల కోసమేనన్నమాట! నాగర్‌కర్నూల్‌ జిల్లా గగ్గలపల్లి గ్రామంలో కూడా గత ప్రభుత్వాలు పేదలకు పట్టాలిచ్చిన భూమిలోనే గుడిసెలు వేసారు. ఇప్పుడు దానిపక్కనే మునిసిపల్‌ అధికారులు చెత్త డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేసారు. అయినా పేదలు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఆ చెత్త డంపింగ్‌ కోసం వీరి గుడిసెలు కూడా ఖాళీ చేయాలని వత్తిడి. చెత్తకున్న విలువ కూడా పేదల బతుకులకు లేదు. అమరచింత గ్రామపంచాయతీ ఎర్రజెండా చేతిలో ఉన్నప్పుడు పేదల ఇండ్ల కోసం స్థలం సేకరించారు. ఆ స్థలాన్ని అభివృద్ధి పేరుతో మండల కార్యాలయం, తదితర అవసరాలకు కేటాయిస్తామంటున్నారు ఇప్పటి అధికారులు. వాటికోసం స్థలం వదులుకోగా కూడా ఇంకా ఖాళీ జాగా ఉన్నది. అయినా పేదలు అర్హులు కాదట! నాగర్‌కర్నూలు జిల్లా డిండి చింతపల్లి గ్రామంలో కూడా ఇదే వ్యథ. జగిత్యాలలో 20ఏండ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న యాభై వడ్డెర, బుడిగెజంగాల కుటుంబాలకు రేషన్‌కార్డులు, ఓటుగుర్తింపు కార్డులు కూడా ఉన్నాయి. అయినా ఇప్పుడు ఖాళీ చేయాలని వత్తిడి చేస్తున్నారు.
ఎక్కడ చూసినా, ఈ పోరాటంలో మహిళలు వేలాదిగా తరలివస్తున్నారు. తెగించి పోరాడుతున్నారు. మరుగు కావల్సింది మహిళకే కదా! ఈమాత్రం సోయి లేని పాలకుల బాధ్యతారాహిత్యం వల్లనే మహిళలు పోరుబాట పట్టక తప్పలేదు. అందుకే పోలీసుల దాడులు కూడా ఖాతరు చేయటంలేదు. జక్కలొద్దిలో మహిళలను అవమానించిన ఒక పోలీసు అధికారి మీద అర్ధరాత్రి మహిళలు తిరగబడిన తీరు అభినందనీయం. డిగ్రీలు, పీజీలు చదివిన విద్యావంతులు గణనీయంగా ఉన్నారు. కొన్ని గుడిసెల కేంద్రాల నాయకులు మహిళలే కావటం ఆహ్వానించదగినది. గుడిసెల మధ్యలోనే గోదావరిఖని, భూపాలపల్లి కేంద్రాలలో వీరనారి మల్లు స్వరాజ్యం పేరుతో నిర్మించిన విజ్ఞాన కేంద్రాలను పోరాటవేదిక నాయకులు ప్రారంభించారు. హన్మకొండలో కూడా అంబేద్కర్‌ పేరుతో విజ్ఞానకేంద్రం నిర్మించుకున్నారు.
కోరుట్ల గుడిసెవాసులలో ముస్లిం మైనారిటీలు కూడా గణనీయంగా ఉన్నారు. ముస్లిం మహిళలు రేయింబవళ్ళు గుడిసె కేంద్రాలలో ఉండటం మత ధర్మానికి విరుద్దమని కొందరు మొదట రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. ‘ధర్మబద్ధంగా జీవించడానికి ఇండ్లు కట్టిస్తే, ఇంట్లోనే ఉంటాము కదా’ అని ముస్లిం మహిళలు తిప్పికొట్టారు. హిందువులకు, ముస్లింలకు మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను కూడా ఐక్యంగా ఎదుర్కొన్నారు. గుడిసెవాసుల నాయకత్వ బృందంలో ముస్లిం మహిళ కూడా ఉన్నారు. యాత్ర బృందానికి హిందూ మహిళలు బతుకమ్మలు అందించగా, ముస్లిం మహిళలు టోపీలు బహుకరించి, ఎర్ర కండువాలు కప్పారు. మెడలో ఎర్రకండువా, నెత్తిమీద టోపీ, చేతిలో బతుకమ్మలతో మత సామరస్యం, సాంస్కృతిక సహజీవనం, పోరాట స్ఫూర్తి వెల్లివిరిసింది. ఐక్య పోరాటాలకు కులమతాలు అడ్డు కారాదని చాటిచెప్పింది. రాష్ట్ర వ్యాపితంగా గూడులేని పేదలు పోరుబాటలో ఉన్నారు. ఇండ్లు, ఇండ్ల స్ధలాలు సాధించే దాకా ఈ పోరాటం ఆగదు.
ఎస్‌. వీరయ్య

Spread the love