విద్యపై రాష్ట్రాల హక్కులను లాక్కుంటున్న కేంద్రం

ఇప్పటికే మన చదవులు అంతంతమాత్రమే. ఇలాంటి విధానాలు తీసుకొస్తే గ్రామీణ,పేద వర్గాలు ఉన్నత విద్యకు మరింత దూరమయ్యే అవకాశం ఎక్కువ. దీంతో పాటు యూజీసీ స్ధానంలో వస్తున్న హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌ వ్యవస్ధలు భవిష్యత్‌లో రాష్ట్రాల మొరను పట్టించుకోవుగాక పట్టించుకోవు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ కమిటీలో రాష్ట్రాల భాగస్వామ్యానికి తగిన ప్రాధాన్యతనూ ఇవ్వదు. విద్యా రంగాన్ని పూర్తిగా తమ కంట్రోల్‌లో పెట్టుకుంటూ దేశ ప్రగతిని నిరోధిస్తుంది. రాష్ట్రాల ప్రాధాన్యతను హరిస్తూ, సమైఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టులాంటి ఈ విద్యావిధానానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
దేశ భవిష్యత్తును మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య. అలాంటి ప్రాధాన్యత కలిగిన విద్యారంగంలో మార్పులు అవసరమైతే గనుక అనేక చర్చలు జరగాలి. సమావేశాలు నిర్వహించాలి. విద్యావేత్తల సలహాలు తీసుకోవాలి. కానీ అవేమి లేకుండానే ‘కరోనా’ కాలంలో గుట్టుచప్పుడు కాకుండా ఏకపక్షంగా తీసుకొచ్చింది ఏదైనా ఉందంటే అది ‘నూతన జాతీయ విద్యావిధానం’. 2020 జూలై 29న మంత్రిమండలి ఆమోదంతో ఇది అమల్లోకి వచ్చింది. గడచిన 34 సంవత్సరాల కాలంలో ఇది మూడవది. అంతకు ముందు 1968, 1986లో రెండు జాతీయ విద్యావిధానాలు అమలయ్యాయి. ఈ విధానం తీసుకురావడం పట్ల ఎవరికి పెద్దగా భిన్న అభిప్రాయాలు లేకపోవచ్చు కానీ ఈ విద్యావిధానంలోని అంశాల పట్లనే తీవ్ర వ్యతిరేకత కనబడుతున్నది. ఏ రాష్ట్రాన్ని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ విధానాన్ని తీసుకురావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ సమగ్రతకు, సుస్థిరతకు, భావితరాల భవిష్యత్తుకు ఫెడరల్‌ వ్యవస్థ బలమైన పునాది వేస్తుందనేది వాస్తవం. కానీ బీజేపీ ప్రభుత్వ విధానాల వలన ఫెడరల్‌ వ్యవస్థ బలహీనపడు తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే గవర్నర్ల జోక్యం, స్వతంత్ర సంస్థలతో రాజకీయ కక్ష సాధింపు చర్యలు సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న అం శాలపై కేంద్రమే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి ఉదాహరణ కూడా మన కండ్ల ముందు కనిపిస్తున్నది. అదే ‘నూతన జాతీయ విద్యా విధానం’.
నూతన జాతీయ విద్యతో దేశ భవిష్యత్‌ మారనున్నదని, నవభారత్‌ నిర్మాణం అవుతుందని గొప్పలు చెపుతున్నా పాలకులకు పార్లమెంట్‌లో ఎందుకు చర్చపెట్టలేదనేది ప్రశ్న? ఏ కొత్త విద్య విధానం తీసుకొచ్చినా అప్పుడున్న ప్రభుత్వాలు తన అనుకూల అంశాలు దానిలో ఎంతోకొంత ఉంటాయనేది వాస్తవమే. దీనికి భిన్నంగా ఈ నూతన జాతీయ విద్యావిధానం మాత్రం పూర్తిగా రాజ్యాంగం మౌలిక స్వభావానికి విరుద్ధంగా ఉందనేది తేటతెల్లమవుతుంది. రాజ్యాంగం ఉపోద్ఘాతంలో ఉన్న లౌకిక, సామ్యవాద అంశాలనే పరిగణలోకి తీసుకోలేదు. వీటిపై ఇప్పటికే అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలలో, విద్యారంగంలో లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తూ క్లాస్‌రూమ్‌లో మతాల పేరు మీద విద్యార్థుల్లో విభజన తీసుకొచ్చారు. కర్నాటక రాష్ట్రంలో హిజాబ్‌ ధరించిన అమ్మాయిలు పాఠశాలకు, కళాశాలకు రావొద్దనే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆందోళనలో జరిగాయి. వీటితోపాటు మైనార్టీ మతస్తులను ద్వేషించాలి అనే విధంగా ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. ఉదాహరణకు గతంలో సీబీఎస్సీ ప్రశ్నపత్రంలో ఒక మసీదును కూల్చడానికి ఎనిమిది మంది కరసేవకులు అవసరమైతే పది మసీదులను కూల్చాలంటే ఎంతమంది కరసేవకులు అవసరమనే ప్రశ్నలు అడిగారు. ఇవి మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు కావా? ఇలాంటివి విద్యార్థుల మెదల్లోకి ఎక్కించం ఎంతవరకు సమంజసం? పూర్తిగా సైంటిఫిక్‌ టెంపర్‌లేని అంశాలకు ప్రాధాన్యతనిస్తూ డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతం, ప్రజాస్వామ్యం, మొఘల్‌ పరిపాలనతో పాటు భగత్‌సింగ్‌, గాంధీజీ, అంబేద్కర్‌, పూలే, బసవన్న లాంటి మహనీయుల చరిత్రలను కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. ఉన్నవాటిలో నూ వక్రీకరణ చేస్తున్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్‌ వాళ్లకు లొంగిపోయిన సావర్కర్‌ అసలైన స్వాతంత్య్ర యోధుడిగా పాఠ్యాంశాల్లో అతని చరిత్రను పెడుతున్నారు. యోగా, జ్యోతిష్యం, కర్మశాస్త్రం, భూత వైద్య శాస్త్రాలను విశ్వవిద్యాయాల్లో కోర్సులుగా ప్రవేశపెడుతున్నారు.
విద్య అనేది మొదట్లో రాష్ట్రాల పరిధిలో ఉండేది అయితే 1976 సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగం పట్ల కనీసం రాష్ట్రాలను సంప్ర దించలేదు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అధికార బలంతో సమైక్యస్ఫూర్తిని దెబ్బతీస్తూ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌ లాంటి రాష్ట్రాలు గట్టిగానే వ్యతి రేకిస్తున్నాయి. ఈ నూతన జాతీయ విద్యావిధానంపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు.రేపు ఎన్‌ ఈపి అమలు చేయని, వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలకు నిధుల కోత కూడా విధిస్తారు. స్వయం ప్రతిపత్తితో కూడిన యూజీసీ లాంటి సంస్థలు రేపు ఉండవు గనుక బీజేపీ పాలిత ప్రాంతాల పట్ల చూపే ప్రేమ ఇతర రాష్ట్రాలపై ఉండద నేది స్పష్టం. ఇప్పటికే వివిధ జాతీయ స్దాయి పరీక్షలలో కేవలం హిందీ, ఇంగ్లీషులోనే కాకుండా ప్రాంతీయ స్థాయి భాషలో కూడా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్‌ ఉంది. కానీ ఎన్‌ఈపీలో కేవలం హిందీ, సంస్కృతానికి ప్రాధాన్యత ఇచ్చి ఇతర భాషల ప్రాధాన్యతను తగ్గిస్తుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.అసలు జాతీయ స్ధాయిలో కామన్‌విద్య లేనప్పుడు కామన్‌ పరీక్షలు ఎలా పెడతారనేది ప్రశ్న. జాతీయస్థాయి పరీక్షలు నిర్వ హిస్తున్న సంస్థ ఎన్‌టీఏ. ఈ సంస్ధకు ఎలాంటి శాస్త్రీయత ఉంది అనేది ఆలోచించాలి. రేపు జరగబోయే ప్రతి జాతీయ స్దాయి పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహించనున్నది. రేపు రాష్ట్రాలను సంప్రదించ కుండానే దేశంలో ఎక్కడైనా పాఠశాలలు కళాశాలలో ఏర్పాటు చేయవచ్చనే నిర్ణయం అమలు చేయనున్నారు. డిగ్రీ కోర్స్‌ చదవాలంటే కూడా జాతీయ స్థాయిలో ఎన్‌టీఏ నిర్వహించే పరీక్షలో అర్హత సాధిóంచే నిర్ణయాలు అమలు కాబోతున్నాయి. కోర్స్‌ కూడా నాలుగు సంవత్సరాలు చేసే ప్రయత్నం జరుగుతున్నది.
ఇప్పటికే మన చదవులు అంతంతమాత్రమే. ఇలాంటి విధానాలు తీసుకొస్తే గ్రామీణ,పేద వర్గాలు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం మరింత ఎక్కువ. దీంతో పాటు యూజీసీ స్ధానంలో వస్తున్న హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌ వ్యవస్ధలు భవిష్యత్‌లో రాష్ట్రాల మొరను పట్టించుకోవుగాక పట్టించుకోవు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ కమిటీలో రాష్ట్రాల భాగస్వామ్యానికి తగిన ప్రాధాన్యతనూ ఇవ్వదు. విద్యారంగాన్ని పూర్తిగా తమ కంట్రోల్‌లో పెట్టుకుంటూ దేశ ప్రగతిని నిరోధిస్తుంది. రాష్ట్రాల ప్రాధాన్యతను హరిస్తూ, సమైఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టులాంటి ఈ విద్యావిధానానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఆర్‌.ఎల్‌.మూర్తి
8247672658

 

Spread the love