ఇనుప గుగ్గిళ్లు…

తెలుగు రాష్ట్రాలు కళలకు పుట్టినిండ్లు. ఇక్కడ కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు కొదవ లేదు. ఆనాటి ఆదికవి నన్నయ భట్టారకుడి నుండి మొన్నటి నన్నె చోడుడు, నిన్నటి సినారే, నేటి సుద్దాల అశోక్‌ తేజ, చంద్రబోస్‌ వరకూ వేలాది మంది కవులు, రచయితలు తమ కావ్యాలు, రచనలు, పాటలతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు. తద్వారా భాషాభిమానులను వారు సాహిత్యామృతంలో ఓలలాడించారు. ప్రస్తుత యువకవుల్లో కూడా పలువురు నిశిత పరిశీలన, లోతైన అధ్యయనం చేసి రాస్తున్న కవితలు, సంకలనాలు కూడా అబ్బురపరుస్తున్నాయి. ఇదే సమయంలో ‘నేను కవిని కానన్న వాణ్ని కత్తితో పొడుస్తాను… రచయితను కానన్న వాణ్ని రాయెత్తి కొడతాను…’ అనే తరహాలో అనేక మంది కవిగా అనిపించుకోవటమే.. పత్రికల్లో తమ ఫొటోలు, వార్తలు రావటమే లక్ష్యంగా టన్నుల కొద్ది ‘ఇనుప గుగ్గిళ్ల’ను వండి వడ్డించి శ్రోతల మీదికి, వీక్షకుల మీదికి వదులుతున్నారు. దీంతో వాటిని విన్న వాళ్లకు, ఆ ‘మహత్తర కవితా గానాన్ని’ కళ్లారా చూసిన వాళ్లకు ఒక చెవిలోంచి రక్తం, మరో చెవిలోంచి చీము కారి… సొమ్మసిల్లి పడిపోతున్నారనేది పెద్దపెద్ద కవులే చెబుతున్న మాట. మండలాలు, జిల్లాల్లోనే కాదు, హైదరాబాద్‌లో పేరెన్నికగన్న పెద్ద పెద్ద ఆడిటోరియాల్లోనూ ఇదే పరిస్థితి కనబడుతోందని వారు వాపోతున్నారు. ఇంకోవైపు ‘నేను లేస్తే మనిషిని కాదు…’ అన్నట్టు సదరు కవి పుంగవులు… మైకు పట్టుకుంటే వదలకుండా అదే పనిగా, వరద ప్రవాహంలా కవితలు దంచి కొడుతుంటే… ఏం చేయాలో అర్థంగాక బిక్కచిక్కిపోతున్నారు అమయాక శ్రోతలు. ఈ క్రమంలో ఇటీవల ఒక కవి సమ్మేళనానికి హాజరైన ముఖ్య అతిథి… అక్కడికి హాజరైన కవుల సంఖ్యను చూసి, బేజారై… ‘నాకు ఇప్పుడే ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది.. అర్జెంటు పని ఉంది.. మళ్లీ వస్తా….’ అంటూ అక్కడి నుంచి చల్లగా జారుకున్నారట. అలా జారుకోవటం ద్వారా తాను బతికిపోయానంటూ చెప్పటంతో అక్కడున్న వారందరూ ఘొల్లుమన్నారు.
-బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love