ఇదేం… సం’దేశం’?

సినిమా అనేది ఒక పెద్ద మాద్యమం. అది మంచైనా, చెడైనా ప్రజలను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసే శక్తి దానికుంటుంది. ఈ నేపథ్యంలో ఒక సినిమా బాగుందా..? లేదా..? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటం సహజం. సదరు కథా నాయకుడు లేదా నాయిక, దర్శకుడి అభిమానులు సినిమా గురించి ఒక రకంగా చెబితే… ఆ అభిమానగణంలో లేని వారు మరో రకంగా కామెంట్లు చేస్తుంటారు. తటస్థంగా ఉండే ప్రేక్షకులు సైతం తమదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం పరిపాటి. కానీ ఈ మధ్య కాలంలో సినిమాలోని కథాంశం, అందులోని మంచీ, చెడులతో సంబంధం లేకుండా ఒక మతానికి చెందిన దర్శకుడు లేదా హీరో చిత్రమైతే అది బాగున్నా… చెత్తగా ఉందని చెప్పటం, ఒకవేళ బాగోలేకపోయినా తమ మతానికో లేదా వర్గానికో చెందిన వారు తీశారు కాబట్టి… ‘ఆహా, ఓహో’ అంటూ డబ్బా కొట్టటం చాలా మందికి ఫ్యాషనై పోయింది. మొన్నటి వరకూ ఉత్తర భారతానికే పరిమితమైన ఈ పిచ్చి… ఇప్పుడు దక్షిణాదికి, అందునా తెలంగాణకు పాకటం ఆందోళనాకరం. తాజాగా ఓ పురాణ గాథతో రూపొందిన ఒక అగ్రనటుడి సినిమా బాగోలేదన్నందుకు హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన విస్తుబోయేలా చేసింది. ఇలాంటి చర్యలతో మనం దేశానికి ఎలాంటి సందేశమిస్తున్నామో అర్థం కావటం లేదు.
-కేఎన్‌ హరి

Spread the love