రెయిన్‌ ఫైటర్‌..!

రాష్ట్రంలో కురుస్తున్న వానలతో నేల పులకించి రైతులు సంతోషంగా ఉన్నారు. నాలుగురోజులుగా ఎడతెరపిలేని ముసురుతో వాహనదారులు రోడ్ల మీద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా రెయిన్‌తో ఫైట్‌ చేస్తున్నారు.ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే రెయిన్‌ను తట్టుకోవాలి. అందుకు అందరూ రెయిన్‌ ఫైటర్‌ను ఆశ్రయిస్తున్నారు. ఫైటర్ల కోసం జనం ఎగబడుతున్న నేపథ్యంలో వాటి ధరలు కూడా పైకి ఎగబాకుతున్నాయి. అందులోనూ రకరకాల వెరైటీలు దర్శనమిస్తున్నాయి. పుట్‌ పాత్‌పై దుకాణాలు వెలుస్తున్నాయి. వంద రూపాయల నుంచి మొదలుకుంటే ఐదు వేల వరకు ధర పలుకుతున్నాయి. అయినా ఎవరి స్థోమతను బట్టి వారు కొంటున్నారు. అత్యధికంగా ప్రముఖ కంపెనీలు సైతం ఉత్పత్తి చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లోనూ విపరీతమైన గిరాకీ ఉన్నది. సందులో సడేమియా అన్నట్టు ఎవరికి ఇష్టమెచ్చినట్టు వారు డిమాండ్‌ను బట్టి ధరలు పెంచుతున్నారు. ఇదే కాబోలు ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలనేది నానుడి. వానలు మూడు లేదా నాలుగు నెలలు కురుస్తాయి. ఈ సమయంలోనే రెయిన్‌ కోట్లు అమ్ముడుపోతాయి. ఏడాదంతా గిరాకీ ఉండదు. కాబట్టి ఇప్పుడే దండుకుంటున్నారని వినియోగదారులు గునుక్కుంటున్నారు.
– గుడిగ రఘు

Spread the love