మా తాత ఎంత మంచోడో…

వాన కురిస్తే.. హరివిల్లు విరిస్తే… ఆ ఆనందమంతా తమదేనని ఉప్పొంగిపోతారు చిన్నారులు. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తూనే ఉంది. హరివిల్లు విరుస్తూనే ఉంది. దీంతో హైదరాబాద్‌ నగర పరిధిలోని పాఠశాలలన్నింటికీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. తొలుత గురువారం, ఆ తర్వాత శుక్ర, శనివారాలు కూడా బడులు బందయ్యాయి. ఇక ఆదివారం ఎట్టాగూ సెలవేనాయే. దీంతో బుడతల ఆనందానికి అవధులే లేవు. వచ్చిన చిక్కల్లా ఏంటంటే… పార్కుల్లో ఆడుకోవటానికి వీల్లేదు.. స్నేహితుల ఇండ్లకు వెళ్లటానికి అంతకంటే వీల్లేదు.. సరదాగా అమ్మా నాన్నలతో కలిసి ఏదైనా సినిమాకో, షికారుకు వెళదామన్నా అస్సలు కుదరకపోతుండే. ఆకాశానికి చిల్లులు పడ్డట్టు ఒకటే జోరువాన పడుతుంటే ఇటు ఇంట్లో ఉండలేక.. అటు బయటక పోలేక పిల్లలు తెగ ఇదైపోతున్నరు. ఈ క్రమంలో ఆదివారం నుంచి రానే వచ్చే. సోమవారం నుంచి మళ్లీ బడికిపోక తప్పదాయే. దీంతో మరింత బెంగపట్టుకుంది చిన్నారులకు. ‘మా కేసీఆర్‌ తాత ఎంత మంచోడో.. వరసగా నాలుగు రోజులు సెలవులిచ్చిండు. మళ్లీ వర్షం పడితే బాగుండు.. తాత మళ్లీ సెలవులిస్తే బాగుండు…’ అనుకుంటున్నారు భావి భారత పౌరులు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి రోడ్ల మీద వెళుతుంటే.. గల్లీ క్రికెట్‌ ఆడుతున్న పోరలు అన్నప్పుడు చెవిన పడ్డ మాటలివి.
-బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love