అవాంఛనీయ ట్రోలింగ్స్‌ ఆగేదెప్పుడు!

తెలుగునాట ఈనాటి సంక్షుభిత సమయంలో ఇద్దరు ప్రముఖ స్వతంత్ర జర్నలిస్టులు చాలా భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సహజంగానే భిన్న స్పందనలు కూడా వెలువడుతున్నాయి. వీరిలో ఒకరు యువ మహిళా యూ-ట్యూబ్‌ ప్రజెంటర్‌ తులసి చందు, మరొకరు కాకలు తీరిన అనుభవశాలి, రచయిత, విశ్లేషకులు, మాజీ కౌన్సిల్‌ సభ్యులు నాగేశ్వర్‌. అనతి కాలంలోనే తులసిచందు ఎక్కువ మంది ప్రజలను తన వీడియోలతో చేరుకున్నారు. ఆమె అభిప్రాయాలను సహించలేని వాళ్ళు ఆమెను పెద్ద ఎత్తున ”ట్రోల్‌” చేయసాగారు. ఆమెను కించపరుస్తూ, వ్యక్తిగతంగా అవమానిస్తూ, ”నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తామని” బెదిరిస్తూ, బూతులతో, జుగుప్సాకరంగా సోషల్‌ మీడియాలో దాడులు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా తమ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆయా రంగాల ప్రముఖులను కలుస్తూ, హైదరాబాద్‌లో నాగేశ్వర్‌ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. నాలుగు దశాబ్దాలకు పైబడి మధ్య నుండి ఎడమవైపు (లెఫ్ట్‌ ఆఫ్‌ ది సెంటర్‌) నిలబడి విశ్లేషణలు అందిస్తాడనే పేరున్న వ్యక్తి ఇంటికి ఈ కుడివైపు పార్టీ అధ్యక్షుడు వెళ్ళడంతో పెద్ద దుమారమే లేచింది. కొంత మంద్రస్థాయిలోనైనా సరే నాగేశ్వర్‌ను కూడా ఇంతకుముందు ఆయనను అభిమానించినవారే ట్రోల్‌ చేయసాగారు.
సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ సహజమే కదా అంటున్నారు చాలామంది. నిజానికి ఇది సహజం కాదు. సహజం చేయబడ్డాయి. ”నియంత్రణ కష్టమైన ఈ రంగంలో వైరి వర్గాల ఖండన మండనలు ఇలా వెర్రితలలు వేస్తుంటే మనలాంటి సామాన్యులేం చేయగలరు? ప్రభుత్వాలు మాత్రమే చేయగలవు” అని కూడా కొందరు నిస్సహాయత వ్యక్తం చేస్నున్నారు. కానీ ఈ వాదన కూడా బలహీనమైనదే. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ విమర్శ – ప్రతివిమర్శ స్థాయి దాటి, విడివిడి వ్యక్తుల ఆగ్రహావేశ ప్రకటనల స్థాయిని మించి, నేడు ఒక వ్యవస్థీకృత నేరమైంది. దీని నుంచి ఎవరినైనా ఎలా రక్షించగలం అనడం అమాయకమైన ప్రశ్న అవుతుంది. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు సరిగ్గా సంరక్షింపబడితే చాలు ప్రజలకు ఈ నేరాల నుంచి కచ్చితంగా రక్షణ దొరుకుతుంది. ఆ పని చేయాల్సిన సంస్థలు ఆ పని చేయనప్పుడు, ఈ నేరమయమైన ముఠాల నుంచి తమను తాము తమ చైతన్యంలో కూడదీసుకోడమే ప్రజల ముందున్న ఏకైక మార్గం.
లౌకికవాద భావజాలానికి వయస్సు మీద పడుతోన్న ఈ రోజుల్లో, తులసిచందు ఓ యువగళం. అందునా ఓ మహిళ హిందూత్వ భావజాలం ఉధృతంగా నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్న సమయాన, దానిని ప్రశ్నిస్తూ నుంచున్న ధిక్కార స్వరం తులసిచందు, నేరమయ ముఠాలు రంగంలోకి దూకాయి. తమ శత్రువును అవి బాగానే గుర్తుపడతాయి. ఆమెను ”నువ్వు అసలు హిందువే కాదు” పొమ్మన్నారు. నీ పేరులో మాత్రమే ”తులసి” ఉందని ఆవేశపడ్డారు. కానీ ఈ నేరమయ ముఠాలు ఏం సాధించదలుచుకున్నాయో అర్థం చేసుకోవాలి. మొదటగా తులసిచందు పట్ల గౌరవాన్ని పోగొట్టాలి. ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయాలి. తద్వారా ఆమె ఆమె వృత్తిని కొనసాగించడంలో ఎక్కువ దూరం వెళ్ళకుండా చేయాలి. ఆమెను స్వీయ రక్షణాత్మక వలయంలో పడవేయాలి. ఆమె తనేంటో తాను నిరూపించుకునే పనిలో పడితే అది వారి మెదటి విజయం. ఆమె భావ స్వేచ్ఛను నియంత్రించడమే వారి లక్ష్యం అంతటితో ఆగకుండా ఆమెకు భయాన్ని పరిచయం చేయాలి. ఎందుకొచ్చిన పీడ అని ఆమె వదిలేయాలి, స్వాతి చతుర్వేది ” అయామ్‌ ఎ ట్రోల్‌ ” చదివిన వారికి ఈ విషయం బాగానే అర్థమవుతుంది. సబ్రినా సిద్దిఖీ మోడీని పత్రికా విలేకర్ల సమావేశంలో భారత దేశంలో మానవహక్కుల గురించి, మైనారిటీల రక్షణ గురించి అడిగిన పాపానికి ఆన్‌లైన్‌ వేధింపులను ఎదుర్కొంటోంది.
రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు చేష్టలుడిగి చూస్తుండి పోయా యి. తులసిచందు పోలీస్‌ స్టేషన్‌లో ఇందుగురించి కేసు నమోదు చేశారు. ఇలా చేయాల్సి రావడం రెండవసారి. మొదటిసారి సాక్షాత్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చొరవతో నమోదైన కేసు. అది ఎక్కడా ముందుకు పడలేదు. తాడ్వాయి కుట్ర కేసులో పేర్లు దొరికాయని ఊపా కేసు పెట్టిన పోలీసులకు తులసిచందును ఎవరు వేధిస్తున్నారో పట్టుకోవడం అంత కష్టమా? కనీసం విచారణ కూడా చేయకుండా వదిలివేస్తున్నారు. కాబట్టే ఈ మూకలు మరింతగా పేట్రేగిపోతున్నాయి. ఇది ఇలా కొనసాగితే భౌతిక దాడులకు కూడా దిగుతారు. గౌరీలంకేష్‌, ధబోల్కర్‌, ఇంతకు ముందే ఇలాగే బలైపోయారు.
ఇక నాగేశ్వర్‌ విషయానికి వస్తే, రాజకీయ విశ్లేషకుడిగా అనేక మీడియా ఛానళ్ళ ద్వారా పలు విషయాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. పదునైన విశ్లేషణ, గణాంకాల సాక్ష్యం, వాదనలో వేగం, ప్రజా ప్రయోజనాల కోణం ఆయనను ఓ విశిష్ట స్థానంలో ఉంచాయి. ప్రధాన స్రవంతి మీడియాలో ఒక్కోసారి ఒంటరి పోరాటం చేస్తున్నారా అనిపించేంతగా ఆయన విశ్లేషణలు సాగేవి. ఆయన హఠాత్తుగా బీజేపీకి కలవాల్సిన ప్రముఖుడిగా ఎలా కనపడ్డారు? అదే చిత్రమైన విషయం వైరి పక్షాన్ని తగ్గించుకునే పనిలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. దాడి చేసి, భయపెట్టి, నిర్మూలించి తగ్గించుకోవచ్చు. పొగిడి, తటస్థంగా మార్చి, వీలైతే కలిపేసుకొని తగ్గించుకోవచ్చు. నాగేశ్వర్‌ ఈ వలలో పడ్డారని నేనారోపించడం లేదు. బీజేపీ నాయకునికి నాగేశ్వర్‌తో కలయికలో ఏదో ప్రయోజనం కన్పించి ఉండాలి. సోషల్‌ మీడియాలో తమవాళ్ళు వేధించిన మనిషి నేడు ప్రముఖునిగా కన్పడటం పాప ప్రాయశ్చిత్తంకోసమని భావించలేం కదా!
తులసిచందు తనకు రాజకీయాలు లేవన్నా, నాగేశ్వర్‌ తాను ఎడమా కాదు, కుడీ కాదు, తాను ఎప్పుడూ నేరుగానే ఉంటానని చెప్పినా ప్రజలు అంగీకరిస్తారని భావించలేం. తులసిచందు తనకు రాజకీయాలు లేవని చెప్పడం కావచ్చు, తన వృత్తిలో భాగంగానైనా సరే ఆమె ఎంచుకుంటున్న విషయాలు రాజకీయపరమైనవి. వాటిలో విశాల ప్రజా బాహుళ్య ప్రయోజనాల కోణం ఉంటోంది. మోసం చేస్తున్న వారిని నిలదీయడం ఉంటోంది. తనకు రాజకీయాలు లేవనడం కన్నా, ప్రజల వైపున చేసే రాజకీయాలు తనకున్నాయని విస్పస్టంగా ప్రకటించడమే మేలు. నాగేశ్వర్‌ తాను ఎడమా కాదు, కుడీ కాదు నేరుగా ఉంటానని అనడం కూడా ఇంచుమించు ఇలాంటిదే – ”నేరుగా ఉండే విషయాలనే వామపక్షం మాట్లాడుతుంది.. అవి నేరుగా లేకపోతే అవి వామపక్ష విషయాలు కాదు” అని మాట్లాడితే ఇంకా మరింత సబబుగా ఉండేది. పార్టీలు ప్రధానం కాదు – విషయాలు ప్రధానం అని చర్చించి వుండాల్సింది.
బీజేపీ తాజా మాజీ అధ్యక్షుడు నాగేశ్వర్‌ను కలవాలనుకోవడం వెనుక ఏం జరిగి ఉండవచ్చు? నాగేశ్వర్‌ స్వతంత్ర జర్నలిస్టుగానే కాదు, తటస్థ విశ్లేషకుడుగా కన్పించడం మొద లయి ఉండాలి. అక్కడే చిక్కంతా ఉంది. ఆయన తటస్థంగా ఉన్నారని బీజేపీ భ్రమించిందా? లేక అదే వాస్తవమా? ఎక్కువ మందిని చేరుకునే వ్యూహంలో భాగంగా తనను తాను ఆయన తటస్థంగా ఉంచుకోదలిచారా? మోడీ జనాకర్షణ శక్తి గురించి మాట్లాడినప్పుడో, కృషి ఉంటే మనుషులు కిషన్‌రెడ్డి అవుతారని చెప్పినప్పుడో, మర్యాద పురుషోత్తముడైన రాముడిని కీర్తించి నప్పుడో, పాకిస్థాన్‌ పై బాలాకోట సైన్యంపై దాడులను కీర్తించినప్పుడో వారికి ఆ తటస్థ స్థానం కనపడి ఉండాలి. పార్లమెంటు భవనాన్ని మోడీ ప్రారంభిస్తే తప్పేంటి? అన్న నాగేశ్వర్‌ వాదన సాక్ష్యంగా కన్పడి ఉండవచ్చు. నిజానికి తటస్థ స్థానంతో పాము విరగదు – కర్ర చావదు. మనందరికీ నేటి రాజకీయ పార్టీలతో అనేక స్థాయిలలో పేచీ ఉండవచ్చు. కానీ కేంద్రం నుంచి ఎడమ వైపునకు ఉన్న రాజకీయాలతో పేచీ అక్కర్లేదు. ఆ విషయం చెప్పడానికి సందేహించ నక్కరలేదు. లౌకికదేశంగా ఈ దేశాన్ని మిగుల్చు కోవడానికి, రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులను కాపాడుకోవడానికి మనం ప్రజాప్రయోజనం దిశగా అంటే కేంద్రం నుంచి ఎడమవైపుకే నిలబడి కలబడవల్సివుంది. ఇప్పటికిప్పుడు నాగేశ్వర్‌ను ఈ కారణంగా ఎవరు ట్రోల్‌ చేసినా అది తప్పిదమే అవుతుంది. బీజేపీ సోషల్‌ మీడియా ఆశించిందే మీరంతా చేసినట్లు అవుతుంది. ఒక శక్తివంతమైన మనిషిని కాసేపు ఈ శక్తులకు ఎదురుగా నిలబెట్టినా అదొక కావల్సిన డైవర్షన్‌. తులసిచందుపై ట్రోల్స్‌ అనాగరికం, జుగుప్సాకరం. అలాగే నాగేశ్వర్‌పై ట్రోల్స్‌ కూడా అవాంఛనీయం, అనవసరం.
సెల్‌:9848809990
ఐ.వి. రమణారావు

Spread the love